Tuesday 11 November 2014

బతుకమ్మ అందరి పండగ అనే గ్రహించాలి

ఎంతోకాలం నుండీ తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరిచేత పూజింపబడుతున్న ఈ పండగకి, బహుళ ప్రాచుర్యం వచ్చిన ఈ సందర్భంలో ఆ పండగకి లేని కొత్త విషయాలను ఆపాదించటం సరి  అయినది కాదు. బతుకమ్మ పండగకి సంబంధించి - ఎలా ఏర్పడింది? ఎప్పుడు ఏర్పడింది? ఎవరిచే ఏర్పడింది? అనే విషయాలు మనకు చరిత్రలో ఎక్కడా రాయబడలేదు - దానికి మన ఊహలతో చరిత్రలు సృష్టించడం, అందరూ కలిసి సమిష్టిగా జరుపుకునే ఈ పండగకి ఇది ఎవరో కొందరి సొంతమనో చెప్పటం, మిగతావారికి ఈ పండగతో సంబంధం లేదని తేల్చటం తగనిది. ఈ బతుకమ్మ పండగ ఇంతకుముందు ఎలా అందరూ కలిసి జరుపుకున్నారో ఇకముందు కూడా అలాగే కలిసి జరుపుకునేట్టు చూడటం అందరి విధి.

ఈ మద్యన బతుకమ్మకు కల్పించి చెప్పబడిన కొన్ని విషయాలను (నా దృష్టికి వచ్చినవి) ఇక్కడ ఖండించ దలచుకున్నాను.

1. "వీరశైవం పురుష ప్రధానమైనటువంటి మతం, స్త్రీని తక్కువగానే చేసింది - చూసింది. శక్తిని కాదని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసింది. శైవారాధనలోకి వెళ్ళిపోయింది. అప్పుడు శక్తి రూపం అయినటువంటి స్త్రీ అటు మాగోరు ఎల్లమ్మ గాని, సమ్మక్క-సారమ్మగాని,  ముత్యాలమ్మ గాని ఇక్కడ బతుకమ్మ గాని వీటిని అర్థం చేసుకుంటే ఇవి ఆనాటి పురుషాధిపత్యాన్ని ఎదిరించి నిలిచినటువంటి రూపాలు."

ఈ వ్యాఖ్యలకు సంబందించిన విడియో కై ఇక్కడ క్లిక్ చేయండి:  Click here


టెలివిజన్ బతుకమ్మ ప్రోగ్రాంలో వినిపించిన మాటలివి. ఇవి శుద్ధ అబద్దాలు బతుకమ్మ పండగ వీరశైవాన్ని ఎదిరించి నిలిచిందంటే ఈ బతుకమ్మ పండగ అటు ఆంద్రప్రాంతంలోనూ ఉండాలి, మరి ఇటు కర్నాటక, మహారాష్ట్రల్లోనూ ఉండాలి, అలా ఎందుకు జరగలేదు? అదీ కాక వీరశైవులు ఈ పండగని జరుపుకోకుండా ఉండాలి కదా? వీరశైవులు కూడా బతుకమ్మ పండగని ఎన్నో తరాల నుండీ ఆచరిస్తున్నారాయె!

పై వ్యాఖ్యలు దేన్నీ ఆదారంగా చేసుకుని చెప్పారో అర్థం కాని విషయం. నిజానికి వీరశైవమతం మిగతా మాతాలన్నిటికంటే ఒక అడుగు ముందేసి స్త్రీకి స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. అసలు లింగపూజలోనే శివ-శక్తి ఆరాధన మిళితమై ఉంది. నిజానికి వీరశైవ సిద్దాంతాన్ని "శక్తి విశిష్టాద్వైత సిద్దాంతమని"  అంటారు. వీరశైవుడు పూజించే లింగంలో ఉండేది ప్రానవట్టంతో కూడిన లింగం. ఆ లింగాన్ని పిల్లలు జన్మించిన నాడే ఆచారం ప్రకారం ఆ వూరి మఠమయ్యచే పూజింపజేయబడి చిన్న బట్టలో ఉంచి బిడ్డ మేడలో కడతారు. వారికి జ్ఞానం తెలిసే వయసు వచ్చాక 6-8 ఏళ్ల మద్యలో ఆ లింగానికి కంతి పెట్టి (ప్రానవట్టంతో కూడిన లింగానికి పైన తైలం పెడతారు) గురువులచే దీక్ష ఇచ్చి ధరింపజేయబడుతుంది. ఆనాటి నుండి శివ-శక్తి యుతమైన ఆ లింగాన్ని ప్రతి దినము వీరశైవుడు ఆరాధిస్తాడు. లింగం శివరూపమైతే - ప్రానవట్టం శక్తి స్వరూపం అని అందరికీ తెలిసిన విషయమే అలాంటప్పుడు వీరశైవ సిద్దాంతంలో కేవలం శివునికే ప్రాధాన్యం ఉందని శక్తిని కాదన్నారని అనటం అవివేకమే అవుతుంది. వీరశైవుల పెళ్ళిళ్ళలో కాని ఆచారాల్లో కాని గౌరీదేవి, స్త్రీలు ప్రాముఖ్యత వహించబడతారు. గౌరీనోములు, ఉమామహేశ్వర వ్రతాలు, కేదారేశ్వర వ్రతాలు ప్రధానంగా చేసేది వీరశైవులే. ప్రతి వీరశైవుల  ఇంట్లో గాని, దేవాలయాల్లో గాని శివునితో బాటు పార్వతీదేవి ఖచ్చితంగా ఉంటుంది.   

ఇక వీరశైవమతం స్త్రీని తక్కువ చేసి చూసింది అనటం అవగాహనలేమే. అన్ని మతాలకంటే అధికంగా వీరశైవమతంలోనే స్త్రీకి సంపూర్ణ స్వాతంత్ర్యం ఉంది. వీరశైవ మతంలో ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టిన లింగాదారణ చేస్తారు, పురుషునితో సమానంగానే స్త్రీలు కూడా మెడలో లింగం వేసుకుని లింగపూజ చేస్తారు. మగవారితో సమానంగా ఆడవారు సహితం మేడలో లింగం ధరించి ప్రతినిత్యం లింగాన్ని అభిషేకించి, అర్చించి జపం చేయటం అనేది కేవలం వీరశైవంలోనే కనబడుతుంది.  అంతేకాక స్త్రీలు నెల అయి మైలపడి అశుద్దులయినా ముట్టు అంటూ అని పూజకు దూరం ఉంచక, స్త్రీ ఆదిశక్తి స్వరూపం కాబట్టి ఆమెకు మైల అనేది వర్తించదని ఆ సమయంలో కూడా లింగపూజ తప్పక చేసుకోవాలని చెప్పింది. వీరశైవంలో స్త్రీ చనిపోయిన తరువాత కూడా శివయోగినిలా పీఠాదిపాతులను తీసుకెల్లబడినట్లు యోగసమాధిలో కూర్చుండబెట్టి పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళతారు, యోగిలా సమాధిస్థితిలో ఉంచే సమాధి చేస్తారు. పుట్టిన నుండి చనిపోయే వరకు వీరశైవంలో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది.
   

ఇక బసవేశ్వరుని కాలం నుండి నేటి వరకు వీరశైవంలో ఎందఱో మహిళలు ప్రఖ్యాతినొందారు అన్నారన్న విషయం జగద్విదితం. బసవేశ్వరుని కాలంలోనే ఇతర తత్వవేత్తలతో బాటు అనుభవమంటపంలో అక్కమహాదేవికి ప్రముఖస్థానం ఇవ్వబడింది. నీలాంబిక, దానమ్మ దేవి వంటి ఎందఱో పరమ వీరశైవ భక్తులుగా వేలిగొందారు. బసవపురాణంలో లెక్కకు మించి ఎందఱో పూజనీయులుగా చెప్పబడిన వీరశైవ స్త్రీ భక్తులు కలరు.  శ్రీశైల క్షేత్రంలో ప్రముఖ పాత్రవహించిన హేమరేడ్డి మల్లమ్మ, కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణి రుద్రమ్మ, రాణులై స్వాతంత్ర్యం కొరకు పోరాడిన బెలవాడి మల్లమ్మ, కిత్తూర్ చెన్నమ్మ, కేలడి చెన్నమ్మ లాంటి వారెందరో వీరశైవమతంలో ప్రోత్సాహింపబడి పూజనీయులైన వారే. ఆధునిక యుగంలోనూ చాలామంది పైకి రాబడిన వారు ఉన్నారు, వీరశైవమతంలో పురుషునితో సమానంగానే స్త్రీకి గౌరవం ఇవ్వటం జరుగుతుంది. చదువుకోవటం, ఉద్యోగం చేయటం వంటి వాటిలో ఎక్కడా ఏనాడూ కూడా వివక్షత లేనప్పుడు వీరశైవమతంలో స్త్రీ తక్కువ చూడబడిందని ఏ ప్రామాణికతతో నింద వేస్తున్నారు?  ప్రస్తుతం కూడా వీరశైవ మతాన్ని వ్యాప్తం చేస్తున్న స్త్రీ గురువులెందరో ఉన్నారు. అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులైన స్త్రీలూ ఉన్నారు. కాలం మారిన ఈనాడే కాదు వెనకటి కాలంలోనే వీరశైవమతంలో స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది.


