ఈ నానార్థ నిఘంటువు అనేది సంస్కృత పదాలకు ఇవ్వబడిన అర్థాలు, ఒకే పదానికి ఉండే పలు రకాల అర్థాలు. ఈ పద్యాలను ఎవరు రాశారో ఇంతవరకు ఎవరూ వెలికి తీయలేదు. మొదట్లో ఎన్నో రచనలకు రచయితలు తమ పేరు, తమ విషయాలను జోడించేవారు కాదు. రచయిత పేరు లేని ఇలాంటి రచనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటికీ తమపేరు జోడించుకున్నవారు కూడా లేకపోలేరు.
నానార్థాలు ఎలా ఏర్పడ్డాయి? ఒక పదానికి పలు విదములైన అర్థాలు ఎలా ఉద్భవించాయి? అని ఆలోచిస్తే పూర్వ కాలంలో అనగా మనిషి భాషను మాట్లాడటం మొదలు పెట్టినపుడు ఒక్కొకరు ఒక్కో పనిని లేదా వస్తువులను భిన్న భిన్నంగా పిలవటం జరిగింది. అది ఒక ప్రాంతంలోని పిలుపు కావచ్చు లేదా అన్య ప్రాంతాపు పిలుపు కావచ్చు వాటివల్ల ఆయా భాషలకు ఇలా నానార్థాలు ఏర్పడటం జరిగింది. కొన్ని సందర్భాలలో ఈ అర్థాలు పూర్తిగా విరుద్దంగానూ ఏర్పడ్డాయి. ఉదా:- శ్రీ అనే పదానికి అమృతంతో బాటు విషం అనే పూర్తీ విభిన్న అర్థమూ కలదు. పలు సందర్భాల్లో ఒకరికొకరు పడని ఇద్దరు వ్యక్తులు పరస్పరం సంభాషణను కావాలని తప్పుపట్టి వాటికిగల నానార్థాలు తీయటం జరుగుతుంది. నానార్థాలు ఈ విధంగా కూడా వాడబడుతుంటాయి. ఇక కొన్ని ప్రాచీన గ్రంధాలలోని అర్థాన్ని ఇదే విధంగా ఒక్కో వ్యాఖ్యాత ఒక్కో విధంగా తమకు నచ్చిన/అనుకూల విధంగా అన్వయించి చెప్పటం జరుగుతుంది. ప్రత్యేకించి మహాపురుషులు సూటిగా కాకుండా మర్మగర్భంగా నానార్థాలు ఉపయోగించి చెప్పటం జరుగుతుంది - వాటిని భేదించటంలో ఈ నానార్థాలు ఎంతో ఉపయుక్తమవుతాయి.
నానార్థ నిఘంటువు ఇప్పుడు అంతగా ప్రాచుర్యంలో లేదు, అలభ్యంగానూ ఉంది కనుక అందులోని కొన్ని పద్యాలను నా బ్లాగులో ఉంచుతున్నాను. నానార్థ నిఘంటువుకు కొన్ని పాఠాంతరాములు కూడా కలవు. ఇవి అన్నీ కందపద్యాలే అని గమనించగలరు. నా దగ్గర గల ఈ ప్రతిలో పలు అక్షరదోషాలు ఉన్నవి, నాకు కనిపించిన కొన్నిటిని సరిచేసి ఇక్కడ ఉంచుతున్నాను. నిఘంటువులలో లేని కొన్ని పదాలు ఈ నానార్థ నిఘంటువులో మనకు దొరుకుతాయి.
సంస్కృత శబ్దభేదములు
కందము:
సంస్కృతమె లక్షణోత్తము
సంస్కృతమన కవిత గతియు సర్పము మూకన్
సంస్కృతమన జవి పెదవియు
సంస్కృతమన బక్షి పండు సభ మొదలయ్యెన్.
వివరణ:
సంస్కృత శబ్దానికి - లక్షణముతో కూడినది, కవిత్వము, మార్గము, పాముల సమూహము, రుచి, పెదవి, పక్షి, పండు, సభ అను అర్థములు కలవు.
శ్రుతి శబ్దభేదములు
కందము:
శ్రుతియనగ జదువు శాస్త్రము
శ్రుతియన వేదంబు వార్త జుంటీగ చెవుల్
శ్రుతియనగ బ్రహ్మ విప్రుడు
శ్రుతియనగా భవునికన్ను శుభమును నయ్యెన్.
కందము:
శ్రుతి శబ్దమునకు - చదువు, శాస్త్రము, వేదము, వార్త, తేనెటీగ, చెవులు, బ్రహ్మ, బ్రాహ్మణుడు, శివుని కన్ను(మూడవకన్ను), శుభమ్ (మేలు) అనే అర్థాలు కలవు.
పద శబ్దభేదములు
కందము:
పదమన నెనరు నిలుకడ
పదమనగా వస్తు వాక్య బాణము పనియున్
పదమన గిరణోద్యోగము
పదమనగా నడుగు మోక్షపదవియు నయ్యెన్
వివరణ:
పదము శబ్దమునకు - నెనరు (ప్రేమ), ఉనికి, వస్తువు, వాక్యము, బాణము, పని, కిరణము, ఉద్యోగము (అధికారము), అడుగు (పాదపు అడుగు), మోక్షము పొందుట అనే అర్థములు కలవు.
అమృత శబ్దభేదములు
కందము:
అమృతమన మోక్ష మబ్దియు
నమృతమన పాలు నీళ్ళు నంబుజమిత్రుం
డమృతంబనగా బులియును
అమృతంబన నాకసంబు హస్తియు నయ్యెన్.
వివరణ:
అమృతము పదమునకు - మోక్షము, సముద్రము, పాళ్ళు, నీళ్ళు, సూర్యుడు, పులి, ఆకాశము, ఏనుగు అనే అర్థములు కలవు.
వజ్ర శబ్దభేదములు
కందము:
వజ్రమన భూమి యురగము
వజ్రంబన దిక్కు రశ్మి వాక్కును కన్నున్
వజ్రమన స్వర్గమెముకయు
వజ్రంబన ఆనగంబు వజ్రము నయ్యెన్.
వివరణ:
వజ్రమున శబ్దమునకు - భూమి, పాము, దిక్కు, కిరణము, నోరు, కన్ను, స్వర్గము, ఎముక, సొరకాయ (అనగము కాయ), వజ్రము అనే అర్థములు కలవు.
కరుణ శబ్దభేదములు
కందము:
కరుణయన గళ ప్రదేశము
కరుణయనన్వెలయు నర్థి కాయము గృపయున్
గరుణయన గుణప్రదేశము
కరుణయనన్ దథ్య మొరుల గాచుటనయ్యెన్.
వివరణ:
కరుణ శబ్దమునకు - కంఠస్థానము, వెల (ఖరీదు), యాచకుడు, శరీరము, దయ, మంచితనమున్న చోటు, నిజము, ఇతరుల రక్షించుట అనే అర్థములు కలవు.
ఆక్రందన శబ్దభేదములు
కందము:
ఆక్రందనమన మ్రోతయు
ఆక్రందనమనగ నేడ్పు నతిభయమందున్
ఆక్రందనమనగ వేడుట
ఆక్రందనమనగ బక్షి యశ్వము నయ్యెన్
వివరణ:
ఆక్రందన శబ్దమునకు - మ్రోత, ఏడుపు, ఎక్కువభయం, వేడుకొనుట, పక్షి, గుఱ్ఱము అనే అర్థములు కలవు.
గతి శబ్దభేదములు
కందము:
గతి యనగాను నుపాయము
గతియన బాల్యమున జేయు కార్యములగునీ
గతి యనగ బుద్దిమార్గము
గతి యనగా గమనమునకు గారణ మయ్యెన్.
వివరణ:
గతి శబ్దమునకు - ఉపాయం, చిన్నతనంలోచేసిన పనులు, బుద్ది, త్రోవ, నడక, కారణము అనే అర్థములు కలవు.
కందము:
భోగమన పాము పడగయు
భోగంబన శుభము కీర్తి భోజన మోప్పున్
భోగమన దపము భువనము
భోగంబన మేనమామ పుత్రిక యయ్యెన్.
వివరణ:
భోగ శబ్దమునకు - పాముపడగ, శుభము, కీర్తి, భోజనము, తపస్సు, లోకము, మేనమ కూతురు అనే అర్థములు కలవు.
కందము:
యోగమన గల్ప ప్రాయము
యోగంబన నుక్తి రాజయోగము వినుతుల్
యోగమన చిత్తవృత్తియు
యోగంబన బూర్వజన్మ ముత్తమ మయ్యెన్.
వివరణ:
యోగ శబ్దమునకు - కల్పాంతరవయస్సు, మాట, రాజయోగము, పొగడుట, పెద్ద వ్యాపారము, పూర్వజన్మ కర్మము, శ్రేష్టము అను అర్థాలు కలవు.
కందము:
అర్థమన ధనము పసిడియు
నర్థంబన వస్తు వాక్య మమృత మధిపుం
డర్థమన మానుషార్థము
అర్థంబన నిత్యకర్మ మతిశయ మయ్యెన్
వివరణ:
అర్థమనే శబ్దమునకు - ధనము, బంగారము, వస్తువు, వాక్యము, అమృతము, రాజు, మనుష్యసంబందమైనవి, నిత్యకర్మ, అధిక్యము అనే అర్థాలు కలవు.
గతి శబ్దమునకు - ఉపాయం, చిన్నతనంలోచేసిన పనులు, బుద్ది, త్రోవ, నడక, కారణము అనే అర్థములు కలవు.
భోగ శబ్దభేదములు
కందము:
భోగమన పాము పడగయు
భోగంబన శుభము కీర్తి భోజన మోప్పున్
భోగమన దపము భువనము
భోగంబన మేనమామ పుత్రిక యయ్యెన్.
వివరణ:
భోగ శబ్దమునకు - పాముపడగ, శుభము, కీర్తి, భోజనము, తపస్సు, లోకము, మేనమ కూతురు అనే అర్థములు కలవు.
యోగ శబ్దభేదములు
కందము:
యోగమన గల్ప ప్రాయము
యోగంబన నుక్తి రాజయోగము వినుతుల్
యోగమన చిత్తవృత్తియు
యోగంబన బూర్వజన్మ ముత్తమ మయ్యెన్.
వివరణ:
యోగ శబ్దమునకు - కల్పాంతరవయస్సు, మాట, రాజయోగము, పొగడుట, పెద్ద వ్యాపారము, పూర్వజన్మ కర్మము, శ్రేష్టము అను అర్థాలు కలవు.
అర్థ శబ్దభేదములు
కందము:
అర్థమన ధనము పసిడియు
నర్థంబన వస్తు వాక్య మమృత మధిపుం
డర్థమన మానుషార్థము
అర్థంబన నిత్యకర్మ మతిశయ మయ్యెన్
వివరణ:
అర్థమనే శబ్దమునకు - ధనము, బంగారము, వస్తువు, వాక్యము, అమృతము, రాజు, మనుష్యసంబందమైనవి, నిత్యకర్మ, అధిక్యము అనే అర్థాలు కలవు.
బాగుంది. ఆగిపోకండి. సాగిపొండి.శుభం భూయత్ !!
ReplyDelete