వెనకటి కాలంలో పండితులు తక్కువగా ఉండేవారు - ఎవరో ఊరికి ఒకరు ఉంటే వారి మాట జవదాటేవారు కాదు
వారు చెప్పినట్టే ఆ రోజు పండుగలు జరుపుకునే వారు
వేరే ప్రాంతంలో వేరొక విదంగా చెబితే అక్కడి వారు ఆవిధంగా ఆ రోజు జరుపుకునేవారు
అప్పుడు కూడా తేడాలతో జరిగినా ఈనాటిలా మీడియా ప్రపంచం లేక అంత వ్యత్యాసం ఏర్పడేది కాదు
ఇప్పుడు పండితులూ ఎక్కువయ్యారు - మీడియా ఎక్కువయింది
ఒకే ప్రాంతంలో పది మంది పండితులు పదిరకాల చెప్పే పరిస్థితి నేటిది
ఇక్కడ ఎవరి వాదనా కొట్టి వేయటానికి వీలుండదు - ఎందుకంటే ఒక్కొకరు ఒక్కో శాస్త్రాన్ని/గ్రంధాన్ని అనుసరించి వాదిస్తారు.
ప్రస్తుతం దసరా పండగ జరుపుకోవటంలో సందిగ్దం ఏర్పడింది
అయినా తెలంగాణా పండితులు ఒకచో కూర్చుని చర్చించుకుని దసరా పండగ 13-10-2013 న జరుపు కోవాలని చెప్పటం వలన
దాదాపు తెలంగాణా అంతటా నిన్ననే (13-10-2013) నే జరుపుకున్నారు
కాని హైదరాబాదులోనే కొంత తేడా వచ్చి 13 నాడు కొంతమంది 14 నాడు కొంతమంది జరుపుకోవటం జరిగింది
దీంతో పండగ వాతావరణం కనిపించకుండా పోయింది
తెలంగాణా ప్రాంతంలో దసరా పండగ నాడు శమీ పూజ ముఖ్యంగా భావిస్తారు అది సాయంత్రం పూట జరుగుతుంది.
కొత్త బట్టలు వేసుకుని జనులు సమకూడె ప్రదేశంలో హనుమంతుడు ఉండే కాషాయ జెండా ఎగురవేసి
శమీ చెట్టును చేరి పూజించి వాటి ఆకులు తెంపుకుని ముందుగా దేవాలయం వెళ్లి దేవునికి బంగారం (జమ్మి) సమర్పించి ఆ తరువాత ఇంటికి వెళ్లి ఇంట్లో దేవునికీ, పెద్దలకూ సమర్పించి
ఆపైన స్నేహితులు, శ్రేయోభిలాషుల కలిసి అలాయ్-బలాయ్ తీసుకోవటం జరుగుతుంది
ఇదంతా సాయంత్రం తరువాత జరుగుతుంది.
దశమి నిన్న సాయంత్రం ఉంది ఈనాటి సాయంత్రం లేదు
అందుకే నిన్నపండగగా నిర్ణయించబడింది - అది సబబే
అయితే శాస్త్రం ప్రకారం పండగల సందర్భంలో సూర్యోదయానికి ఆ పండగ తిథి ఉన్న దినాన్నే గ్రహించటం జరుగుతుంది - ఆవిధంగా దశమి నిన్న సూర్యోదయానికి లేదు - ఈనాడే ఉంది కాబట్టి ఈనాడు చేసుకోవటం కూడా సబబే - ఇది ఇంట్లో శమీ కొమ్మ తెచ్చి దేవుని దెగ్గర పెట్టి పూజించే వారికి బాగా ఉపయుక్తం.
కాని సామూహికంగా జరుపుకునే సాయంత్రం శమీ పూజ సమయంలో లేకపోవటం లోటే అవుతుంది.
ఏది ఏమైనా పండితులు ఏకాభిప్రాయానికి రావటమే కాకుండా
ప్రభుత్వం కూడా అధికారికంగా వివరణ యుక్తంగా పండగ ఏ రోజు జరుపుకోవాలన్నది ఒక ఒప్రకటన విడుదల చేస్తే
అందరికీ మంచిది - ఆ రోజు పండగలా కూడా అందరికీ అనిపిస్తుంది.