Monday, 15 September 2014

తెలంగాణా తేజం - వైద్య రత్నాకర అగ్గలయ్య

Telangana Tejam - Vaidyaratnakara Aggalayya


ఈ అగ్గలయ్య క్రీ.శ. 1000 ప్రాంతానికి చెందినవాడు. ఇతనికి సంబందించిన విశేషాలు నల్గొండజిల్లా భువనగిరి తాలుకాలోని సైదాపురం గ్రామంలోని ఒక పొలంలో 1979 లో బయల్పడిన శాసనం ద్వారా తెలుస్తున్నాయి. అగ్గలయ్య చాళుక్య ప్రభువు రెండవ జయసింహుని ఆస్థాన వైద్యుడు. వైద్య శాస్త్రంలో దిట్ట, ఎవరూ నయంచేయలేకపోయిన ఎన్నో మొండి రోగాలను నయం చేసిన గొప్ప వైద్యుడు. శస్త్రచికిత్సలో ప్రసిద్దుడు. ఈ అగ్గలయ్య "శాస్త్రాశాస్త్ర కుశల",  "వైద్యరత్నాకర" అనే బిరుదులతో పాటు "ప్రాణాచార్య", "నరవైద్య" గా ఆ కాలంలో వైద్య రంగంలో ప్రముఖ వైద్యునిగా ప్రసిద్దినొందినట్లు ఈ శాసనం తెలియపరుస్తుంది. 

రెండవ జయసింహుడు జైనమతాభిమాని అతను 4 జూన్ 1034 న పొట్లకెరె (నేటి పఠాన్ చెరువు-ప్రసిద్ద జైన కేంద్రము, ఆనాడు ప్రసిద్ద పట్టణము) లో విడిది చేసి ఉన్నపుడు అగ్గలయ్యకు ఈ శాసనం రాయించబడినది. అంతేగాక దీనివలన జయసింహుడు (జదేకమల్లునిగా కూడా ప్రసిద్దుడు, ఈ శాసనంలో అదేపేరు ప్రస్తావించబడింది) పఠాన్ చెరువుకు అధిపతిగా తెలుస్తుంది. బసవపురాణంలోనూ పఠాన్ చెరువు రాజధానిగా చాళుక్య రాజు పరిపాలించినట్లు, ఇది జైనుల ముఖ్య కేంద్రంగా చెప్పబడింది.   అగ్గలయ్య జైనుడు, అతని ఆద్వర్యంలో నడపబడుతున్న   జైనదేవాలయాలకు రాజుని భూదానం కోరగా రాజు భూదానాలు చేసినట్టు తెలుస్తుంది. ఆ జైనాలయాలు నల్గొండ జిల్లా ఆలేరు తాలుకాలోని ఇక్కుర్తి గ్రామము, మరియు ముచ్చనపల్లి (ఇది కొలనుపాక దగ్గర పరిసర ప్రాంతంలో ఉండి ఉంటుంది).  

వైద్యరత్నాకర అగ్గలయ్య గురించి సాహిత్యంలో ఎక్కడైనా ప్రస్తావించబడి ఉందేమో పరిశీలించవలసిన అంశం. ఒక వైద్యుని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ బయల్పడిన శాసనం ఇదే కావడం విశేషం కూడా. అగ్గలయ్య మహావైద్యుడు అవటం వల్లనే శాసనాల్లో ప్రస్తావించబడ గలిగినాడు అనుటలో సందేహం లేదు. ఈయనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియకపోయినా ఈయన అద్వర్యంలో నడచిన జినాలయాలు, వైద్యసేవలు, భూములు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవే. అగ్గలయ్య శస్త్రచికిత్సలో గొప్ప వైద్యుడుగా చెప్పబడటం వలన, ఎందరికో ఎన్నో రోగాలను రూపుమాపినాడని చెప్పటంవల్ల ఆ కాలానికే తెలంగాణ ప్రాంతంలో శస్త్ర చికిత్స కూడా ప్రముఖంగా అందుబాటులో ఉందని తెలుస్తుంది. అతని వైద్య కౌశల్యం గురించి ఈ శాసనంలో బాగా వివవిరించటం జరిగింది. ఎవ్వరూ నయం చేయలేకపోయిన రోగాలను కూడా ఇతను నయం చేశాడని, అంతేగాక ఈయన ఆయుర్వేదాన్ని, శస్త్రచికిత్సను కలిపి ప్రయోగించి రోగాలను నయం చేసినట్లు తెలుపబడింది. 

మరుగునపడివేయబడ్డ ఈ గొప్ప తెలంగాణ వైద్యుని గూర్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెలుగులోకి తేవడం ఎంతైనా అవసరం. 





No comments:

Post a Comment