శ్రీ శబ్దభేదములు
కందము:
శ్రీయన జిల్లెడు వృక్షము
శ్రీయన సంపదయు యశము శ్రీకుసుమంబున్
శ్రీయన విషము సరస్వతి
శ్రీయన శైలూష తరువు సిరికిని జెల్లున్.
వివరణ:
శ్రీ అనే శబ్దానికి - జిల్లేడు వృక్షము, సంపద, కీర్తి, లవంగము (శ్రీకుసుమము=లవంగ మొగ్గ), విషము, సరస్వతి, మారేడు చెట్టు, లక్ష్మీ అనే అర్థాలు కలవు. (నా దగ్గరగల ప్రతిలో మొదటిపాదం "శ్రీయనగ జిల్ల వృక్షము" అని ఉంది ఛందస్సు ప్రకారం సరిచేశాను-ఛందస్సు దోషాలు అన్నిటికీ నేను సరిచూడలేదు)
శ్రీపర్ణ శబ్దభేదములు
కందము:
శ్రీపర్ణమనగ దామర
శ్ర్రీపర్ణ మనంగ పక్షి శివుడును హరియున్
శ్రీపర్ణ మనగ దెల్పును
శ్రీపర్ణంబనగ చెఱుకు శింధురమయ్యెన్
వివరణ:
శ్రీపర్ణ శబ్దమునకు - తామర, పక్షి, శివుడు, విష్ణువు, తెలుపు రంగు, చెఱుకు, సింధూర వర్ణము(ఎరుపు) అనే అర్థములు కలవు.
శక్తి శబ్దభేదములు
కందము:
శక్తియన నిజము లావును
శక్తియనంగట్టిగుణము శస్త్రములగునీ
శక్తి కుమారస్వామియు
శక్తియనగ నాడవేల్పు సహజము నయ్యెన్.
వివరణ:
శక్తి శబ్దమునకు - నిజము, బలము, పటుత్వము, బాణములు, కుమారస్వామి, ఆడ దేవత, స్వభావము అని అర్థములు కలవు.
కలకంఠ శబ్ద భేదములు
కందము:
కలకంఠమనగ గోకిల
కలకంఠమనంగ నింపుగల గళరవమున్
కలకంఠమన కలరవము
కలకంఠమనంగ హంస కమలాధిపుడున్.
వివరణ:
కలకంఠ శబ్దమునకు - కోకిల, మంచి స్వరము, పావురము, హంస, సూర్యుడు అనే అర్థాలు కలవు.
స్వర్గ శబ్ద భేదములు
కందము:
స్వర్గమన నాకసంబును
స్వర్గంబన నాగలోక సౌఖ్యము దృష్టిన్
స్వర్గమన నిజము త్యాగము
స్వర్గంబధ్యాయనంబు చతురత నయ్యెన్.
వివరణ:
స్వర్గమనే శబ్దమునకు - ఆకాశము, నాగలోకము(పాతాళ లోకము), సౌఖ్యము, మంచి చూపు, నిజము (సత్యం), త్యాగం, అధ్యాయనము (అభ్యాసం), నేర్పరితనము అనే అర్థాలు కలవు.
ఖగ శబ్దభేదములు
కందము:
ఖగమనగ బాణ మర్థము
ఖగ మింద్రుండగ్ని పాము కప్పయు పక్షిన్
ఖగమనగ బ్రాణ మశ్వము
ఖగమన రవి శశి గ్రహములు కచ్ఛవమయ్యెన్.
వివరణ:
ఖగ శబ్దమునకు - బాణము, ధనము, ఇంద్రుడు, అగ్ని, పాము, కప్ప, పక్షి, ప్రాణము, గుఱ్ఱము, సూర్యచంద్ర నక్షత్రములు, తాబేలు అను అర్థాలు కలవు.
ఘృత శబ్దభేదములు
కందము:
ఘృతమనగ నేయి నీళ్ళును
ఘృతమనగా బాలు చల్ల గుగ్గిల మయ్యెన్
ఘృతమనగ దేనె నెత్తురు
ఘృతమన సంసారసుఖము గుణకాలమగున్.
వివరణ:
ఘృతమనే శబ్దమునకు - నెయ్యి, నీరు, పాలు, చల్ల, గుగ్గిలము, ఇనుము, తేనె, రక్తము, సంసార సుఖము, గుణించెడు కాలము అనే అర్థములు కలవు.
మధు శబ్దభేదములు
కందము:
మధువనగ జైత్రమాసము
మధు నెత్తురు నుప్పు రసము మారెడుపండున్
మధు తేనె కల్లు నేయిని
మధు నీరును లవణకంధి మన్మధుడయ్యెన్.
వివరణ:
మధు శబ్దమునకు - చైత్రమాసము, రక్తము, ఉప్పు, రసము(పాదరసము), మారెడు పండు, తేనె, కల్లు, నెయ్యి, నీరు, ఉప్పుసముద్రము, మన్మధుడు అనే అర్థాలు కలవు.
రత్న శబ్దభేదములు
కందము:
రత్నమన భూరి కంబడి
రత్నంబన దొంతి రాయి రత్నము గిరియున్
రత్నమన రాజు రమణియు
రత్నంబన ఫణి సుగుణుడు రంపంబయ్యెన్.
వివరణ:
రత్న శబ్దమునకు - శ్రేష్టమైన రత్నకంబళి, దొంతిరాయి, రత్నము, కొండ, రాజు, స్త్రీ, పాము, మంచిబుద్దికలవాడు, కోసే రంపము అను అర్థాలు కలవు.
కచ శబ్దభేదములు
కందము:
కచయనగ నాడయేనుగు
కచయనగ శిరోరుహములకనికిని జెల్లున్
గచయనగా బంధించుట
కచయన గురుపుత్రులకును గారణ మయ్యెన్.
వివరణ:
కచ శబ్దమునకు - ఆడఏనుగు, తలవెంట్రుకలు, యుద్దము, కట్టివేయుట, బృహస్పతి కుమారుడగు కచుడు అనే అర్థాలు కలవు.
అజ శబ్దభేదములు
కందము:
అజయనగ బ్రహ్మ విష్ణువు
అజయనగ శివుడు గౌరి ఆత్మయునర్థిన్
అజయన రఘుపతితనయుడు
అజయనగా మేకమూక ఆకసమయ్యెన్.
వివరణ:
అజ శబ్దమునకు - బ్రహ్మ, విష్ణువు, శివుడు, పార్వతి, ఆత్మ, యాచకుడు, రఘుమహారాజు కొడుకగు అజ మహారాజు, మేకలగుంపు, ఆకాశము అనే అర్థములు కలవు.
No comments:
Post a Comment