Wednesday, 24 September 2014

తెలంగాణ ప్రత్యేక విశిష్ట పండగ పెద్దలమాస



తెలంగాణ రాష్ట్రంలో పెద్దలమాస అని పిలుస్తారు, ఇది అసలైన తెలుగు పదం. దీనినే సంస్కృతంలో పితృ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అంటారు. ఈ పెద్దలమాసను "పెత్తరమాస/పెత్రమాస" అని కూడా వ్యవహరిస్తారు. తెలంగాణ బతుకమ్మ పండగ మాదిరి ఈ పండగ కూడా తెలంగాణలో ఒక ప్రత్యేకతను చాటుకున్నది. తెలంగాణలో ఇది ప్రముఖ పండగ, అతి ప్రాచీణ పండగ. 

భాద్రపదమాసం బహుళ పాడ్యమి నుండి భాద్రపద అమావాస్య వరకు పితృపక్షాలుగా వ్యవహరిస్తారు. ఈ 15 రోజుల్లో తమకు వీలైన రోజున సాహిత్యాలు దానం చేస్తూ, భోజనాలు పెడుతూ చనిపోయిన తమ కుటుంబీకుల ఆత్మలకు శాంతిని చేకూరుస్తారు. ఎక్కడెక్కడ జీవనం సాగిస్తున్న కుటుంబీకులంతా ఒక దగ్గర చేరి ఉమ్మడిగానే దీన్ని నిర్వహిస్తారు. ఈ పితృపక్షాల సమయంలో తెలంగాణలో ఎలాంటి శుభ కార్యాలు  జరుపబడవు. 

15 రోజుల్లో చివరి రోజైన అమాస నాడు అందరూ ఒక పండగలా జరుపుకుంటారు అనగా అంతకుముందు పక్షం రోజుల్లో జరుపుకున్నవారు కూడా ఈ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు, ఈ అమావాస్యను  పెత్తరమాస అని వ్యవహిరిస్తారు.  పెత్తరమాస రోజు చనిపోయిన తమ కుటుంబ పెద్దలను పూజించి (ఇంట్లో ఫోటోలు వంటివి పెట్టి కొందరు పూజిస్తే, కొందరు సమాధుల దగ్గర వెళ్లి పూజిస్తారు) రకరకాల పిండివంటలు చేసి నైవేద్యాలు పెట్టి వారి ఆత్మలను తృప్తి పరుస్తారు. అంతేగాకుండా పెత్తరమాస రోజున వారి వారి ఆచారాన్ని బట్టి జంగములకు, బ్రాహ్మణులకు, అయ్యవార్లకు సాహిత్యం ఇస్తారు. మామూలుగా వారు అందరి ఇళ్ళలో భోజనం చేయరు కాబట్టి వారు వండుకుని తినే విధంగా తమ పితృదేవతల పేరుమీద సాహిత్యం దానం చేసి దక్షిణలు సమర్పించుకుంటారు. సాహిత్యం అంటే వండుకోవడానికి కావలసిన పదార్థాలు - బియ్యము, రకరకాల పప్పుదినుసులు, చింతపండు, చేమకూర (ఇది ఈ పండగనాడు ప్రత్యేకంగా వాడతారు), గుమ్మడి కాయ, ఉప్పు, నువ్వులు, పిండి, ఉల్లిగడ్డలు, ఆకు కూరలు, కాయగూరలు మొదలగునవి. 

ఈ పండగనాడు ప్రత్యేకంగా ప్రతి తెలంగాణ ఇంట్లో చేసేవి చిల్లు గారెలు. ఇవి కొన్ని రోజులవరకు పాడవవు కాబట్టి ఎక్కువ మొత్తంలో చేయటం. ఈ పండగ నుండి 9 రోజులపాటు జరిపే సద్దుల బతుకమ్మకు ఈ గారెలు ప్రధానంగా ఉండేవి.  రోజూ చేసే సద్దులతో బాటు ఈ గారెలు కట్టుకు పోయి బతుకమ్మలు ఆడి భోజనాలు చేసి రావటం చేసేవారు అమ్మాయిలు. ఈ 9 రోజుల్లో ఇళ్ళదగ్గర పెద్దవారు ఇంటిపనులన్నీ అయిపోయాక సాయంత్రాలు ఆడేవారు. చివరి రోజు పెద్ద బతుకమ్మను మాత్రం చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కలిసి ఆడటం జరుగుతుంది. "తింటే గారెలు తినాలి - వింటే భారతం వినాలి" అనే సామెత మాదిరిగా ఈ గారెల రుచి అమోఘం, పెరుగుతో ఎక్కువగా తింటారు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. పెద్దలమాస నాడు కాకుండా మిగతా రోజుల్లో ఎక్కువగా ఈ గారెలు వండేవారు కారు. ఒకవేళ చేసినా మద్యలో చిల్లులేకుండా చేస్తారు. 

