Friday, 12 September 2014

కాళోజీ జన్మదినమే తెలంగాణ భాషా దినోత్సవం

కాళోజీ జన్మదినమే తెలంగాణ భాషా దినోత్సవంప్రజాకవి కాళోజి నారాయణరావు గారికే కాక తెలంగాణభాషకూ  లభించిన గౌరవం ఇది. ఇన్నాళ్ళు నిరాదరణకు గురైన తెలంగాణ భాష సంస్కృతి, సంప్రదాయాలకు కెసిఆర్ ప్రభుత్వం సముచితమైన గౌరవాన్ని ఇస్తున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బతుకమ్మ, బోనాలు పండగలను తెలంగాణ రాష్ట్ర పండగలుగా ఇంతకుముందే ప్రకటించారు. ఇప్పుడు 9 సెప్టెంబర్ ను తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రతి ఏటా ఆ నాడు ఉత్సవాలు, కార్యక్రమాలు జరుపుకోవాలని ప్రకటించారు. మన తెలంగాణ, భాషా సంస్కృతులకు గౌరవమిచ్చి పునరుజ్జీవింప జేస్తానని కెసిఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఇందుకు ధన్యవాదాలు. 

నిజానికి తెలంగాణ భాష అంటే అచ్చ తెలుగు భాష. ఈ ప్రజా భాషను సోమనాది తెలంగాణ కవులెందరో తమ గ్రంధాల్లో విరివిగా వాడి ప్రజలకు చేరువయ్యారు. కాలగమనంలో నిజాం రాజుల పరిపాలనలో కొన్ని ఉర్దూ పదాలు వ్యవహారికంలో కలసిపోయినా ఇప్పటికీ తెలంగాణ పల్లెటూళ్ళలో అచ్చ తెలుగుభాష సజీవంగానే ఉంది. ఆ భాషను ఇది తెలంగాణభాష అని వెటకారం చేసే వాళ్ళూ ఉన్నారు - కాని వారికి తెలియదు ఆ తెలంగాణ భాషే అసలైన తెలుగుభాష అని, ఆ భాషలోనే నూటికి 90% తెలుగు పదాలు నిక్షిప్తమై ఉన్నాయని. వెటకారం చేసే వారిని చూచి జాలిపడడం తప్ప మనం చేసేదేమీ లేదు. 

రాబోయే రోజుల్లో తెలంగాణభాషకు జీవంపోసే రచయితలు, కళాకారులను అలాగే తెలంగాణభాషకు సముచిత స్థానమిచ్చే సినిమాలు, సీరియళ్ళు, సినిమా, టీవీ కళాకారులకు ప్రతి సంవత్సరం తెలంగాణ భాషా దినోత్సవాన అవార్డులిచ్చి, సత్కరించి ప్రోత్సాహకాలు అందజేస్తే బాగుంటుంది. No comments:

Post a Comment