సత్య శబ్దభేదములు
సత్యమన సాదులోకము
సత్యంబన నిజము కలిమి శపథము పొత్తున్
సత్యమన బలము చెలిమియు
సత్యంబన నొక్క యెముక చతురత నయ్యెన్.
వివరణ:
సత్యము అనే శబ్దమునకు - సజ్జనులు (మంచివారు), నిజం, భాగ్యం, ప్రతిజ్ఞ, పొత్తు, బలము, స్నేహం, ఒక్క ఎముక, నేర్పరితనము అనే అర్థాలు కలవు.
సుత శబ్దభేదములు
కందము:
సుతయనగ గొడుకు గూతురు
సుతయనగా పర్వతంబు శుభము నశుభమున్
సుతయనగ రాజరమణియు
సుతయనగా నింద్రుడగ్ని శుకమున కయ్యెన్.
వివరణ:
సుత అనే శబ్దమునకు - కొడుకు, కూతురు, పర్వతము, మేలు, కీడు, రాజసొత్తు, ఇంద్రుడు, అగ్ని, చిలుక అనే అర్థాలు కలవు.
అవ్యక్త శబ్దభేదములు
కందము:
అవ్యక్తమనగ విష్ణువు
అవ్యక్తంబనగ సింహమగ్నియు వేడిన్
అవ్యక్తమన బ్రధానము
అవ్యక్తంబనగ సత్యమంబుధి యయ్యెన్.
వివరణ:
అవ్యక్త శబ్దమునకు - విష్ణువు, సింహము, అగ్ని, వేడి, ముఖ్యమైనది, సత్యము, సముద్రము అనే అర్థములు కలవు.
వృత్తాంత శబ్దభేదములు
వృత్తాంతమనగ బ్రస్తుతి
వృత్తాంతంబనగ లోక విషయములకు నీ
వృత్తాంతమన నుపాయము
వృత్తాంతమనంగ బుద్ది విస్తారమగున్.
వివరణ:
వృత్తాంతము అనే శబ్దమునకు - పొగడుట, ప్రపంచంలో జరిగే సంగతులు, ఉపాయం, బుద్దికుశలత, అనే అర్థములు కలవు.
భూత శబ్దభేదములు
కందము:
భూతమన సమము సత్యము
భూతమనంబొందుటలను బుద్దియు తనువున్
భూతమన పంచవిషయము
భూతమన నధోముఖాది భూతములయ్యెన్.
వివరణ:
భూతము అనే శబ్దమునకు - సమానమైనది, నిజాము, పొందుట, బుద్ది, శరీరం, పంచభూతాలు, క్రింది ముఖలుగల జీవరాశులు అనే అర్థాలు కలవు.
భూతి శబ్దభేదములు
కందము:
భూతియన గౌరీ గణపతి
భూతియు నైశ్వర్యకరము పుట్టుక ముక్తిన్
భూతియన భుక్తి సంపద
భూతియనగ నొప్పు ఖ్యాతి భూతములయ్యెన్.
వివరణ:
భూతి అనే శబ్దమునకు - పార్వతీదేవి, గణపతి, ఐశ్వర్యం, పుట్టుక, మోక్షం, భుజించుట, సంపద (లక్ష్మి), కీర్తి, పంచభూతాలు - విభూతి అనే అర్థాలు కలవు.
హేతి శబ్దభేదములు
కందము:
హేతియన యినుడు రాక్షసి
హేతియనన్ అగ్ని రశ్మి యింద్రుడు శశియున్
హేతియన బ్రహ్మ జ్వాలయు
హేతియనన్ ఆయుధంబు హేతువులయ్యెన్.
వివరణ:
హేతి అనే శబ్దమునకు సూర్యుడు, రాక్షసి, అగ్ని, కిరణము, ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, మంట, ఆయుధము, కారణము అనే అర్థాలు కలవు.
భాను శబ్దభేదములు
కందము:
భానుడన నగ్ని కరణము
భానుండన శశియు రవియు ప్రాణపరుండున్
భానువన భూమి శునకము
భానువనంగప్పవీపు బల్లియు నయ్యెన్.
వివరణ:
భాను అనే శబ్దమునకు - అగ్ని, కరణము, చంద్రుడు, సూర్యుడు, ప్రాణాలు కాపాడినవాడు, భూమి, కుక్క, కప్పవీపు, బల్లి అనే అర్థాలు కలవు.
తను శబ్దభేదములు
కందము:
తనువనగ తోలు దేహము
తనువనగా బ్రహ్మ విష్ణు ధారాధరమున్
తనువనగ బుద్ధి విరళము
తనువనగా స్వల్పమునకు దనకుంజెల్లున్.
వివరణ:
తనువు అనే శబ్దమునకు - తోలు, శరీరం, బ్రహ్మ విష్ణువు, మేఘము, బుద్ది, విశాలము, కొంత, తాను అనే అర్థములు కలవు.
వన శబ్ద భేదములు
కందము:
వనమనగ నీళ్ళు నడవియు
వనమనగా భయము లేమి వాహిని శ్వాసల్
వనమనగ దివిజుగొడుగును
వనమనగా రోమ మిభము వన్నెయు నయ్యెన్.
వివరణ:
వనం అనే శబ్దమునకు - నీరు, అడవి, భయము, పేదరికం, సమూహం, శ్వాస, వామనుని గొడుగు, వెంట్రుకలు, ఏనుగు, శరీరము రంగు అనే అర్థాలు కలవు.
కామిని శబ్దభేదములు
కందము:
కామినియన జీవక్రియ
కామినియన మురునిరాణి కలహంస యగున్
కామినియనగా బదనిక
కామినియన నల్ప వృద్ది గార్దాభమయ్యెన్.
వివరణ:
కామిని అనే శబ్దమునకు - ప్రాణాధారమైన వస్తువు, రతీదేవి, కలహంస, బదనిక (చెట్టుమీద మొలచు ఔషధి), అల్పుడు, పెరుగుదల, గాడిద అనే అర్థాలు కలవు.
No comments:
Post a Comment