Thursday, 25 September 2014

ప్రాణాలపైకి తెస్తున్న సెల్ ఫోన్ ఫోటోల పిచ్చి


ఈ మద్యన చాలా ప్రమాదాలకు-సెల్ ఫోన్ కి లింక్ ఉండటం కొంచెం కలవరపరిచే విషయం. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ ప్రభావం నేటి యువత పైన విపరీతంగా కనిపిస్తుంది. మొన్న డిల్లీ జూ సంఘటన కావచ్చు, అంతకుముందు అయోధ్య నదిలో మునిగి పోయిన వారి సంఘటన కావచ్చు, దానికి ముందు నదిలో కొట్టుకుపోయిన 24 మంది విద్యార్థుల సంఘటన కావచ్చు ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి నిత్యం. 

సెల్ లో ఫోటోలు తీయటం పేస్ బుక్ లాంటి సోషల్ సైట్స్ లో పోస్ట్ చేయటం అందరితో షేర్ చేసుకోవటం అదో థ్రిల్ గా మారిపోయి తమను తాము మరచిపోతున్నారు నేటి యువత. ఇలాంటివే కావు ఏదైనా ఒక గుడికి వెళ్ళినా, ఫంక్షన్ లకి వెళ్ళినా, మీటింగ్ లకి వెళ్ళినా ఫోటోలు తీయడంలోనే మునిగిపోయి కనీసం వెళ్ళిన ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఫోన్ లలో ఇంటర్నెట్ సదుపాయం పెరగడంతో కొందరైతే చాటింగ్ లలో గంటలు గంటలు ఫోన్ తోనే గడిపేస్తూ తాము చదివే చదువులకే కాక కుటుంబంతో గడిపే ఆనందాన్ని కూడా కోల్పోతున్నారు. ఇంకా కొంతమందైతే ఎప్పుడూ చెవిలో ఇయర్ ఫోన్స్, చేతిలో సెల్ ఫోన్ తో అవి వారి ఆభరణభూషణాలు అన్నట్లుగా కనిపిస్తుంటారు. సెల్ ఫోన్ లో విడియో రికార్డింగ్ సదుపాయంతో కూడా అడ్డమైన దార్లు తొక్కుతూ విడియోలు తీస్తూ తమకు తామే బలవుతున్నారు. 

సరదా ఉండాలి కాని అదే జీవితం కాకూడదు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు సెల్ ఫోన్ వినియోగానికి కూడా ఒక హద్దనేది ఉండాలి. వాటి వాల్ల వచ్చే ఉపద్రవాలు వారికి చెప్పినా తలకెక్కే స్థితిలో లేరు నేటి యువత. భవిష్యత్తుకు ఆధారభూతాలైన ఈ యువత ఇలా నడిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది తలచుకుంటేనే భయమేస్తుంది. 

యువత అనే కాక కొంతమంది పెద్దలు కూడా సెల్ ఫోన్ ని దుర్వినియోగ పరుస్తూ చెడు అలవాట్లకు బానిసలవుతుండటం విచారించదగ్గ విషయం. ఈ సెల్ ఫోన్ దుర్వినియోగం కుటుంబాల్లోని ఆప్యాయతలను దూరం చేస్తున్నయంటే అతిశయోక్తి కాదు. 

సెల్ ఫోన్ లో ఉండే సదుపాయాలన్నీ మంచికొరకే పెట్టారు, అవి సక్రమంగా ఉపయోగించుకుంటేనే మంచిది. వినాశకాలే విపరీత బుద్ధి: అన్నట్లు సెల్ ఫోన్ ని దురుపయోగం చేస్తూ మితిమీరి గతిదప్పి ఉపయోగిస్తే అనర్థాలకే దారి తీస్తుంది. దానివల్ల నష్టపోయేది వారే. 



2 comments: