Monday, 10 November 2014

తెలంగాణ కీర్తికిరీటం-ఝాంసింగ్ దేవాలయం

"తెలంగాణా కీర్తికిరీటం" అనే ప్రత్యేక శీర్షికతో కూడిన టపాలు, తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాల గురించి ప్రత్యేకంగా ప్రచారంలో వెనుకబడిన తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాల గురించి వివరించటానికి రాయటం జరుగుతుందని మనవి. 




Jham Singh Balaji Mahadev Temple


~ : ~ 

ఝాంసింగ్ బాలాజీ మహదేవ దేవాలయం 

17వ శతాబ్దంలో రామదాసుగా ప్రసిద్ది నొందిన కంచర్ల గోపన్నతన ఆరాధ్య దైవమైన భద్రాచల రామునికి గుడికట్టించి తన దైవభక్తిని చాటుకున్నాడు. కాగా ప్రభువైన తానీషా  ప్రభుత్వసొమ్ముతో గుడి కట్టినందుకు ప్రభుత్వోద్యోగి అయిన రామదాసును జైలులో బంధించాడు. సరిగ్గా ఇలాగే 19వ శతాబ్దంలో సుమారు 1810 ప్రాంతంలో హైదరాబాదు నందు ఝాంసింగ్ అనే అతను ప్రభుత్వ సొమ్ముతో తన ఆరాధ్యదైవమైన బాలాజీకి (వెంకటేశ్వరుడు) గుడికట్టించటం జరిగింది. 

అది 3వ నిజాం సికందర్ జాహ్ పరిపాలిస్తున్న కాలం (1803-1829 సంవత్సరాల మద్య పరిపాలించాడు).  నేటి సికిందరాబాదు నగరం నిర్మించబడింది ఇతని పేరునే. ఇతను నిజాంరాజు దగ్గర అశ్వికదళ సైన్యాధికారిగా ఝాంసింగ్ పనిచేసేవాడు. ఈతను ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా నుండి వచ్చిన రాజపుత్ర వంశానికి చెందినవాడు. సైన్యానికి అవసరమైన గుర్రాలను కొనటం ఈ ఝాంసింగ్ కు అప్పగించటం జరిగింది. మేలైన గుర్రాలను పరిశీలించటం వాటిని లొంగదీసుకుని శిక్షణనివ్వటంలో నేర్పరి ఈ ఝాంసింగ్. ఈతనికి గుర్రాలపైన మక్కువతో బాటు బాలాజీపైన అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉండేవి. ఇతనికి ఒకరోజు వేంకటేశ్వరుడు కలలో కనిపించి తనకొక గుడి నిర్మించవలసిందని చెప్పగా హైదరాబాదు, గుడిమల్కాపూర్ దగ్గరలో బాలాజీ ఆలయం నిర్మించాడని ప్రతీతి. ఈ గుడి గోలకొండ నుండి కార్వాన్ వెళ్ళే దారిలో తాళ్లగడ్డ దగ్గర ఉంటుంది. తరువాతికాలంలో ఈ గుడికి సంబందించిన 22 ఎకరాలు మార్కెట్ యార్డ్ కై ఇవ్వటం జరిగింది - ఆ మార్కెట్ ఇప్పుడు  గుడిమల్కాపూర్ మార్కెట్ అనే పేరుతో ఎంతో ప్రసిద్దినొందింది (గుడి ద్వారా ఇవ్వబడింది కాబట్టి అలా పేరు పడిపోయింది). 

ఈ గుడి 1810 ప్రాంతంలో సుమారు 55 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇక్కడ వేంకటేశ్వరుని మందిరంతో బాటు శివాలయం కూడా ప్రక్కనే ఉంటుంది, అందుకే ఈ దేవాలయం బాలాజీ మహాదేవ్ మందిర్  అని ప్రసిద్ది పొందింది. అంతేగాక ఇక్కడ శ్రీకృష్ణుని మందిరం, హనుమాన్ మందిరం కలవు. ఇక్కడ గుడిలోని వేంకటేశ్వరుని మూలవిగ్రహం నల్లరాతితో చెక్కబడింది. ఈ విగ్రహం వీరభద్రునిలా మీసాలతో ఉండటమే కాక తిరుపతిలో మాదిరిగా చేతిలో కత్తితో ఉండటం విశేషం (తిరుపతి లోని మూలవిగ్రహం తలపైన చంద్రవంక, ఝాటాజూటం,  మేనిపై నాగుపముతోబాటు చేతిలో కరవాలంతో వీరభద్రస్వామిని పోలి ఉంటుందని పలువురు తమ గ్రంధాలలో ప్రస్తావించటం జరిగింది - బహుశా భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపే దృష్టితో ఝాంసింగ్ కూడా ఇక్కడి వేంకటేశ్వరుని విగ్రహాన్ని చెక్కించాడేమో). నీటికై ఇక్కడ రెండు బావులను కూడా ఝాంసింగ్ తవ్వించాడు, పర్షియన్ శైలిలో అద్భుతమైన ఈ బావుల నిర్మాణంతో బాటు, ఈ నీరు కూడా చల్లగా తీయగా ఉండటం మరో విశేషం. అలాగే దేవాలయం వాద్యాల, రథం నిమిత్తమై దేవాలయానికి ఎదురుగా అద్భుతమైన  "నగారా మందిరం/నగర్ఖానా" నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం ముఖద్వారం వద్ద రెండు గుర్రాలను కూడా మలచడం ఒక విశేషం. అలాగే యాత్రికుల వసతికై ధర్మశాలను, స్వామివారిని ఊరేగించే రథానికై ఒక రథశాలను నిర్మించటం జరిగింది, ఈ రథానికి ముందర రెండు గుర్రాలను చెక్కటం మరో విశేషం.  ఆకాశ దీపాన్ని ఉంచేందుకు ఇక్కడ పెద్ద రాతి ధ్వజస్థంబం కలదు, ఈ రాతి ధ్వజస్థంబం తిరుపతి, కంచి ధ్వజస్థంబాల పోలి ఉంటుంది (ఇలాంటివి మరోచోట కానరావు). అలాగే అద్భుతమైన కర్ర ధ్వజస్థంబం కూడా ఉంది. దేవాలయానికి 12 స్థంబాలతో కూడిన మంటపం ఉంది. ఈ దేవాలయం శివ,కేశవుల మందిరాలతో శైవ-వైష్ణవ మతాలవారిని  ఒకేదెగ్గర చేర్చటంతో బాటు, ప్రాంగణ ప్రాంతంలోనే ముస్లీముల ప్రార్థనా మందిరం "ఝాంసింగ్ మస్జీద్" ను కలిగి ఉండి హిందూ-ముస్లీం మతాలవారిని కలిపిఉంచి హైదరాబాదు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయం నిర్మాణ శైలిలో మెదక్ జిల్లా కంది గ్రామంలోని పాండురంగ స్వామి ఆలయానికి దగ్గరగా ఉంటుంది, అక్కడి ఆలయం కూడా దాదాపు ఝాంసింగ్ బాలాజీ మహాదేవ్ ఆలయం నిర్మించిన కాలంనాటిదే  కావటం విశేషం.   

ప్రభుత్వ సొమ్ముతో ఝాంసింగ్ గుడికట్టిన విషయం అధికారులకు తెలిసిపోయింది. అయితే ఆ కాలంలో నిజాం రాజ్యపు ప్రధానమంత్రిగా మహారాజా చందూలాల్ (ఈయన పేరున చందూలాల్ బారదారి అనే కాలనీ పిలువబడుతుంది) గారు ఝాంసింగ్ కు తరుణోపాయంగా దేవాలయంతో బాటు అక్కడే ప్రక్కన ఒక మసీదు నిర్మించమని సలహా ఇవ్వటం జరిగింది. చందూలాల్ గారి సలహాపై ప్రక్కనే ఒక మసీదును నిర్మించాడు ఝాంసింగ్ (ఈ మసీదును ఝాంసింగ్ మసీదు అని పిలుస్తారు). రాజధనం వినియోగించి దేవాలయం నిర్మించాడని అధికారుల ద్వారా తెలుసుకున్న రాజు సికందర్ జాహ్ దేవాలయాన్ని సందర్శించాడు. ప్రభుత్వ ధనాన్ని సొంతానికి వాడుకోక ప్రజల ఉపయోగానికి వినియోగించాటాన్ని రాజు క్షమించటం జరిగింది. అంతేకాక ఝాంసింగ్ కి గుర్రాలపైన ఉన్న మక్కువకు (గుర్రాలను దేవాలయంలో చెక్కించటం), అతనికున్న దైవభక్తికి, అతను దేవాలయంపై చెక్కించిన సుందర శిల్ప చాతుర్యానికి ముగ్ధుడై  ఆనందించి గుడి నిర్వాహణకై మెదక్ జిల్లాలోని లింగాపూర్ గ్రామాన్ని దానం ఇవ్వటం జరిగింది. 1942 నిజాం ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ గ్రామ ఆదాయం సంవత్సరానికి 8,408 రూపాయలు వచ్చేవిగా చెప్పబడింది

తెలంగాణ ప్రాంతంలో దసరారోజున ప్రతి ఒక్కరు గుడిని సందర్శించి భగవంతునికి జమ్మీ (బంగారం) అర్పించటం అన్నది చేస్తారు. మొదటగా దేవునికి అర్పించే తరువాత ఇంట్లో పెద్దలకీ పెట్టి ఆ తరువాతనే బయటవాళ్ళతో కలువటం అన్నది ఆచారం. ప్రాచీన సంప్రదాయం ప్రకారం దసరా సందర్భంలో ఇప్పటికీ ఇక్కడ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శిస్తారు. అంతేగాక మాఘమాసంలో ఇక్కడ ఉత్సవాలు జరుపబడతవి.    

నగరం నడిబొడ్డునే ఉన్నా తగిన ప్రచారం లేక ఈ అద్భుతమైన చారిత్రిక దేవాలయం ప్రస్తుతం జీర్ణావస్థలో ఉంది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఈ దేవాలయంపై తగిన శ్రద్ధ చూపినట్టైతే అందరికీ ఈ దేవాలయం గూర్చి తెలియటమే కాక యాత్రాస్థలంగా కూడా విలసిల్లగలదు. 



No comments:

Post a Comment