Showing posts with label అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు. Show all posts
Showing posts with label అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు. Show all posts

Sunday, 29 June 2014

అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు

అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు 

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించిన అమ్మవారి బోనాలు, బతుకమ్మ పండగ రెండూ తెలంగాణా ప్రాంతంలో అనాదిగా ఆచరిస్తున్న పండగలు - ఇవి బహుపురాతనం. ఇంతటి ప్రాచీన పండగలు రాష్ట్ర పండగలుగా కలిగి ఉండటం, తెలంగాణా యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. 

ఇంతవరకూ మనకు లభించిన చరిత్రను బట్టి, ప్రత్యేకంగా ఆంధ్రుల చరిత్ర గ్రంథాల నుండి మనకు తెలిసేది ఏమంటే ఆర్యులైన ఆంధ్రులు ఉత్తర భారతం నుండి ఈ ప్రాంతానికి రాక ముందు ఈ తెలంగాణా ప్రాంతాల్లో నివసించే ప్రజలు నాగరికులుగా ఉండేవారని, వారు చెట్లు, రాళ్ళు, నాగులను, ప్రకృతిని పూజించేవారని తెలుస్తుంది. ఆంధ్రుల రాక తరువాత కూడా అవి కొనసాగాయని చరిత్ర మనకు చెబుతుంది. 

తెలంగాణా ప్రాంతంలో ఆ నాటి నుండి నేటి వరకు చెట్లను ముఖ్యంగా ఎంతో ప్రయోజనం కలిగించే వేప చెట్లను పూజించటం ముఖ్యమై పోయింది, వేప చెట్టును అమ్మవారుగా ఇప్పటికీ తలుస్తారు, పసుపు-కుంకుమలు, శాఖపెట్టి (నీళ్ళు పోసి), నైవేద్యం పెట్టి  ప్రదక్షిణలు చేస్తారు. ఇంటి గడపకు వేప కర్ర వాడతారు, గడపను పసుపు కుంకుమలతో పూజించటమే కాక నైవేద్యాలు కూడా పడతారు - గడపను తొక్కరు, పొరపాటున గడప పైన తుమ్మినా వెంటనే నీళ్ళు చల్లి శుద్ధి చేస్తారు. వెనకటి కాలంలో వేప కర్రనే అమ్మవారిగా పూజించేవారు, మరికొందరు గుండు రాతిని పూజించేవారు. మనిషి ఎదుగుదలతో బాటు కాలక్రమంలో అమ్మవారికీ రూపం ఏర్పడింది. కర్రతోనే అమ్మవారి రూపాలు చేసి పూజించారు - చాలా చోట్ల ఈ ఆనవాళ్ళు మనకు అగుపిస్తాయి. రాతి గుండు కూడా అమ్మవారిగాను, శివలింగం గాను మార్పు చెందబడింది. 

ప్రాచీన తంత్ర గ్రంథాల్లో కర్రతో కూడిన అమ్మవారి పూజ, చెట్ల పూజ ప్రముఖంగా చర్చించబడింది. చాలా గుళ్ళల్లో, ఇళ్ళలో నేటికీ కర్ర ప్రతిమా పూజ జరుగుతుంది (సమ్మక్క-సారక్కలు ఇప్పటికీ కర్ర రూపాల్లోనే పూజించ బడుతున్నారు), ముఖ్యంగా వేప చెట్టు, కర్ర తెలంగాణా ప్రాంతంలో అతి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అలాగే ప్రకృతి సిద్దంగా చెట్ల నుండి తయారు చేయబడే బండారు (పసుపు) విశిష్టత ఎంతో కలిగి ఉంది. అమ్మవారి రూపంలో ఆరాధించబడే పోతరాజులు కానీ, ఆడపడచులు కానీ మేనంతా పసుపుతో దర్శన మిస్తారు. 

వెనకటి కాలంలో మాంసం భుజించేవారు అమ్మవారి బొనాలకు (జాతర) దున్నపోతులను, మేకపోతులను, కోళ్ళను బలిచ్చేవారు (ఈ బలిచ్చే వాటిని అమ్మవారి పోతులుగా, మేకగా సంవత్సరం ముందు నుండే స్వేచ్చగా ఒదిలేసేవారు). నా చిన్నతనంలో చూసిన దున్నపోతుల బలి భయానకంగా అనిపించేది. శాఖాహారులు మాత్రం శాఖాహారము సమర్పించేవారు. కాలం మారింది - కాలంతో బాటు మనుషుల ఆచారాలూ మారాయి నేడు ఆనాటి జంతుబలులు తగ్గిపోయాయి. అమ్మవారి పూజ అనాది పూజ కావటం వల్ల, కొన్ని అనాది ఆచారాలు కూడా ఇప్పటికీ ఇంకా ఆచారించబడుతూనే ఉన్నాయి (ఆచారాలు మారితే అమ్మవారు కోపగించుకుని ఏమి చేస్తారో అనే భయం ప్రజల్లో బలంగా ఉంది). 

చెట్లను, చెట్ల పూవులను పూజించటం అనాది కాలం నుండి తెలంగాణా ప్రాంతంలో విశేషంగా కనిపిస్తుంది. అంతే గాకా స్త్రీని ఎక్కువగా ఆరాదించటం తెలంగాణాలో కనిపిస్తుంది. ఆ ఆరాధనా పరంపరలో పుట్టుకొచ్చిందే బతుకమ్మ పండగ, ప్రకృతి ఆరాధన, ప్రకృతి జీవనాన్ని కాపాడటం ఈ పండగ ముఖ్యోద్దేశ్యం, ఎన్నెన్నో కథలు కాలక్రమంలో పుట్టుకొచ్చినా ప్రధానంగా ఆడపడచుల గౌరవించటం ఈ పండగ ప్రాధాన్యత. ఇంటి ఆడపడచులు రావటం-వారని కొత్త బట్టలతో పలురకాల వంటకాలతో ఆనందపరచటం అన్నది ఈ పండగలో ముఖ్యంగా కనిపించేది. ఆడదిక్కు లేని ఇంట్లో ఈ బతుకమ్మ పండగ జరుపుకోరు. వెనకటి కాలంలో ఈ పండగలో ఆడపడచుల వీర గాథలు, కన్నీటి గాథలు, ప్రకృతిని కీర్తించే పాటలు బతుకమ్మ పాటల రూపంలో వినిపించేవి. కాలక్రమంలో ప్రసిద్ది పొందిన వ్యక్తుల గాథలు కలిసిపోయాయి.  అయినా అనాది ఈ బతుకమ్మ పూజలోని ఆచారాలు ఏమాత్రం మారలేదు. బతుకమ్మలో పసుపు గౌరమ్మ మరియు వెంపల్లి చెట్టు పూజ తప్పక ఉంటుంది. గుమ్మడి ఆకులు, గుమ్మడి పూవు, గునుగు పూలు, తంగేడి పూలు, ముత్యాల పూలు, పోక పూలు అనేవి ప్రధానమైనవిగా కనిపిస్తాయి (అతి తేలికగా ఉండేవి, అడవిలో విరివిగా లభించేవి, నీటిలో తేలికగా కలిసిపోయి చెరువులను సుగంధభరితం చేసి శుద్ధి చేసేవి అవటం వలన ఎక్కువగా వాడుకలో వచ్చాయి). 

అమ్మవారి బోనాలు, ఆడపడచుల బతుకమ్మ పండగలు తెలంగాణా విశిష్ట ఆచారాలకు కీర్తి కిరీటాలు. ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో అక్కడ సుఖ, శాంతి అభివృద్ధి విరాజిల్లుతుందని చెప్పిన ప్రాచీన శాస్త్ర వచనాల ఆచరణలో పెడుతూ జరుపబడే ఈ  రెండు పండగలలో స్త్రీ ఆరాధనే ప్రాముఖ్యతను సంచరించుకుంటుంది. అంతేగాక ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అనే ఆధునిక ఆలొచనలకూ ఆచరణ రూపమే ఈ అతి ప్రాచీన పండగలు. 


ఎన్నెన్నో విశిష్టతలు కలిగిన ఈ రెండు ప్రాచీన పండగలను రాష్ట్ర  పండగలుగా ప్రకటించటం ఎంతో ఆనందదాయకమే కాక తెలంగాణా గోరవతకూ ఎంతో దోహద దాయకం. ఈ రెండు పండగలని ఆనందంగా జరుపుకుని తెలంగాణా ప్రజలు ఎల్లవేళలా అమ్మ వారు, ప్రకృతిమాత, స్త్రీ మూర్తుల  ఆశీస్సులతో కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదురు గాక.