Thursday, 16 October 2014

నానార్థ నిఘంటువు-3

శివ శబ్దభేదములు 

కందము:
శివయనగ శివుడు నక్కయు 
శివయనగా శుభము గంధశింధురమవనిన్ 
శివయనగ సుఖము నుదకము 
శివయనగా గౌరీ జమ్మిచెట్టుకు చెల్లున్. 

వివరణ:
శివ అనే శబ్దమునకు - శివుడు, నక్క, శుభము, మదించిన ఏనుగు, భూమి, సుఖము, నీరు, పార్వతి, జమ్మి చెట్టు అనే అర్థాలు కలవు. 



సోమ శబ్దభేదములు 

కందము:
సోమయన చంద్రుడద్రియు
సోమయన గుబేరుడగు నసురచుట్టంబౌ
సోమయన బచ్చకపురము
సోమయనన్ దశసుతార్థ సుదతియునయ్యెన్ 

వివరణ:
సోమ శబ్దమునకు - చంద్రుడు, పర్వతము, కుబేరుడు, సోమకాసురుడు, బంధువు, పచ్చకర్పూరము, పదిమంది కుమారులగన్న తల్లి అనే అర్థములు వచ్చును. 



వాణి శబ్దభేదములు 

కందము:
వాణియన నఖము ముఖమును 
వాణియనగ నదియు సుకవి వాచాశుద్దిన్ 
వాణియన బ్రహ్మరాణియు 
వాణియనన్నాకసంబు వార్తయు నయ్యెన్. 

వివరణ:
వాణి శబ్దమునకు - గోరు, ముఖము, నది, మంచికవి, వాక్శుద్ధి, సరస్వతి, ఆకాశము, వార్త అనే అర్థములు కలవు. 



భీష్మ శబ్దభేదములు 

కందము:
భీష్మమన భీష్ముడగు నీ 
భీష్మమనగ నింద్రియముల బిగియించుటయున్ 
భీష్మమె శివుడు భయంబును 
భీష్మమనగ నక్షరాదిబీజములయ్యెన్ 

వివరణ:
భీష్మ శబ్దమునకు - భీష్ముడు, ఇంద్రియబంధనం, శివుడు, భయము, అక్షరము మొదలుగా గల బీజములు (బీజాక్షరములు)  అనే అర్థాలు కలవు. 




హరి శబ్దభేదములు

కందము:
హరి యింద్ర చంద్ర సూర్యులు 
హరి గుఱ్ఱము కప్ప పాము హరి విష్ణువగున్
హరి యముడు కోతి లేడియు
హరి సింహము చిలుక వాయు నపరంజికళల్. 

వివరణ:
హరి అనే శబ్దమునకు - ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, గుఱ్ఱము, కప్ప, పాము, విష్ణుమూర్తి, యముడు, కోతి, లేడి, సింహము, చిలుక, గాలి, బంగారపుఛాయ అనే అర్థాలు కలవు.  



రామ శబ్దభేదములు 

కందము:
రామయన ముగురుమూర్తులు 
రామయనన్ నల్పు తెల్పు రమ్యత పసిమిన్ 
రామయన నరుడు వరుడును
రామయనన్ రమణి పసుపు రమ్యంబయ్యెన్. 

వివరణ:
రామ శబ్దమునకు - పరుశురాముడు, బలరాముడు, శ్రీరాముడు, నలుపు, తెలుపు, మెరిసే బంగారం, మనిషి, రాజు, స్త్రీ, పసుపు, సుందరము అనే అర్థాలు కలవు. 



గోవింద శబ్దభేదములు 

కందము:
గోవిందమనగ బసరము 
గోవిందంబనగ దొడ్డగొల్లడు గిరియున్ 
గోవిందమనగ విష్ణువు
గోవిందంబనగ బిల్లన గ్రోవియు నయ్యెన్ 

వివరణ:
గోవింద శబ్దమునకు - ఆవు, గొల్లవాండ్రలో గొప్పవాడు, పర్వతము, విష్ణువు, పిల్లనగ్రోవి అనే అర్థాలు కలవు. 



శ్యామ శబ్దభేదములు 

కందము:
శ్యామమన నీలి నల్పును
శ్యామంబన పచ్చయగు నిశంబగు నవనిన్ 
శ్యామమె సుగంధపాలయు 
శ్యామంబన ప్రేంకణంబు శైవంబయ్యెన్. 

వివరణ:
శ్యామ శబ్దమునకు - నీలిరంగు, నలుపు, పచ్చ, రాత్రి, భూమి, సుగంధిఫాల చెట్టు (ఒక ఔషదపు మొక్క), ప్రేంకణ చెట్టు (ప్రియాళ వృక్షం), శివమతము అనే శబ్దములు వచ్చును.  



గంధర్వ శబ్దభేదములు 

కందము:
గంధర్వమనగ గరుడుడు
గంధర్వమనంగ మృగము కలహంస యగున్ 
గంధర్వమనగ బాణము 
గంధర్వమనంగ హయము గాయకుడయ్యెన్. 

వివరణ:
గంధర్వ శబ్దమునకు - గరుత్మంతుడు, మృగము, హంస, బాణం (ఆయుధము), గుఱ్ఱము పాట పాడువాడు అనే అర్థాలు కలవు. 



సురభి శబ్దభేదములు 

కందము:
సురభియన చైత్రమాసము 
సురభియన వసంతఋతువు సుపరిమళంబున్
సురభియన నాడయేనుగు 
సురభియనన్ ధేను నమిత సుభగత్వమయెన్. 

వివరణ:
సురభి అనే శబ్దమునకు - చైత్రమాసము, వసంతఋతువు, సువాసన, ఆడ ఏనుగు, ఆవు, మంచి (శుభము) అనే అర్థాలు కలవు. 




పుండరిక శబ్దభేదములు

కందము:
పుండరికమనగ ధిక్కరి 
పుండరిక మనంగ బెద్దపులి రజితంబున్ 
పుండరికమె వెలిదామర 
పుండరిక మనంగ మావిభూజం బయ్యెన్. 

వివరణ:
పుండరిక శబ్దమునకు - దిగ్గజము, పెద్దపులి, వెండి, తెల్లతామర, మామిడిచెట్టు అనే అర్థాలు కలవు.  


No comments:

Post a Comment