తెలుగు సినీ జగత్తులోనే కాక ప్రపంచ సినీజగత్తులోనూ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ఒక గొప్ప సినీ రచయిత. విభిన్నమైన పాటలు రాయటంలోనే కాదు అసంఖ్యాకమైన పాటలు రాయటంలోనూ చరిత్ర నెలకొల్పారు. ప్రత్యేకంగా కొంతమంది రచయితలు ఒక్కో టైపు పాటలకే పరిమితమయ్యారు. కొందరు జానపదాలు, మరికొందరు భావగీతాలు, ఇంకొందరు హాస్యగీతాలు, ఇంకా భక్తిగీతాలు, కొందరేమో మనసును హత్తుకునే పాటలు రాసి ప్రసిద్ధి పొందారు. కానీ సినారె గారు ఈ అన్నిరకాల పాటలు రాయటం జరిగింది - అవి ఎంతో పాపులర్ కూడా అయ్యాయి. తక్కువ సమయం తీసుకుని పాటలు రాయటం అనేది సినారె గారి ప్రత్యేకత. దాదాపుగా మూడు దశాబ్దాలు సినీ రాజ్యాన్ని ఏలిన రారాజు సినారె.
సినీ రంగంలో ఎక్కువ పాటలు రాయటమే కాదు బయట కూడా ఎన్నో పుస్తకాలు రాసి అక్కడా గొప్ప పేరుతెచ్చుకున్న గొప్ప కవి సినారే ఒక్కరే. కవిగా సాహిత్య అకాడమీ అవార్డు అందుకోవడం ఒక ఎత్తైతే, తెలుగు ప్రజల మనసులు గెలుచుకోవడం మరెంతో గొప్పది. ఆయన రాసిన ఎదో ఒక పాట ఎవరో ఒకరిని కదిలిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇది నారాయణరెడ్డి గారు రాసిన పాట అని తెలియకుండానే ఎదో ఒక పాటకు కట్టుబడి పోతారు, ప్రేమికులవుతారు. అన్నిరకాల పాటలు రాసి అందర్నీ మెప్పించిన మహాకవి సినారె. ఘజల్స్ అనేవి సామాన్యంగా ఉర్దూ, హిందీలలోనే ఉంటాయి. కానీ వాటిని తెలుగులో ప్రవేశపెట్టిన ఘనత సినారె గారిదే. వాటిని రాయటమే కాదు తన స్వగళంతో ఒక రికార్డును (తెలుగు గజళ్ళు) కూడా రసమయి ద్వారా విడుదల చేయటం జరిగింది. చాలామంది సినీ కవులు అప్పుడప్పుడు చిత్రాల్లో కనిపిస్తుంటారు. అలాగే సినారె గారు కూడా దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన తూర్పు పడమర (1976) చిత్రంలో కవిగా కనిపించారు.
ఎన్టీఆర్ గారికి సినారే గారికి గొప్ప స్నేహం ఉంది. సినారెను తన సొంత చిత్రం గుళేబకావలి కథ (1962) ద్వారా సినీ రంగానికి పరిచయం చేశాడు ఎన్టీఆర్. ఆ చిత్రానికై కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై అనే పాటను సినారె గారు మొదటిసారిగా రాయటం జరిగింది. కాగా అదేచిత్రంలోని నన్ను దోచుకుందువటే అనేపాట మొదటగా రికార్డు చేయబడింది. తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో చాలా హిట్ చిత్రాలు వచ్చాయి. అంతేగాక తన సొంత చిత్రాలు ఎన్నిటికో సినారే గారిచేతనే పాటలు రాయించారు ఎన్టీఆర్ గారు. అలాగే ప్రముఖ నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ పతాకంపై తీసిన తన చిత్రాలన్నిటికీ సినారె చేతనే పాటలు రాయించారు. అవి చాలా పాపులర్ కూడా అవ్వటం జరిగింది.
కురుక్షేత్రం, దానవీర శూరకర్ణ పోటాపోటీగా నిర్మించబడి జనవరి 14 న ఒకేరోజున విడుదలై ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించాయి. ఈ రెంటిలో ఒక చిత్రంలో పనిచేసేవారు ఇంకో చిత్రంలో పనిచేయకూడదు అనే నిబంధన విధించిన ఎన్టీఆర్ సినారే గారికి మినహాయింపు నిచ్చారు. ఈ రెండింటిలోనూ సినారె రాసిన పాటలే హైలైట్ గా నిలిచాయి.