మనకు జన్మనిచ్చిన తలిదండ్రులను, మన పూర్వీకులను స్మరించుకోవటం మన ధర్మం - ఈ ఉత్తమ ధర్మాన్ని తరతరాలనుండీ పెత్తరమాస పర్వంగా తెలంగాణ ప్రాంతంవారు ఆచరిస్తూ రావటం ఎంతో విశేషం. గత ప్రభుత్వాలు ఈ ప్రధానమైన తెలంగాణ పండగకు సెలవు ప్రకటించలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఈ పండగను తెలంగాణ ప్రధాన పండగగా గుర్తిస్తూ ప్రభుత్వ సెలవును ప్రకటిస్తే అందరూ పండగను ఘనంగా జరుపుకునే అవకాశం ఉంటుంది. దసరా సెలవులు 15 రోజులుగా ప్రకటించటం సంతోషకరమైన విషయం. మొదట్లో తెలంగాణ ప్రాంతంలో దసరాకే ఎక్కువ సెలవులు ఉండేవి. ఇలా ఎక్కువ రోజులు దసరా సెలవులు ఉండటం వలన బతుకమ్మ పండగను అందరూ జరుపుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 





9 comments:

  1. మీ అభిప్రాయం కరెక్టు కాదనుకుంటా. ఇది కేవలం తెలంగాణలో జరిపేది కాదు. భారతదేశమంతటా చేస్తారు. కోస్తా-సీమల్లో కూడా చేస్తారు. సరిగ్గా ఇవే వంటలు వండుతారు. వారు దీన్ని మహాలయ పక్షాలంటారు.

    ReplyDelete
    Replies
    1. వేరే ప్రాంతాల్లో చేయరు అని నేను ఎక్కడా చెప్పలేదే?. కొన్ని పండగలు భారతదేశం మొత్తం మీద జరుపబడినా రాష్ట్రాల వారీగా వేరువేరు పండగలు ప్రాదాన్యమౌతాయి. తెలంగాణలో ఇది అతి పెద్దపండగ, ప్రతి ఒక్కరు చేస్తారు. తెలంగాణలో ఈ పెద్దల అమాస పండగ జరిగినట్టు మరెక్కడా జరగదు. ఆంధ్రలోనే కాదు భారతదేశం మొత్తం మీద కొందరు చేసినా, తెలంగాణలో ఉన్న ప్రాముఖ్యత వేరు. తెలంగాణ ప్రాంతంలో ఈ పండగ చేయని హిందువులు ఉండరు. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడేది తెలుగు కాబట్టి ఈ పండగను తెలుగు పదాల్లో పెద్దల అమాస అనే వ్యవహరిస్తారు. మహాలయ అమావాస్య అని కాని మహాలయ పక్షం అని కాని సంస్కృత పదాలతో ఎవ్వరూ పిలవరు.

      Delete
  2. ఈ పండుగను ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా అందరూ జరిపేవారు. ప్రాంతాలకతీతంగా ఇప్పటికీ జరుపుకుంటారు...

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పే విషయం ఎంతవరకు నిజమో తెలియదు కాని, నేను ప్రత్యక్షంగా చాలా ఏళ్ల నుండి గమనించింది ఏమంటే ఆంధ్రప్రాంతం నుండి హైదరాబాదు వచ్చిన చాలా మంది ఈ పెత్తరమాస పండగ జరుపుకోరు, వారిని అడిగితే తమ ప్రాంతంలో ఈ పండగ జరుపుకోమని, తమ పెద్దలు చనిపోయిన రోజునే సంవత్సరికం లాంటివి చేసుకుంటామని, కొందరు మహాలయ పక్షం రోజుల్లో జరుపుకుంటారని, ప్రత్యేకంగా పెట్టరమాసను ఒక పండగలా చేసుకోరని చెప్పటం జరిగింది. రాయలసీమ ప్రాంతం వారు కొంతమంది జరుపుకుంటారు. అయినా ముందు వ్యాఖ్యలో చెప్పినట్టు ఒక్కో పండగ ఒక్కో ప్రాంతంలో ప్ర్యాదాన్యం కలిగి ఉంటుంది. ఉదాహరణకు సంక్రాంతి చాలా రాష్ట్రాల్లో జరుపుకున్నా దాని ప్రాధాన్యం ఆంధ్రా ప్రాంతంలోనే ఉంటుంది.

