Kalabgur Trikutalayam
మెదక్ జిల్లా సంగారెడ్డి పట్టణానికి ఒక 4 కిలోమీటర్ల దూరంలోని కల్పగూర్ గ్రామంలో ఉంది. ఈ గుడి మంజీరానదికి దగ్గరలో ఉంటుంది. మంజీరా నీటిని నగరానికి చేర్చే కల్పగూర్ డ్యాం కూడా ఇక్కడ కలదు.
ఈ ఆలయ ప్రాంగణంలో మూడు ప్రధాన ఆలయాలు కలవు. అందువల్ల ఈ ఆలయం త్రికుటాలయంగా ప్రసిద్ది చెందింది. ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి ఆలయం, వేణుగోపాల స్వామి ఆలయం, అనంతపద్మనాభ స్వామి ఆలయం ఉన్నాయి. అంతేగాక ఎనిమిది స్థంబాల బయలు మంటపంలోని నందీశ్వరుడు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. అంతేగాక అనంతపద్మనాభ స్వామి గర్భాలయంలో లక్ష్మీ సహిత శేషశయనుడైన అనంతపద్మనాభిస్వామి ముందర లింగముతో బాటు నందీశ్వరుడు కూడా కొలువై ఉండటం మరో విశేషం. కాశీ నుండి వచ్చే జలధారలపైన ఈ గుడి నిర్మాణం జరిగిందని అందుకే ఇక్కడి లింగాన్ని కాశీ విశ్వనాథ లింగంగా పిలుస్తారని చెప్తారు. గర్భాలయంలో ఏవస్తువైన కిందపడితే నీటిపై పడిన శబ్దం వస్తుందని అంటారు.
మరో విశేషం ఏమంటే ఇక్కడ సూర్యకిరణాలు ప్రతిరోజూ ఒకసారైనా దేవుని పాదాలు తాకి గుడిలో వెలుతురు ప్రసరింపజేయటం ఈ గుడి అద్భుత నిర్మాణ శైలికి మరో తార్కాణం. నందీశ్వరుని తాకుతూ వెళ్ళే ఈ కిరణాలు అనంతపద్మనాభ స్వామి పాదాలనూ తాకుతాయి.
ఈ ఆలయం 11వ శతాబ్ది కాకతీయుల కాలం నాటిది. ఈ ఆలయ నిర్మాణం వరంగల్లు వేయి స్థంబాల గుడి నిర్మాణాన్ని పోలి రాళ్ళ అమరిక దప్ప ఎటువంటి కూర్పులేక ఉంటుంది (రాళ్ళను కలిపి ఉంచడానికి సిమెంటు లాంటి పదార్తాలేవీ వాడబడలేవు). అద్భుతమైన ఈ పెద్ద పెద్ద స్థంబాలు ఎంతో అందంగా చెక్కబడి ఉంటాయి. గుడి అంతటా ఈ అద్భుత చెక్కడాలు చూపరులను ఆకర్షిస్తాయి. ఈ గుడి సౌందర్యం అంతా ఒంటిమిట్ట ఓబులయ్య అనే శిల్పి చేత మలచబడిందని చెబుతారు. అయితే ఇక్కడి శివలింగం రాముడు స్థాపించిన కోటిలింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది. ఇక్కడి కోనేటిలో నీరు ఎప్పుడూ ఉంటుంది.
కల్పగూర్ గ్రామం ఒకప్పుడు ఎంతో ప్రసిద్ది చెందిందని చరిత్రవలన తెలుస్తుంది. రెడ్డి రాజుల కాలంలో ఇది ముఖ్యపట్టణంగా ఉండింది. శివపురాణానికి సంబందించిన అరుదైన అలభ్యమైన తాళపత్ర గ్రంధాలు ఇక్కడ ఉన్నవని పాతకాలం నాటి ఒక గ్రంధంలో చదివినట్టు నాకు జ్ఞాపకం. ఇప్పుడీ గ్రామం ఒక కుగ్రామంగా అనిపించినా ఇక్కడ కనిపించే సాక్ష్యాలు ఒకప్పుడు ఇది గొప్ప ప్రదేశమని చెప్తాయి. పట్టించుకునే నాథుడు లేక జీర్ణావస్థకు చేరిన ఈ ఆలయాలను అక్కడి గ్రామస్థులు కలిసి బాగు చేయటం జరిగింది. పడిపోయిన గుడి శిఖరాలను పునర్నిర్మించటం జరిగింది.
ఈ అద్భుతమైన, ప్రాచీనమైన గుడిని తెలంగాణ నూతన ప్రభుత్వం వృద్దిలోకి తెచ్చి పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మంచి ఆలయాన్ని పరిచయం చేశారు. కొన్ని ఫోటో లు పెడితే ఇంకా బుండేదనుకుంటా.
ReplyDeleteనేను ఫోటోలు తీసి తప్పకుండా పెడతాను. కొంతమంది ఇంటర్నెట్ లో పెట్టారు కూడా మీరు ఇక్కడ చూడండి:
Deletehttp://chowdampurushotham.blogspot.in/2011/02/kalpagur-vilage-sangareddy-medak.html