Tuesday, 2 September 2014

సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 2

సుప్రసిద్ద వాక్యాలు - పూర్తి శ్లోకార్థాలు - 2




పరహస్తం గతంగత: 

శ్లోకం:
పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గత: !
అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ ఖండశః !!

తాత్పర్యము:
పుస్తకము, స్త్రీ, ధనము వేరొకరి చేతికి వెళ్ళినచో తిరిగిరావు. ఒకవేళ తిరిగివచ్చినా పుస్తకం అయితే చిరిగిపోయి, స్త్రీ అయితే చెడిపోయి, ధనమైతే కొంచెం కొంచెంగా వచ్చును. 



పాపీ చిరాయు


శ్లోకం:
దాతా దరిద్రః, కృపణొ ధనాడ్య: , పాపీ చిరాయు, స్సుకృతీ గతాయు: !
రాజాకులీన, స్సుకులీ న సేవ్యః , కలౌయుగే షడ్గుణమాశ్రయంతి !! 

తాత్పర్యము:
దానాలు చేయువాడు దరిద్రుడగుట, లోభి (పిసినారి) ధనవంతుడగుట, పాపాలు చేయువాడు ఎక్కువకాలం జీవించుట, పుణ్యాత్ముడు కొంతకాలమే జీవించుట, కులహీనుడు రాజగుట(అధికారి-ప్రభువు),  కులశ్రేష్ఠుడు సేవకుడగుట (కూలీ-చిరుద్యోగి) ఈ ఆరు గుణాలు ఈ కలియుగమందు కలుగుచుండును. 


పుత్రంమిత్ర వదాచరేత్

శ్లోకం:
రాజావత్పంచవర్షాణి, దశవర్షాణి దాసవాత్ ! 
ప్రాప్తే షోడశవర్షేతు, పుత్రం మిత్రవదాచరేత్ !!

తాత్పర్యం:
కొడుకును (చిన్నవారిని)  5 సంవత్సరాలవరకు రాజువలే, 5-10 సంవత్సరాలవరకు సేవకునివలే, 16 వ సంవత్సరం నుండి స్నేహితునిగా చూడవలెను. 


కార్యేషు దాసీ 

శ్లోకం:
కార్యేషు దాసీ కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రీ !
స్నేహేచ మాతా శయనే తు వేశ్యా, షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!!


తాత్పర్యం:
ఇంటి పనులయందు దాసివలే, పనుల ఆలోచనలో మంత్రిలా, రూపమందు లక్ష్మివలే (రూపంలో లక్ష్మి అంటే లక్ష్మిదేవిలా అందంగా అని కాక లక్ష్మీకళ ఉట్టిపడేలా శుభ్రతాలంకారంతో), ఓర్పులో భూదేవిలా,  చనువు-స్నేహంలో తల్లిలా, పడకయందు వేశ్యలా (స్నేహేచ మాతా శయనేతు వేశ్యా బదులుగా భోజ్యేషు మాతా, శయనేషు రంభ అనే వాక్యం కూడా వినిపిస్తుంది - భోజనం దగ్గర తల్లిలా, పడకయందు రంభలా అని ఈ వాక్యార్థం) ఈ ఆరు రూపాలలో ప్రవర్తించునదే కులధర్మస్త్రీ.  



బాలాదపి సుభాషితం

శ్లోకం:
విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం !
అమిత్రాదపి సద్వృత్త, మమేధ్యాదపి కాంచనం !! 

తాత్పర్యం:
విషమున అమృతమును గ్రహింపవలె, బాలునిలో మంచిమాటలు, శత్రువుయందు మంచి స్వభావమును (రాముడు రావణుని దగ్గర గ్రహించినట్లు), అమేధ్యము (విసర్జనము-అశుద్దము) నుండి బంగారమును గ్రహించవలెను. అనగా ఎంతటి చెడులోనైనా మంచి అనేది దాగి ఉంటుందని దానికొరకే  మనం వెతకాలని అర్థం.  


   


9 comments:

  1. మంచి శ్లోకాలు ప్రస్తావిస్తున్నారు. అభినందనలు.

    శ్లోకంపాఠంలో పొరపాట్లున్నాయి.
    పుస్తకం వనితా విత్తం పరహస్తం గతంగతం !
    అథవా పునరాయతీ జీర్ణంచ భ్రష్ట ఖండః !!

    అసలు పాఠం

    పుస్తకం వనితా విత్తం పరహస్త గతంగతః
    అథవా పునరాయాతు జీర్ణా భ్రష్టాచ స్వల్పశః

    అని.
    సరిజేసుకొనగలరు. ఇక్కడ స్వల్పశః అన్నదానికి ఖండశః అన్నపాఠాంతరం ఉంటే ఉండవచ్చును.

