Tuesday, 28 October 2014

జరిగిన బ్రహ్మంగారి కాలజ్ఞాన వాక్యాలు - ఆంగ్లేయ పాలన

Happened Kalajnana Words - British Rule

పోగరుబోతులంత భవిష్యమంతాయు 
బూటకమని పల్కుచుండేరుమా
కాగల కార్యముల్ కనురెప్పపాటులో 
జాగులేక జరిగేనుమా 
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. 

వివరణ:
పోగరుబోతులు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానాన్ని అంతా అబద్దమని అంటారు. అయితే చెప్పబడిన కాలజ్ఞానవాక్యాలు ఒకటివెంట ఒకటిగా విరామంలేకుండా జరిగిపోతూనే ఉంటాయి. 


భారతభూమిని పరిపాలనజేయు 
పరదేశవాసులు వచ్చేరుమా
ఆరువత్సరంబులు యేకరీతిగ
అంబయొక్కతె అవని నేలూనుమా
శివగోవింద గోవింద హరిగోవింద గోవింద. 

అర్థం:
భారతదేశాన్ని పరిపాలించాటానికి విదేశీయులు వస్తారు. ఆరు సంవత్సరాలు ఒకేరీతిగ ఒక అమ్మ ఈ భూమిని పాలించును. 

వివరణ:
బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పిన సమయానికి దాదాపు భారతదేశం అంతటా ముస్లీం రాజుల పాలన కొనసాగుతుంది. నిజానికి వీరి పూర్వులు దాదాపు 12 వ శతాబ్దం నుండీ టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి వేరేదేశాలనుండి వచ్చినవారే. అయితే వీరంతా భారతదేశంలో కలిసిపోవటమే కాకుండా భారతదేశంలోని ప్రధాన ప్రాంతాలనే తమ అధికారిక కేంద్ర ప్రాంతాలుగా చేసుకుని పరిపాలించి భారతదేశవాసులతో కలిసిపోవటం జరిగింది. అదీకాక బ్రహ్మంగారి కాలానికే వారు పరిపాలిస్తున్నందున "వస్తారు" అని వీరి గురించి చెప్పే అవకాశమే లేదు. అందువల్ల ఈ కాలజ్ఞాన వాక్యాలలో విదేశీయులుగా వీరి గూర్చి చెప్పబడలేదు అని చెప్పవచ్చు.

కాగా సుమారు 1600 ప్రాంతంలోనే ఈస్ట్ ఇండియా కంపనీ పేరుతో బ్రిటీష్ వాళ్ళు భారతదేశంలో ప్రవేశించటం జరిగింది. వెనువెంటనే డచ్, పోర్చుగీసులు రావటం జరిగింది. ఆ తరువాత భారతదేశంలోని ఒక్కొక్క ప్రాంతాన్ని బ్రిటీష్ వాళ్ళు ఆక్రమించుకుంటూ దాదాపుగా 1700 ప్రాంతం నుండీ 1947 వరకు బ్రిటీష్ పరిపాలన ఇండియాలో కొనసాగింది.వీరు భారతదేశాన్నే కాక ఆసియాలోని మరికొన్ని దేశాలనూ ఆక్రమించి పరిపాలించారు. అయితే వీరి కేంద్ర పరిపాలన (రాజు/రాణి) బ్రిటన్ నుండే సాగటం వలన, పరిపాలన ముగించిన తరువాత తిరిగి తమ మాతృదేశానికి వీరు వెళ్ళిపోవటంవలన, బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన వాక్యాలలో వీరినే పరదేశవాసులుగా పరిగణించే వీలు కలదు.  

"అంబ యొక్కతె అవని నేలూనుమా" అనే వాక్యాన్ని చాలామంది భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి అన్వయించి చెప్పటం జరిగింది. ఇందిరాగాంధీ గారు కూడా దాదాపు 16 సంవత్సరాలు పరిపాలించటం జరిగింది. బ్రహ్మంగారు చెప్పింది ఇందిరాగాంధి గారి గురించి కాకపోవచ్చుననే నేను భావిస్తున్నాను. 

పైన చెప్పిన వాక్యాలలో (ఒక పద్యంలా చెప్పబడినవి) మొదటి రెండు వాక్యాలలో పరదేశ వాసులు భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పి ఆ వెంటనే "ఆరువత్సరంబులు యేకరీతిగ అంబయొక్కతె అవని నేలూనుమా" అని చెప్పటం జరిగింది. ఈ వాక్యం బహుశా బ్రిటీష్ రాజ్యపు విక్టోరియా మహారాణి గురించే చెప్పి ఉండవచ్చునని నాభావన. ఆమె రవి అస్తమించ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని దాదాపు 64 సంవత్సరాల పాటు పరిపాలించటం జరిగింది. బ్రిటన్, ఇండియా, ఇర్లాండ్ దేశాలను ఆమె పాలించటం జరిగింది. భువిలో ఎక్కువ భూభాగాన్ని, ఎక్కువకాలం పాటు పరిపాలించిన వనిత విక్టోరియా మహారాణి.  అవని అంటే భూమి, ఏకరీతిగా అంటే ఒకే విధంగా అని అర్థం. భూమండలాన్ని (బ్రిటీష్ ప్రభుత్వం ఆక్రమించిన ప్రాంతాలను) ఆరు సంవత్సరాలపాటు ఒకేరీతిగా పరిపాలించింది అని మనం గ్రహించాలి. 

No comments:

Post a Comment