      Delete
    2. హిందూశాస్త్రాల ననుసరించి నిత్యశ్రాద్ధాలు చెయ్యనివారి కోసమే మహాలయ పక్షాలు. బహుశా తెలంగాణాలో నిత్యశ్రాద్ధాలు చెయ్యని జనాభా ఎక్కువగా ఉన్నట్లుంది.

      Delete
    3. మీరన్నదాంట్లో సత్యం ఉంది, అది అంగీకరించవలసిన విషయమే. ఆంద్రులు ఆర్యులు కావడం వలన ఆంద్ర ప్రాంతంలో ఆర్యసాంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ద్రవిడ సంప్రదాయాలు ఎక్కువగా కనిపిస్తాయి.

      Delete
    4. చూడండి YJs! ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఈ పండుగను ప్రాంతాలకతీతంగా జరిపినవారు ఇప్పుడెందుకు జరపడం లేదు? పోనీండి...ఆనాటి సాయంత్రం తెలంగాణాలోలాగా (ప్రాంతాలకతీతంగా) బతుకమ్మలాడేవారా?

      స్వామిగారూ! మీ వివరణతో నేనేకీభవించను. ఎందుకంటే, మహాలయామాస్య(ప్నితృ+అమావాస్య=పిత్రమావాస్య...దీనికి వికృతి పెత్రమాస) "పెత్రమాస" అని మన తెలంగాణులు పవిత్ర దినంగా భావిస్తారు. ది ఆంధా హ్యూమనిస్ట్‍గారు తెలంగాణలో నిత్యశ్రాద్ధాలు చెయ్యని జనాభా ఎక్కువగా ఉన్నట్టున్నదని ఎద్దేవా చేయడం హుందాతనమనిపించుకోదు. నిత్యశ్రాద్ధాలను తెలంగాణవారు పాటించినంతగా ఎవరూ పాటించరు. గతించిన తమ తల్లిదండ్రులకు నిత్యశ్రాద్ధాలు చేస్తూ, తాతముత్తాతలకు (పితృదేవతలకు) పితృశ్రాద్ధాలను పెత్రమాసనాడు భక్తిశ్రద్ధలతో చేయడం ప్రశంసాపాత్రం. ఇది తెలియని ది ఆంధ్రా హ్యూమనిస్ట్‍గారు వెక్కిరించడం క్రమించరాని విషయం.

      మరో అంశం...
      నిజానికి తెలంగాణులే ఆర్యులు (తెలంగాణులు ఆర్యసంప్రదాయాల్ని ఎక్కువగా పాటిస్తారు కాబట్టి)!
      ఆంధ్రులే ద్రావిడులు (ద్రవిడ సంప్రదాయాల్ని అనుసరిస్తూ...ఓనం, పొంగల్ వంటి పండుగల్ని ద్రవిడ సంప్రదాయంలో జరుపుకుంటారు కాబట్టి)!

      Delete
    5. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఈ పండుగను ప్రాంతాలకతీతంగా జరిపినవారు ఇప్పుడెందుకు జరపడం లేదు?
      >> మధుసూధన్ గారు, నేను 'పెద్దలమాస/పితృ అమావాస్య' గురించి రాశాను. నిజానికి పితృదేవతలను స్మరించుకోవడానికి మనకు ప్రత్యేక పండుగ అవసరం లేదు.

      పోనీండి...ఆనాటి సాయంత్రం తెలంగాణాలోలాగా (ప్రాంతాలకతీతంగా) బతుకమ్మలాడేవారా?
      >>బతుకమ్మ గురించి విజయనగరం జిల్లాలో పుట్టిన నాకెలా తెలీదో, విజయనగరం జిల్లాలో చేసే మల్లేలమ్మ అమ్మవారి పండగ గురించి, కన్యకా పరమేశ్వరి అమ్మవారి వుత్సవాల గురించి మిగతా రాష్ట్రమంతటా తెలీదు.

      అమ్మవారికి శతకోటి రూపాలు. అందులో ఒక రూపం బతుకమ్మ, బతుకునిచ్చే అమ్మ. మిగతా ప్రజలకు తెలీనంత మాత్రాన, బతుకునిచ్చే అమ్మవారి పండుగని జరుపుకోనంత మాత్రాన అమ్మవారి వైభవం తరిగిపోదు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో అమ్మవారు పూజలు అందుకుంటూనే వుంటారు.

      దయచేసి అమ్మవారిని ఒక ప్రాంతానికి కట్టడి చేయకండి.

      Delete