    ReplyDelete
    Replies
    1. దొరలిన తప్పుకు క్షంతవ్యుడను - సరిదిద్దటం జరిగింది.

      Delete
    2. స్వామిగారూ, మరొక్కసారి సరిజూచుకోవలసినదిగా విజ్ఞప్తి. నాకు మీ ఈ‌ టపాలో సరిదిద్దిన పాఠం కనిపించటం లేదండీ.

      Delete
    3. నిజానికి వీటికి సంబంధించి నా దగ్గర ఒక రాత ప్రతి, మరొకటి జీర్ణమై పోయిన 1908 కాలం నాటి పుస్తకం ఉంది. (ఈ శ్లోకంలోనే చెప్పినట్టు పరుల చేతులబడి చాలా జీర్ణమైంది). రాత ప్రతిలో ఉన్నట్టు పెట్టాను-నిజానికి నాకు కంఠపాఠం ఉన్నది అదే కూడా , సరి చూడటానికి ఇంకో ప్రతి దొరకలేదు. ప్రస్తుతం మీరు చెప్పినట్టు మార్చడం జరిగింది.

      Delete
    4. స్వామిగారూ. మార్చినందుకు సంతోషం. ఇకపోతే మీ‌ శంక గురించి. "పరహస్తం గతంగత:" అంటే వేరేవాడి చేయి పోతే పోయినట్లే అని అర్థం వస్తుంది. "పరహస్తగతంగత:" (మధ్యవిరామం ఉండదు) అంటే ఇతరుల చేతిలోకి పోతే పోయినట్లే అని అర్థం వస్తుంది.

      Delete
  2. మిత్రులు స్వామిగారికి నమస్కారములు.

    మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. అభినందనలు.

    మీరు ప్రచురించిన శ్లోకాలలో కొన్ని చిన్నచిన్న దోషాలున్నాయి. సవరింపగలరు.

    సరియైన శ్లోకాలు:
    పుస్తకం వనితా విత్తం పరహస్తగతం గత: !
    అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టాచ ఖండశః !!


    దాతా దరిద్రః, కృపణో ధనాడ్య:, పాపీ చిరాయు, స్సుకృతీ గతాయు:!
    రాజాఽకులీన, స్సుకులీ న సేవ్యః , కలౌయుగే షడ్గుణమాశ్రయంతి !!
    (మూడవపాదంలో "సుకులీ చ భృత్యః" అనే పాఠాంతరం కూడా ఉన్నది)

    రాజవత్పంచవర్షాణి, దశవర్షాణి దాసవత్ !
    ప్రాప్తే షోడశవర్షేతు, పుత్రం మిత్రవదాచరేత్ !!
    (మూడవపాదంలో "ప్రాప్తే తు షోడశే వర్షే" అనే పాఠాంతరం కూడా ఉన్నది)

    కార్యేషు దాసీ కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రీ !
    స్నేహేచ మాతా శయనే తు వేశ్యా, షట్కర్మయుక్తా కులధర్మపత్నీ!!
    (మీరన్నట్లుగా మూడవపాదంలో "భోజ్యేషు మాతా శయనే తు రంభా" అనే పాఠాంతరం కూడా ఉన్నది)

    విషాద ప్యమృతం గ్రాహ్యం, బాలాదపి సుభాషితం !
    అమిత్రాదపి సద్వృత్త, మమేధ్యాదపి కాంచనం !!

    మీ కృషికి జోహారులు. స్వల్ప దోషములు లెక్కకురావు. అయినను సవరించగలరు. అన్యథా భావింపవలదని మనవి.
    నమస్కారములతో....

    ReplyDelete
    Replies
    1. నమస్కారములు
      దోషాలు సరిచూపినందులకు ధన్యవాదములు, మీరు చెప్పిన సవరణలు సరిచేయడం జరిగిందని మనవి. మీరు వీలు చేసుకుని నా బ్లాగును పరిశీలించినందుకు కృతజ్ఞతలు.

      Delete
    2. మిత్రులు మల్లికార్జునస్వామిగారికి,
      తమరు మరోలా భావింపక మఱొక్కమారు నేను సవరించిన శ్లోకములను, తమ రెండవ శ్లోకమునుండిగల ప్రతి పాదమును పరిశీలించగలరు. కొన్ని సవరణలు మిగిలియేయున్నవి. గమనించగలరు. స్వస్తి.

      Delete
    3. మార్చాను, ఇంకా ఎక్కడైనా దోషాలు ఉంటే తెలియజేయగలరు, ధన్యవాదములు

      Delete