Monday, 27 October 2014

బ్రహ్మంగారి కాలజ్ఞానం

Sri Potuluri Veerabrahmendra Swamy Biography and Kalajnanam


శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు మహాపురుషులు, దివ్యజ్ఞాని. వీరి జనన విషయమై సరైన చారిత్రిక ఆధారాలు లభించలేక నేటికీ నిర్ధారణ కాలేదు. బ్రహ్మంగారు సుమారు 1600 ప్రాంతంలో  కాశీలో జన్మించినట్లు తెలుస్తుంది. వీరు పుట్టగానే వీరి తలిదండ్రులు పరిపూర్ణయాచార్య, ప్రకృతాంబలు మరణించినట్టు చెప్పబడుతుంది. సంతానంలేక తీర్థయాత్రలు చేస్తున్న వీరభోజయాచార్య, వీరపాపంబ దంపతులు ఆ పసిబిడ్డను దైవప్రసాదంగా భావించి తీసుకుని కర్ణాటక చిక్బల్లాపూర్ జిల్లాలో కలవారహళ్లి లోని తమ పాపాగ్ని మఠానికి తీసుకువస్తారు. బాల్యం అక్కడే గడిపిన బ్రహ్మంగారు, తండ్రి మరణం తరువాత తల్లికి జ్ఞానభోద చేసి దేశ సంచారానికి బయలుదేరతాడు.  దేశసంచారం చేస్తూ కర్నూలు జిల్లా బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారిదగ్గర పనికి కుదిరి పశువుల కాపరిగా చేరతాడు. పశువుల తోలుకుని వెళ్లి మేతకు వదిలేసి దగ్గరలోని రవ్వలకొండలో కూర్చుని కాలజ్ఞానం రాశారు. వారు రాసిన కాలజ్ఞాన తాళపత్రాలు కొన్ని లక్షల వరకు ఉంటాయని అంటారు. ప్రస్తుతం కొన్ని మఠంలో ఉండి వెలుగు చూసాయి. కాని చాలా వాటిని (14 లక్షల తాళపత్రాలు) బ్రహ్మంగారు అచ్చమ్మ ఇంటి ఆవరణలోని చింతచెట్టు కింద పాతిపెట్టినట్టు చెప్పబడుతుంది. ఆ చింతచెట్టుఇప్పటికీ అక్కడ పూజించ బడుతుంది.

బ్రహ్మంగారు సంచరించిన కాలం ముస్లీం రాజుల కాలం కావుటన ఎందఱో నవాబుల పిలుపు మేరకు వెళ్లి తన మహిమలు చూపి వారికి జ్ఞానభోద చేసి, కాలజ్ఞాన విశేషాలు చెప్పటం జరిగింది. అలా కడప, హైదరాబాదు వంటి నవాబులు బ్రహ్మంగారిని సన్మానించి గౌరవించారు. అంతేగాక ఎన్నో ప్రాంతాల్లో (నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ప్రాంతాలు) పర్యటించి కాలజ్ఞానభోద చేసినట్టు తెలుస్తుంది. బ్రహ్మంగారు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ తన జీవితకాలంలోనే ప్రాచుర్యం పొందారు. తరువాత ఒక్కొక్కటిగా వెలుగుచూసి నిజమైన వారి కాలజ్ఞాన అంశాలు బ్రహ్మంగారిని భారతదేశం అంతటికీ పరిచయం చేసింది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కేవలం ఒక ప్రాంతానికి సంబంధించే భవిష్యత్తు చెప్పలేదు, భారతదేశంలోని పలు ప్రాంతాలలో జరుగబోయే సంఘటనల గురించి మరియు అమెరికా లాంటి ప్రపంచ దేశాలలో జరుగబోయే సంఘటనల గురించి, విపత్తుల గురించి చెప్పి ప్రజల్ని జాగృతం చేయటం జరిగింది. 

బ్రహ్మంగారు తన జీవితకాలంలోనే కులమత తేడాల విచారించని గొప్ప సంఘసంస్కర్త. హరిజనుడైన మహబూబ్ నగర్ గద్వాలకు చెందిన కక్కయ్యకు, అతని భార్య కక్కమ్మకు జ్ఞానభోద చేసి శిష్యులుగా స్వీకరించటం జరిగింది. ఇక కడప జిల్లా ముడుమాలకు చెందిన దూదేకుల సయ్యద్ (ముస్లీం మతస్తుడు) బ్రహ్మంగారి భోదనలకు ఆకర్షితుడై శిష్యత్వమివ్వ వలసిందిగా కోరగా, బ్రహ్మంగారు శిష్యునిగా స్వీకరించి తన ప్రియశిష్యునిగా ప్రకటించటం జరిగింది. ఈ  సిద్దయ్య గారు కూడా బ్రహ్మంగారి తరువాత స్థానంలోఎంతో గొప్ప గౌరవ మర్యాదలను రాజులు, ప్రజల నుండి పొందటం జరిగింది. బ్రహ్మంగారు జీవహింసను ఖండించారు - జాతరలో మేకలను బలి ఇవ్వటాన్ని తగదని చెప్పి జ్ఞానభోద చేశారు. ఉన్నవారు లేనివారు అనే తారతమ్యాన్ని త్రోసిపుచ్చి సమానత్వాన్ని కనబరచి రాజులకే కాక సామాన్యులకూ జ్ఞానభోద చేశారు. ఇక పండితులు అన్నది పుట్టుకతో రాదనీ పాండిత్యం కలిగి ఉన్నవాడే పండితుడని వారినే పండితులుగా గుర్తించాలని పుష్పగిరి అగ్రహారికులకు తెలిపి జ్ఞానభోద చేశారు. భగవంతుని కార్యాలకు చందాల పేరుతో ప్రజలను బలవంతపెట్టి కష్టాలపాలు జేయాటాన్ని కూడా తిరస్కరించారు, పోలేరమ్మ జాతరకై చందాలను అడుగవచ్చి బలవంతపెట్టిన వారికి ఆ పోలేరమ్మ చేతనే నిప్పును తెప్పించి కనులు తెరిపించాడు. ఎన్నో మహిమలు చూపి అందరినీ ఆశ్చర్యపరచారు. 

బ్రహ్మంగారు కందిమల్లాయపల్లెలో స్థిరనివాసం ఏర్పరచుకుని జీవనం సాగించారు. ఆ గ్రామంలోని శివకోటయ్య కుమార్తె గోవిందమ్మను వివాహం చేసుకోవటం జరిగింది.  వీరికి సిద్దలింగయాచార్య స్వామి, గోవిందయాచార్య స్వామి, పోతులూరయాచార్య స్వామి, శివరామమూర్తయాచార్య స్వామి, ఓంకారయాచార్య స్వామి అనే 5 మంది కుమారులు, వీరనారాయణమ్మ అనే ఒక కుమార్తె జన్మించారు. బ్రహ్మంగారు తన కుమారుడు గోవిందయాచార్యను తన తరువాత మఠాధిపతిగా పట్టం కట్టి ప్రజలకు జ్ఞానోపదేశం చేసి, భార్య గోవిందమ్మకు తన జీవసమాధి తరువాత కూడా ఎప్పటిలాగే కుంకుమబొట్టు, తాళి, గాజులు, పూలతో ముత్తైదువలా ఉండమని ఆదేశించి అందరి సమక్షంలో జీవసమాధిలోకి వెళ్ళారు. ప్రియశిష్యుడు సిద్దయ్య తను సమాధిలోకి వెళ్ళటం తట్టుకోలేడు అని పూజకై పూలు తెమ్మని పంపటం జరుగుతుంది. తిరిగివచ్చిన సిద్దయ్య గారు విషయం తెలుసుకొని సమాధిపై బడి రొధించగా బ్రహ్మంగారు ప్రత్యక్షమై భోధచేసి తన దండము, పాదుకలు ఇచ్చి ఓదార్చి ప్రజలకు జ్ఞానభోధ చేయమని తెలుపటం జరుగుతుంది. తరువాత సిద్దయ్య కూడా ప్రజలకు ఎన్నో భొదలు చేయటం జరిగింది. సిద్దయ్య సమాధికి కూడా ఇప్పటికీ ప్రతి ఏటా ఆరాధనా ఉత్సవాలు ఘనంగా జరుపబడతాయి. 

బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల చర్చించి జరుగబోయే మంచి చెడులను తెలియపరిచి ప్రజలను జాగృతం చేయటం జరిగింది. అందులో కొన్ని విషయాలు సూటిగా ఉన్నా కొన్ని నిఘూడమైన అర్థాలతో కూడి ఉండి సామాన్యులు అర్థం చేసుకోవటానికి వీలు లేకుండా ఉన్నాయి. ఆ తాళపత్రాల కాలజ్ఞానాన్ని ఎక్కువగా ప్రజలకు చేరువ చేయలేకపోవటం జరిగింది, ఆ తాళపత్రా విషయాలు యధాతథంగా ప్రచురించ బడితే ఇంకా ఎన్నో విషయాలు ప్రజలకు చేరువ కాగలవు. అయితే కొంతమంది పండితులు కాలజ్ఞాన విషయాలను గ్రహించి వాటి విశేషాలను గద్య, పద్య రూపకాలుగా పుస్తకాల రూపంలో తేవటం జరిగింది. అంతేగాక నాటకాలు, యక్షగానాలు, బుర్రకథలు లాంటి ఎన్నో రూపకాల్లో  ప్రాచుర్యంలోకి తేవటం జరిగింది. ఆ కళారూపలన్నీ నేడు ప్రాజాదరణ కరవై అంతరించిపోవటం వల్ల నేటి తరం వారికి బ్రహ్మంగారి కాలజ్ఞాన బోధలు చేరువకాలేకపోతున్నవి. స్వర్గీయ NTR గారు "శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" అనే సినిమా తీసి కొంతవరకు బ్రహ్మంగారిని నూతన తరానికి పరిచయం చేయటం జరిగింది. ఇప్పటికీ ఈ సినిమా బ్రహ్మంగారి గురించి తెలియని వారికి, తెలుసుకోవటానికి సులభమార్గంగా ఉంది. అలాగే NTR గారు బ్రహ్మంగారి గొప్పదనాన్ని గుర్తించి ట్యాంక్ బండ్ పైన విగ్రహం పెట్టించి వచ్చిపోయే తెలుగురాష్ట్రేతర పర్యాటకులకు తెలిసేలా చేశారు.ఇక చాలామంది కలజ్ఞానాన్ని ఆడియో కేసేట్స్ రూపంలో తెచ్చి చాలా మందికి చేరువనే చేశారు. అయితే ఇవి అన్నీ కేవలం తెలుగుభాషలోనే ఉండటం వలన తెలుగువారికి తప్ప బ్రహ్మంగారి కాలజ్ఞాన విశేషాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారికి గాని, ప్రపంచానికి గాని తెలియబడటం లేదు. ఒకరిద్దరు ఆంగ్లంలో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని పుస్తకరూపంలో అందజేసినా వాటికి తగిన ప్రాచుర్యం లభించక అవి అంతగా ప్రపంచానికి చేరువ కాలేకపోయాయి. 

ఎక్కడో పుట్టిన నోస్ట్రడామస్ భారతదేశానికి సుపరిచితం కాని మన బ్రహ్మంగారు భారతదేశవాసులందరికీ సుపరిచితులు కాలేరంటే మన తెలుగువారు ఎలాంటి స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. యూరప్ దేశవాసులు శాస్త్రీయ పరిజ్ఞానానికే కాక దైవిక సంబంద విషయాలకూ అంతే ప్రాధాన్యతను ఇస్తారు.  అందువలన వారి మతాలు కాని వారి దేశాలలోని యోగులు సిద్దులు గాని బహుళ ప్రాచుర్యంలోకి తేబడి ప్రపంచానికి తెలియజేయబడ్డారు. అయితే మన భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. ఏ పత్రికలోనూ, చానల్ లోనూ బ్రహ్మంగారి గురించి ప్రచారం కనిపించదు. నేను కొత్తగా కాలజ్ఞానంలో తెలుసుకున్న విశేషాలను కొన్ని పత్రికలకు, చానల్ వారికి పంపి చూశాను, ఎవరూ స్పందించలేదు. అయితే డబ్బులు ఇస్తే వేస్తామని కొందరు వార్తలు సేకరించేవారు చెప్పటం గమనించ దగ్గ విశేషం (ఎంతో విలువైన మీడియాను ఇంతటికి దిగజారుస్తున్నారు  కొందరు మహాశయలు). చివరకు   హిందూమతభక్తిని ప్రచారం చేసే ఒక చానల్ వారిని సంప్రదిస్తే కూడా "ఇలాంటి మూఢనమ్మకాలను మేము ప్రచారం చేయము" అని చెప్పటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలను బ్రహ్మంగారు ముందుగా చెప్పిన విషయం మూఢనమ్మకం ఎలా అవుతుందో అర్థం కాని విషయం. ఇక ఈ చానల్స్ కాని పత్రికలవారు కాని రోజు/వారంలో జరుగబోయే రాశీఫలాలు లాంటివి నిత్యం చెబుతూ/వేస్తూనే ఉంటారు మరి. ఇక టీవీలలో వచ్చే తాయత్తులు, పూసలు, సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం అంటూ ఇచ్చే కార్యక్రమాలు, ప్రాయోజిత కార్యక్రమాలకు అంతే ఉండదు. తక్కువ ధరలు చూసి మోసపోకండి అని ఒకవంక చెబుతూనే మరోవంక నాణ్యత లేని, మోసపూరితమైన వస్తువుల ప్రాయోజిత కార్యక్రమాలను ప్రతినిత్యం ప్రచారం చేస్తుంటారు. ఏతావాతా గ్రహించింది ఏమిటంటే చాలా మటుకు నేటి పత్రికలు, ఛానళ్ళు కేవలం వ్యాపార దృక్పథంలోనే నడుస్తున్నాయి తప్ప సమాజ ఉద్దరణకు కాదు. అందుకే మనం ప్రచారంలో విదేశీయులకంటే వెనుకబడి ఉన్నాం. వేల ఏళ్ల క్రితమే మనం నాగరికులమై ఎన్నో విషయాలు కనుక్కుని ఉన్నా ప్రచారలోపంవలన అవి వెలుగులోకి రాలేవు, అయితే వాటిని తస్కరించిన వారు మాత్రం ఇప్పుడు తామే వాటిని ముందుగా కనుక్కున్నామని ధృవపరిచేస్థాయిలో ఉన్నారు. మనం ఇలా ఉండబట్టే మన పంటలను, ఉత్పత్తులను, వస్తువులను, విజ్ఞానంనే కాక ఆఖరికి మన భాషను సహితం వేరే దేశంవారు తమదిగా ప్రకటించుకుని హక్కుగా చేసుకున్నారు. 

ప్రత్యేకించి చెప్పేదేమంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం మూఢనమ్మకం అనుకోవటం అవివేకమే అవుతుంది. ఆయన చెప్పినవెన్నో నిత్యం జరుగుతూనే ఉన్నాయి, అవి జరిగిన తరువాతనే మనం విశ్వసిస్తున్నాము. ఆయన చెప్పినవాటికి జరిగినవాటికి సరిగ్గా సరిపోతున్నపుడు, కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తున్నపుడు ఇది సైన్సు కాదు మూడత్వం అని వాదించటం మూర్ఖత్వమే అవుతుంది. అవి సైన్సుకు అందటం అందకపోవటం అన్నవి ముఖ్యం కాదు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు-జరుగుతున్న విషయాలు ఒకటేనా అన్నదే ప్రధాన విషయం.  కాగా బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞాన విషయాలను కొందరు పండితులు సరిగా గ్రహించుకోలేక పోవటం కూడా ఒక మైనస్ పాయింట్. కొంతకాలం క్రితం ఒక పండితుడు సరైన అవగాహన లేక 1999 లోనే కలియుగాంతం అవుతుందని పుస్తకాల మీద పుస్తకాలు రాశాడు. ఇంకా కొందరు ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో ఎంతో రక్తపాతం జరిగి కొట్టుకు చస్తారు అని చెప్పుకొచ్చారు. ఇలా తమ స్వప్రయోజనాలకు లేదా తమకు అనుకూలంగా కాలజ్ఞాన వచనాలకు భాష్యం చెప్పటంవలన ప్రజల్లో కొంతమందికి కాలజ్ఞానంపైన విశ్వాసం కోల్పోయేలా చేస్తున్నారు. ఇక బ్రహ్మంగారు చెప్పినట్టు నేను కల్కి అవతారాన్ని అంటే నేను అని చెప్పే వారికి కొదవేలేదు. ఎక్కడి వారక్కడ స్వార్థం పెంచుకుని స్వప్రయోజనాలకై బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల్ని తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రహ్మంగారు ఎక్కడ ప్రపంచానికి తెలియజేయబాడతారు? ఎలా ఈ కాలజ్ఞానం విశ్వసించబడుతుంది? 

కాలజ్ఞాన వచనాలను అన్నిటినీ యథాతథంగా మనం గ్రహించలేము, కొన్నిటిని ఎంతో లోతుగా ఆలోచిస్తేనే కాని అసలు విషయం గుర్తించలేము. చాలామంది యథాతథంగా గ్రహించడం వలన, ఇవి జరిగే అవకాశం ఉందా?  అనే ప్రశ్న జనించటమే కాక జరిగిపోయిన విషయాలను కూడా మనం గుర్తించలేకపోతున్నాం. నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞాన విశేషాలతో బాటు నేను సేకరించిన బ్రహ్మంగారి కాలజ్ఞానంకు సంబందించిన విషయాలను (ముఖ్యంగా జరిగిన విషయాలను), బ్రహ్మంగారు రాసిన తాళపత్రగ్రందాల మూల శ్లోకాలను ఉటంకిస్తూ ఈ బ్లాగులో ప్రత్యేక విభాగంగా పెట్టదలచాను. వాటిలో ప్రస్తుత రాజకీయ అంశాల గురించే కాక రాజకీయ నాయకుల గురించి కూడా బ్రహ్మంగారు చెప్పి ఉండటం ఒక విశేషం. 

No comments:

Post a Comment