సినారె తెలంగాణా కవి కావడం వలన సహజంగానే వారి కొన్ని పాటల్లో అనుకోకుండానే వచ్చిన ఎన్నో తెలంగాణా పదాలు, ఉర్దూ పదాలు మనకు వారి పాటలలో వినిపిస్తాయి. హైదరాబాదు పేరున, నేపథ్యంలో రాసిన పాటలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఉదాహరణకు : హైదరాబాద్ బుల్ బుల్ హే చార్మినార్ చంచల్, అల్లా యా అల్లా రకరకాలుగా నసీబు రాసి తమాషా చూస్తవేమయ్యా, మోతీమహల్ లో చూసానా!, రింఝిమ్ రింఝిమ్ హైదరాబాద్, రంజుభలే రామచిలక, పొన్నపూల ఉయ్యాల, అంతే నకుచాలూ తమలపాకు తొడిమే పదివేలు, తాడిచెట్టు తల్లీకాదు తాగినోడు మొగుడూ కాదు, చుక్కల్లో పెదచుక్క చందమామ, వచ్చేవచ్చే వాన జల్లు జామ్మదియేలో, మేడలో చేరిన చిలకమ్మా వాడనే మరిచిందోయమ్మా, చెవిపోగుపోయింది చిన్నవాడా, పబ్లికురా ఇది అన్నీ తెలిసిన పబ్లికురా, దంచవే మేనత్తా కూతురా, అల్లాయే దిగివచ్చి.... స్నేహమేనా జీవితం స్నేహమేరా శాశ్వతం, బండెన్క బండి గట్టి మూడెడ్ల బండి కట్టి, సంకురాత్రి అల్లుడు, ఓలమ్మో ఓరి నాయనో, గంపనెత్తినబెట్టి గట్టుమీద పోతుంటే గుండె ఝళ్లుమన్నాదే రంగమ్మ, గౌరమ్మతల్లికి బోనాలు, పచ్చగడ్డి కొస్తుంటే పాలేరు కన్నుగొట్టె, నజరానా ఈ నాజూకైన హసీనా, ఆ పొద్దు ఈ పొద్దు, ఆగు జరజర నర్సమ్మ (పాటంతా తెలంగాణా పదాలతోనే నిండి ఉంటుంది), పుత్తడిబొమ్మ మాపెళ్లికొడ్కు పున్నమిరెమ్మ మాపెళ్లికొడ్కు, జిగినీల గొలుసోయమ్మ, హే ప్రేమించుకుందాం ఎవరేమన్న ఏమన్నగాని (ఏమన్నగాని అనే తెలంగాణాపదం - ఏమైనాఅయిపోనీ అనేదానికి వాడతారు). ఇలా ఎన్నో తెలంగాణా, ఉర్దూ పదాలను సినారె పాటల నుండి తీసి ఒక పుస్తకంలా రాయొచ్చు, ఒక పరిశోధనాత్మక వ్యాసంగానూ రాయొచ్చు.
పాటల సంఖ్యా పరంగా తెలుగు సినీ జగత్తులో సినారె పైస్థానంలో ఉంటారు. వారి పాటలన్నిటినీ సేకరిస్తేనే గాని తెలియదు, వారు మొత్తం ఎన్ని పాటలు రాశారో. ఒక రికార్డు రావాలంటే దానికి తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుంది, అంటే పాత గ్రామఫోన్ రికార్డులు, కేసెట్స్, సీడీలు వంటివి. (గాయని శ్రీమతి సుశీల గారు ఇలా అభిమానుల రికార్డుల సేకరణతోనే అత్యధిక పాటలు పాడిన గాయనిగా గిన్నిస్ రికార్డ్ పొందటం జరిగింది). సినారె పాటల సేకరణకై ఎవరో ఒకరు పూనుకుంటారనే ఆశిస్తాను. అది జరిగితే సినారె పేరు ప్రపంచ చిత్రజగత్తులో ఆచంద్రతారార్కంగా ఉండిపోతుంది. నా దగ్గర కూడా కొన్ని వేల రికార్డులు ఉన్నాయి.
HMV రికార్డ్స్ కంపెనీ వాళ్ళు తెలుగు ఓల్డ్ హిట్స్ రికార్డ్స్ విడుదల చేస్తూ సినారె రాసిన పాపులర్ పాటలనే ఆ రికార్డులకు టైటిల్ గా పెట్టారు (పిల్లన గ్రోవి పిలుపు-శ్రీకృష్ణ విజయం, పొన్నపూల ఉయ్యాల-చందన, కొండపైన వెండివాన-ఇంటిదొంగలు, నా పేరు సెలయేరు-అనుబంధాలు), యాదృచ్చికంగానే అయినా ఇలాంటి ఘనత మరే సినీ సంగీత రచయితకు దక్కలేదు. ఈ రికార్డులన్నీ ఒకేసారి కాకుండా గ్యాప్ తో విడుదలైనవే.
సినారె గారు రాసిన పాటలలో పాపులర్ పాటలు వందలు కాదు వేలల్లోనే ఉన్నాయి - ఆ పాటల లిస్టు తరువాతి టపాలో ఉంచగలను.
No comments:
Post a Comment