Sunday, 24 December 2017

తెలంగాణా సాహిత్యాన్ని వెలికితీసి పదిలపరచటం ప్రథమ కర్తవ్యం


తెలంగాణా ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 అయిపోయాయి. అక్కడ ఎలాంటి తీర్మానాలు జరిగినట్టు లేవు. తొందర నిర్ణయాలు తీసుకోకుండా యావత్ తెలంగాణా సాహితీ వేత్తల, ఔత్సాహికుల అభిప్రాయాలు తీసుకుని తెలంగాణ తెలుగు కీర్తిని విశ్వవ్యాప్తం చేయటానికి, పరిరక్షించి ముందు తరాల వారికి అందజేయటానికి చర్యలు తీసుకునే నిర్ణయం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తీసుకోవడం ఎంతో హర్షించదగ్గ విషయం. కొంచెం ఆలస్యమైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. దీనికై అందరి అభిప్రాయాలను సేకరించటం అనే ప్రక్రియ గొప్పనైనది. ఈ క్రింది విషయాలను కూడా పరిగణనలో తీసుకుంటే బాగుంటుంది.

1) తెలంగాణా ప్రాచీన సాహిత్యాన్నంతా వెలికితీయాలి : ఇప్పటికే ఆదరణ లేక తెలంగాణా సాహిత్యం ఎంతో కనుమరుగైపోయింది, వాటిని శోధించి సాధించాలి. ఇది ఏ ఒక్క ప్రభుత్వం పూనుకుంటే అయ్యేపని కాదు, ఇందులో సాహిత్యాభిమానులు భాగస్వామ్యం చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ కనుమరుగైందనుకున్న ఎంతో సాహిత్యం భాషాభిమానులు వద్ద చాలా ఉంది.

ఉదాహరణకు తెలంగాణా ఏర్పడ్డాక తెలంగాణా ఆదికవి పాల్కురికి సోమనాథుని సమగ్ర సాహిత్యం ప్రచురించడానికి తెలుగు అకాడమి పూనుకుని కమిటీని ఏర్పాటు చేసి సోమన సాహిత్యాన్ని ప్రచురించటం జరిగింది. అయితే వారు సోమన సాహిత్యం మొత్తాన్ని సాధించలేకపోయారు. రుద్రభాష్యం, బసవాష్టకం, భక్తస్తవం, శీల సంపాదనం, సద్గురు రగడలు లభ్యం కావటం లేవని తెలిపారు.  అచ్చతెలుగు ఆదికవికే ఈ పరిస్థితి ఉంటే మరి సామాన్య రచయితల గ్రంధాల పరిస్థితి ఏంటి?

అయితే ఆ గ్రంధాలు అక్కడక్కడా ఉన్నాయి. భక్తస్తవం నా దగ్గర ఉంది, అకాడమీ వారు ప్రచురిస్తున్న విషయం నాకు తెలియదు మరి. అలాగే బసవాష్టకం మద్రాసు ప్రాచ్య లిఖిత భాండాగారంలో ఉందని లైబ్రరీ వారు ప్రచురించిన కేటలాగ్ లో కలదు. అలాగే సోమనాథ భాష్యమును శ్రీ గంగపట్టణ సుబ్రహ్మణ్యదేవరచే బందరు ముద్రాక్షరశాల యందు 1914 లో ముద్రితమైనట్టు పరిశోధన పత్రికలో తెలుపబడింది. 

అక్కడక్కడా ప్రాచ్య లిఖిత భాండాగారాల్లో ఎన్నో ఉన్నాయి కూడా. నేను ఇంతకు ముందు తెలంగాణ కీర్తికిరీటం-తెలంగాణ గ్రంధాలయాలు అనే టపాలో భద్రపరచబడిన తెలంగాణా సాహిత్యం గురించి చర్చించటం జరిగింది. ఆయా గ్రంధాలయాలలోనే కాక ఎంతోమంది సాహిత్యాభిమానులు వద్ద ఎంతో విలువైన సాహిత్యం ఉంది.  ఒక పత్రికా ప్రకటన ద్వారా అలభ్యంగా ఉన్న సాహిత్యాన్ని ప్రకటించి ఎవరిదగ్గరైనా ఉంటే గ్రహించాలి. వాటి జిరాక్సులు తీసుకుని వారికి తిరిగి ఇవ్వాలి. ఈ విధంగా సాధించిన తెలంగాణా సమగ్ర సాహిత్యాన్ని రచయితలు వారి గ్రంధాల వివరాలతో గ్రంథ సూచీల ప్రచురించాలి. ప్రాధాన్యతను బట్టి ఆయా గ్రంధాలను ప్రచురించాలి. వీలైతే డిజిటలైజషన్ చేసి ఒక వెబ్సైట్ లో అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఉంచితే రాబోయే తరాలకూ అందుబాటులో ఉండే వీలుంటాయి.

2) తెలంగాణా ప్రాంతంలో ఎంతోమంది జ్యోతిష్య పండితులు చాలా పుస్తకాలు రాశారు, పంచాంగాలూ ప్రచురించారు. ఒకప్పుడు కోస్గి పంచాంగం ఎంతో గొప్ప పేరు పొందింది, ఇప్పుడు కనీసం పేరు కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అలాంటి పండితుల గూర్చి గ్రంధస్తం చేయాలి, చాలా మంది ఉన్నారు గొప్ప పండితులు.

3) ఎన్నో చిన్న చిన్న గ్రంధాలు ఆయా ప్రాంతాల విశిష్టతను, వ్యక్తుల జీవితాలను కీర్తిస్తూ రాసినవి చాలానే ఉన్నాయి. అలాంటివాటిని డిజిటలైజెషన్ చేయాలి.

4) ఇంతకుముందు ప్రాచ్యలిఖిత భాండాగారం వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చి ఆయా ప్రాంతాలలో పర్యటించి, ఎవరిదేగ్గరైనా రాతప్రతులు, తాళపత్రాలు లాంటివి ఉంటె భావితరాలకు ఉపయోగపడేలా భద్రపరుస్తాం ఇవ్వమని అడిగి సేకరించేవారు. అలా చేయాలి, ప్రాంతాలలో తిరగకున్నా కనీసం ప్రతి ఏటా నిర్వహించే ప్రపంచ మహాసభలలో  ఈ సేకరణకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి.

5) తెలంగాణా ప్రాంతంలో చాలా మటుకు గ్రంధస్థం కాకుండా ప్రజల నోళ్ళలో వినిపించే పాటలు, కీర్తనలు, కథలు ఎన్నో ఉన్నాయి. కొంతవరకు గ్రంధస్థం అయినా ప్రస్తుతం వెలుగులో లేవు. తెలంగాణా ప్రాంతంలో రాకమచర్ల భజన, కీర్తనలు ఎంతో ప్రసిద్ధి పొందినవి. అలాగే జానపద కళలు, ఒగ్గుకథలు, యక్షగాణాలు, బుర్రకథలు వంటి వాటిని వెలికి తీయాలి. 
1 comment: