Showing posts with label లింగానికి ప్రతిరూపమే బతుకమ్మ. Show all posts
Showing posts with label లింగానికి ప్రతిరూపమే బతుకమ్మ. Show all posts

Thursday, 2 October 2014

లింగానికి ప్రతిరూపమే బతుకమ్మ

ఈ మద్యన శాస్త్రజ్ఞులు ఈ సృష్టి దేని నుండి ఉద్భవించి ఉండవచ్చునని పరిశోధించి దానిని  "గాడ్ పార్టికల్" అని చెబుతున్నారో అదే బ్రహ్మ పదార్థము/లింగము అని మన శాస్త్రాలు ఏనాడో చెప్పాయి. ఆ గార్డ్ పార్టికల్ అనేదే లింగం. ఆ రూపాన్నే ప్రపంచం అతి ప్రాచీన కాలాన్నుండీ ఆరాధిస్తూ వస్తుంది. 

లింగారాధన బహు ప్రాచీనం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నాగరికతల్లో ఈ లింగారాధన బయల్పడింది. ఈ లింగాకారాన్ని ఈజిప్టులు నైలూ నది తీరాన పూజించారు. గ్రీకుల ఆరాధనలో లింగరూపం ప్రాధాన్యం పొందింది. అమెరికనుల మయాన్ నాగరికత లో ఆరాధింపబడింది లింగారూపమే. మక్కా, వాటికన్ సిటీ లాంటిప్రాంతాల్లో లింగారాధన జరుపబడిందని అక్కడ బయల్పడ్డ ఆధారాలు చెబుతున్నాయి. ఏకంగా వాటికన్ సిటీ ఒక శివలింగాకార రూపంలోనే ఉంటుంది. అతి ప్రాచీనమైన ఈ లింగారాధన మన భారతదేశంలోనూ హరప్పా, మొహంజదారో, లోథాల్ జరుపబడిందని అక్కడ లభించిన ఆధారాల ఆధారంగా తెలుస్తుంది. 


లింగాకారానికి, లింగ శబ్దానికి శృతి, స్మృతి, పురాణాల్లో చెప్పబడిన నిర్వచనాల్లో కొన్ని:

"సర్వస్య చరాచరాత్మకస్య ప్రపంచస్య యల్లింగం ప్రభవ లీనస్థానం,
లీయతేస్మిన్ అంతకాలే జగత్సర్వం సృష్టికాలే బహిర్గచ్చంతి లింగం"
అర్థం: చరాచరాత్మకమైన ప్రపంచపు ఉత్పత్తికి, లయములకు లింగమే స్థానభూతము, అందునుండే సకలమూ జనించి తిరిగి అందులోనే లయమగచున్నవి.  

"లీయతే గమ్యతే యత్ర యేన సర్వం చరాచరమ్, తదే తల్లింగమిత్యుక్తం లింగ తత్వ విశారదై:" 
అర్థం: ఈ ప్రపంచమంతనూ లింగము నుండే ఉద్భవించి తిరిగి లింగమునందే లయమగుచున్నది అదే లింగతత్వం. 

"లీనం గమయతీతి లింగం"
అర్థం: దేనిలో సమస్తమూ లయమునొంది తిరిగి పుట్టుచున్నదో అదే లింగం. 

"లీనం ప్రపంచ రూపాని సర్వమేతత్ చరాచరమ్, సర్వదా గమ్యతే భూయా స్తస్త్మాల్లింగముదీరితిం" 
అర్థం: సర్వమూ లింగమందు లీనమై ఆ లింగము నుండే మరల మరల ఉత్పత్తి అగుచుండును. 

"లీయతే యాత్ర భూతాని నిర్గచ్చంతి యతః పునః, తేన లింగం పరం వ్యోమ నిష్కలః పరమః శివః"
అర్థం: ఉత్పత్తి, స్థితి, లయులకు కారణభూతమైనట్టిదే లింగము. ఆ పరమ శివుడే లింగ పరబ్రహ్మమే రూపము.  

"లింగగర్భే జగత్సర్వం, త్రైలోక్యం సచరాచరమ్, లింగ బాహ్యాత్ పరం నాస్తి, తస్మాల్లింగమ్ ప్రపూజయేత్"  
అర్థం: లింగం లోపలే త్రిలోకములతో బాటు ఈ జగత్తులోగల సర్వము అంతా ఉంది, లింగము బయట మరేదీ లేదు, కావున ఆ లింగమును పూజించవలె. 

"సర్వం ఖల్విదం బ్రహ్మ లింగం తద్బ్రహ్మ సంగతం, తల్లింగం బ్రహ్మశాశ్వతం లింగంబ్రహ్మస్సనాతనం"
అర్థం: సర్వమూ బ్రహ్మమే, ఆ బ్రహ్మమే లింగము, మొదటినుండీ లింగమూ-బ్రహ్మమూ ఒక్కటే. 

"తల్లింగం పరమంబ్రహ్మ సచ్చిదానంద లక్షణం, నిజరూపమితిధ్యానాత్తదావాస్తా ప్రజాయతే"
అర్థం: లింగము పరబ్రహ్మము, అది సచ్చిదానంద స్వరూపము, ధ్యానించుటకు లింగము నిజరూపము. 

"అరూపం నిష్కళం బ్రహ్మ భావాతీతం నిరంజనం, శబ్దాది విషయాతీతం మూల లింగంహోచ్యతే"      
అర్థం: రూపం లేనిదీ, నిష్కలమైనదీ, భావాతీతమైనదీ, నిరంజన మైనదీ శబ్దాది విషయములకు అతీతమైనదే బ్రహ్మము, అదే మూలమైన లింగము. 

"లయంగచ్చతి యత్తైవ జగదేతత్ చరాచరమ్, పునః పునః సముత్పత్తిమ్, తల్లింగం బ్రహ్మ శాశ్వితమ్,
తస్మాల్లింగ మితిఖ్యాతం సదానంద చిదాత్మకమ్, బృహత్తాత్ బ్రహ్మనత్వాచ్చ బ్రహ్మశబ్దాభిదెయకమ్" 
అర్థం: ఏదైతే పరబ్రహ్మము నందు ఈ చరాచరాత్మక ప్రపంచము లయమునొంది తిరిగి జననమందునో అదే లింగ స్వరూపము. సచ్చిదానందాత్మకమైన(సత్-చిత్-ఆనంద), మహత్తరమైన అట్టి మహాలింగము  జగత్ సృష్టికి కారకమైనందున అది బ్రహ్మము అనబడుచున్నది. (బ్రహ్మపదార్థము అని మన శాస్త్రాలు చెప్పబడిన దానిని, నేటి శాస్త్రజ్ఞుల మాటల్లో God Particle అనబడుచున్నది.) 

ఇట్టి ఈ జగత్తుకు మూలమైన బ్రహ్మపదార్థమైన లింగాన్ని ప్రపంచం అంతటా  వివిధ నామాలతో పూజింపబడుతున్నది. ఈ బతుకమ్మ కూడా అట్టి లింగాకారమైనదే, మనం పూజిస్తుంది కూడా ఆ బ్రహ్మపదార్థాన్నే, ఈ బతుకమ్మ ఎప్పటినుండి మొదలైంది అన్నది మనకు తెలియకపోయినా ఈ పూజా తత్త్వం అన్నది ప్రాచీనమైనదే. రూపంలోనే కాక పూజించే పద్దతిలోనూ బహు ప్రాచీనత్వం కనబడుతుంది. మొదట్లో తెలంగాణాలోని ఎక్కువ ప్రాంతం అరణ్యాలు కొండ ప్రాంతాలే, కొంత భాగం దండకారణ్యం గానూ ప్రసిద్దమే. అడవుల్లో పూజించే విధానాలు ఈ పండగ ఆచారాల్లో కనిపిస్తాయి. మనుషుల ఆలోచనా పరిధితో బాటు కొన్ని కొన్ని నవీన ఆచారాలు ఈ బతుకమ్మ పండగలో కనిపించినా మూలతత్త్వం మాత్రం అలానే నేటికీ ఆచరణలో ఉంది. ఈ లింగాకారంలో పసుపు గౌరమ్మను ఉంచడం అన్నది శివునితో బాటు శక్తిని కలిపి పూజించటమే. బతుకు+ అమ్మ అనగా మన సృష్టికే మూలమైన లింగరూపము(బతుకు)  + అందులో పసుపు గౌరమ్మగా ఉంచబడే శక్తి (అమ్మ) రెండూ మిళితమై ఉంది.

ఈ బతుకమ్మ పూజకు ఏ మతంతో పనిలేదు - అది బ్రహ్మ పదార్థంగా అందరిచే పూజింప బడింది. అట్టి పరబ్రహ్మ పదార్థాన్ని పూజించటం అందరికీ శుభాదాయకమే.