సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 4
గమనిక:
ఈ నీతి శ్లోకాలు ప్రాచీన కాలం నుండీ ప్రచారంలో ఉన్నవి. ఏ శ్లోకాలు ఎవరు చెప్పారో తెలియదు, అంతే కాక చాలా పాఠాంతరాలు కనిపిస్తాయి, శ్లోకార్థం ఒకటిగానే ఉన్నా పదాలలో తేడా కనిపిస్తుంది. కొన్నిశ్లోకాలు చాణక్య నీతి శాస్త్రంలోనూ కనిపిస్తాయి.
అతి సర్వత్ర వర్జయేత్
శ్లోకం:
అతిరూపేణ వై సీతా, అతి గర్వేన రావణః !
అతిదానం బలిర్దత్వా, అతి సర్వత్ర వర్జయేత్ !!
తాత్పర్యం:
అతిసౌందర్యము వలన సీత అపహరింపబడెను, అతిగర్వము వలన రావణుడు అంతమొందెను. అతిగా దానముచేయుటవలన బలి బంధనుడాయెను. ఈ అతి అనేది అంతటనూ విసర్జించతగినది అని అర్థం.
సర్వాంగం దుర్జనేన విషం
శ్లోకం:
వృశ్చికస్య విషంపుచ్చం మక్షికస్య విషంశిరః !
తక్షకస్య విషందంష్ట్రాస్సర్వాంగం దుర్జనే విషం !!
తాత్పర్యం:
తేలుకు తోకలోను, ఈగకు తలలోను, నాగుపాముకు కోరల్లోను విషముంటుంది, అయితే దుర్జనులకు మాత్రం నిలువెల్లా విషమే ఉంటుంది.
(ఇదే శ్లోకం కొంచెం తేడాతో కొన్నిచోట్ల ఇలా కనిపిస్తుంది)
శ్లోకం:
తక్షకస్య విషం దంతే, మక్షికాయాస్తు మస్తకే !
వృశ్చికస్య విషం పుచ్చే, సర్వాంగే దుర్జనే విషం !!
తాత్పర్యం:
పాముకు కోరల్లో విషం, ఈగకు తలలోన (మక్షికాయా ముఖే విషం-ఈగకు ముఖంలో విషం అని కూడా కొన్నిచోట్ల కనిపిస్తుంది), తేలుకు తోకలో విషం ఉంటే దుర్జనునికి అన్ని అంగాలలో విషం ఉంటుంది.
స్త్రీవిత్త మధమాధమమ్
శ్లోకం:
ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం !
అధమం భ్రాత్రువిత్తంచ స్త్రీవిత్త మధమాధమమ్ !!
తాత్పర్యం:
తను సంపాదించిన ధనం ఖర్చుపెట్టడం ఉత్తమం, తండ్రి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయడం మధ్యమం, తోబుట్టు ధనాన్ని ఖర్చుచేయడం అధమము. ఇక స్త్రీలకు సంబందించిన ధనాన్ని (పుట్టినింటి వారు ఇచ్చినధనం కావచ్చు లేదా తను సంపాదించిన ధనం కావచ్చు) తీసుకుని ఖర్చు చేయటం అన్నిటికంటే అధమాతి అధమం అంటే స్త్రీలకు సంబందించిన ధనం వారికే చెందజేయాలని అర్థం.
మరో రకంగా చెప్పుకోవాలంటే వీటిని ప్రాదాన్యతాక్రమంగా చెప్పుకొని గత్యంతరం లేని పరిస్థితిలో తప్ప ఆడవారికి సంబందించిన ధనాన్ని ముట్టుకోవద్దని భావం.
ఉత్తమం మాతృవందనే
శ్లోకం:
భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేనచ !
సేతుస్నానశతైర్యచ్చతత్ఫలం మాతృవందనే !!
తాత్పర్యము:
ఆరునెలలు భూప్రదక్షిణ, పదివేల సార్లు కాశీలో గంగాస్నానం చేసినా, ఎన్నో వందవేల సార్లు సముద్ర స్నానం చేసినా కలగనట్టి ఫలం, కేవలం తల్లికి ఒకమారు నమస్కారం చేయటంతోనే కలుగుతుందని అర్థం.
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి
శ్లోకం:
జిహ్వాగ్రే వర్తతేలక్ష్మీ , జిహ్వాగ్రే మిత్రబాంధవాః !
జిహ్వాగ్రే బంధనప్రాప్తి, జిహ్వాగ్రే మరణంధృవం !!
తాత్పర్యము:
నాలుక వలన (అనగా మన మాటలచే) సంపద కలుగును, నాలుకవలన చుట్టాలు, స్నేహితులు కలుగుదురు, నాలుకవలన సంకెళ్ళు (జైలు జీవనం) కలుగును, నాలుకవలన చావునూ కలుగును అని అర్థం.
మాట ముఖ్యం. చాలా బాగున్నాయి. మీకు ధన్యవాదాలు.
ReplyDeleteధన్యవాదాలు
Deleteవందనం
ReplyDelete