2. మరోచోట ఈ పండగ BCల పండగ అని చెప్పటం జరిగింది. అగ్రవర్ణాల వారు జరుపుకునేవారు కారని తేల్చి చెప్పారు.

ఈ వ్యాఖ్యలకు సంబందించిన విడియో కై ఇక్కడ క్లిక్ చేయండి:  Click here

ఇది కూడా అంగీకరించవలసిన విషయం కాదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుండీ ఈ పండగ అగ్రవర్ణాల వారు కూడా జరుపుకుంటున్నారు. ప్రత్యేకంగా కొన్ని మా బంధువుల గ్రామాల్లో ఈ పండగ జరుపుకునే వారు అగ్రవర్ణాల వారే, అక్కడ ఎన్నో ఏళ్లనుండి  బ్రాహ్మణులు, కోమట్లు, బలిజులు మాత్రమే ప్రధానంగా ఈ పండగ జరుపుకునేవారు.   తెలంగాణ ప్రాంతంలో BC లు అధికంగా ఉండటం వలన, ఇది BC ల పండగ అనే అభిప్రాయం ఏర్పడిందేమో కాని నిజానికి ఈ పండగని అన్ని వర్ణాలవారు ఆడేవారు. అయితే ఈ పెద్దబతుకమ్మల నాడు పెద్దగా పేర్చిన బతుకమ్మను ఇంట్లో పనిచేసే మగవాళ్ళు (జీతగాళ్ళు లేదా గాయిదోళ్ళు అని అనేవారు - ఇప్పుడు ఎక్కడా ఆ వ్యవస్థ లేదు) తలపై ఎత్తుకునే వారు (బరువు ఎక్కువగా ఉండటమే కాక కొన్ని కిలోమీటర్లు బతుకమ్మను నీటిలో విడవటానికి వెళ్ళవలసి వచ్చేది). ఆ ఇంటి మహిళా ఏమో చిన్న బతుకమ్మను ఎత్తుకునేది (చివరినాడు ప్రతి ఇంట్లో ఒక పెద్ద బతుకమ్మ మరో చిన్న బతుకమ్మ చేసేవారు).  వెనకటికి గ్రామాల్లో కులాల ప్రకారం వీధులు ఉండేవి. ఆ వీధిలో ఉండే కులాల వారు కలిసి ఒకచోట బతుకమ్మను ఆడేవారు. అయితే చివరికి గ్రామం మొత్తం ఒకచోట చేరి అందరూ కలిసి ఆడేవారు. ఇలా అందరూ కలిసి తరతరాల నుండి ఈ పండగ జరుపుకున్నట్టు తెలుస్తుంటే ఇది కేవలం BCల పండగే అని అగ్రవర్ణాల వారికి ఈ పండగతో సంబంధం లేనట్టు వ్యాఖ్యానించటం సరైనది కాదు. ఈ పండగ గురించి ప్రాచీన గ్రంధాలలో వర్ణన కాని, చరిత్ర ఆధారాలు కాని మనకు అందుబాటులో లేవు, వాటికై పరిశ్రమించాలి. చరిత్ర వెలికి వచ్చినా రాకపోయినా ఈ బతుకమ్మ పండగ ఆనాడు అందరి పండగే, నేడూ అందరి పండగే. బతుకమ్మ పండగను అందరికీ దెగ్గరచేసి విశ్వవ్యాప్తం చేయాలి కాని కొందరికే పరిమితం చేసే ప్రయత్నం చేయటం అన్నది సరైనది కాదు.








2 comments: