Monday 1 September 2014

వీరశైవం మూలస్థానం తెలంగాణ-2

వీరశైవం మూలస్థానం తెలంగాణ-2



                                 రేణుకాచార్యులు కొలనుపాకలో ఉద్భవించారని తెలిపే ఆధారాలు  


వీరశైవమతమందు పూర్వకాలమున ఆచార్యులు/మఠాదిపతులు, ఆచార్యత్వం/మఠాధిపత్యం వహించిన పిదప తమ మాతాపితల వివరాలు లాంటివి చెప్పుకునేవారు కాదు, వాటి గురించి ఎవరూ అడిగేవారు కూడా కాదు. వీరిని లింగోద్భవులు అనే చెప్పేవారు, అలాగే చనిపోయినప్పుడు లింగైక్యులు అనే చెప్పేవారు (ఇప్పటికీ ఎవరైనా చనిపోతే లింగైక్యం చెందారనే మాటనే వీరశైవులు వాడతారు.  అంతేగాక చాలా గ్రామాల్లోని మఠాలకు సంబందిచిన పూర్వ పీఠాధిపతుల జనన విషయాలు ప్రస్తుతం ఉన్నవారికి తెలియకుండా ఉన్నది సత్యం).  అందుకే చాలామంది ఆచార్యులు/మఠాదిపతుల వివరాలు తెలియకుండా పోయాయి.   


రేణుకాచార్యుల వారు పంచాచార్యులలో ఒకురుగా ప్రసిద్దులు (నేటికి ఇంటర్నెట్ ప్రపంచంలో లభ్యంగా ఉన్న ఇందుకు సంబందించిన విషయాల లింక్ లను క్రింది తెలుపుతున్నాను)

1. http://www.shaivam.org/virashaivam/adv_panca.htm
2. http://en.wikipedia.org/wiki/Panchacharyas
3. http://panchapeeth.com/sri-rambhapuri-peeth.html
4. http://rambhapuripeetha.info/rich-lineage.htm
5. http://www.shrisiddhanthashikhamani.com/kannada/27-history-of-veerashaiva-shri-siddhanthashikhamani
6. http://www.divinebrahmanda.com/2012/03/rambhapuri-peeta-balehonnur-rambhapuri.html
7. http://www.muttinakantimathgurupeetha.com/index.php/history
8. http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B1%8A%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%E0%B0%AA%E0%B0%BE%E0%B0%95

అలాగే ద్వాదశ ఆరాధ్యులలో ఒకరుగా కూడా రేణుకాచార్యులు ప్రసిద్దులు:
1. http://www.shaivam.org/ad-dwadasa-aradhyas.htm
2. http://www.sroutasaivasiddhanta.com/dwadasaradhyas.htm
3. http://www.srisaivamahapeetham.org/phylosophy.htm

రేణుకాచార్యుల వారు నల్గొండ జిల్లా కొలనుపాకలోని సోమేశ్వర లింగోద్భవులని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని సిద్దంతశిఖామనిలోని 4వ పటలములోని శ్లోకాలు వివరిస్తాయి. 

అథ త్రిలింగ విషయే కొల్లిపాక్యభిధేపురే !
సోమేశ్వరమహాలింగాత్ ప్రాదురాసీత్ స రేణుకః !! (4-1)
ప్రదుర్భూతం తమాలోక్య శివలింగాత్ త్రిలింగజా: !
విస్మితాః ప్రాణినః సర్వే  బభూవురతి తేజసమ్ !! (4-2)

మరియు రేణుకాచార్యులు కొలనుపాక సోమేశ్వర లింగమునుండి ఉద్భవించారని స్వయంభువాగమం 9వ పటలం లో చెప్పబడింది.  ఈ 9వ పటలంలో మొత్తం అయిదుగురు పంచాచార్యుల గురించి వివరంగా తెలుపబడి ఉంది.  

శ్రీమద్రేవణ సిద్దస్య కొలిపాక పురోత్తమే!
సోమేశ్వర లింగ జనన మావాసః కదళీపురే !!  (స్వయంభువాగమం, చాప్టర్-9)

రేణుకాచార్యులు కొలనుపాక లింగోద్భవులని తెలిపిన కొన్ని గ్రంధాలు - రచయితలు (ఈ వివరాలు శివశ్రీ రవికోటి మఠం వీరభద్రయ్య గారు రచించిన "శ్రీక్షేత్ర కొలనుపాక వీరశైవ విభూతి రేవణసిద్దుడు" నుండి గ్రహించబడినవి):
రేణుకావిజయం  (ప్రథమ మంజరి-27,37 శ్లోకాలు) - సిద్దనాథ శివాచార్య - సంస్కృతం  
రేవణ సిద్దేశ్వర పురాణము - (సంధి 2, పద్యము-53) - బొమ్మరస - కన్నడము 
రేవణ సాంగత్య - (సంధి-2 పద్య-21) - చన్నబసవ  - కన్నడము
రేవణ సిద్దేశ్వర రగళె (నిరత స్థలం -57 వ పంక్తి) - మహాకవి హరీశ్వర  - కన్నడము
కవికర్ణ రసాయనం (ప్రథప సర్గ-శ్లోకం-6) - మహాకవి షడక్షర దేవ  - కన్నడము
రేణుక విజయము - (ప్రథమాశ్వాసం-పద్యము-49) - సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి - తెలుగు 
పంచబ్రహ్మొదయ భాష్యం (పుట-17) - సోసల చిక్క వీరనాధ్య  - కన్నడము
శివాధిక్య శిఖామణి (ప్రథమోపదేశమ్ - పుట-2) - సోసల రేవణారాధ్య  - కన్నడము

కాగా వీరశైవంలో ఆది రేణుకుల పిదప ఎంతోమంది రేణుక పేరున ప్రసిద్దినొందుటచే వీరశైవ సాహిత్యంలో ఎవరు ఎవరేనేది కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అయినా ఆది రేణుకులు నల్లగొండ జిల్లాలోని కొలనుపాక లింగోద్భవులనేది అందరి సమ్మతమే. దేశ సంచారం సాగించి ధర్మ ప్రచారాన్ని ముగించిన పిదప రేణుకాచార్యుల వారు కొలనుపాక సోమేశ్వర లింగములోనే ఐక్యమొందటం జరిగింది. 


సిద్దాంత శిఖామణి వీరశైవుల పరమ ప్రామాణిక గ్రంధం (ధర్మ గ్రంధం)

సిద్దాంత శిఖామణి గ్రంధం శక్తివిశిష్టాద్వైత (వీరశైవ) సిద్దాంతాన్ని ప్రభోదిస్తుంది. ఈ గ్రంధంలో చెప్పబడిన అష్టావరణ, షట్ స్థల, పంచాచార సిద్దాంతాన్ని నేటికీ ఎంతోమంది తమ సంప్రాదాయంలో ఆచరిస్తున్నారు. ఈ గ్రంధ సిద్దాంతాన్ని పాటించేవారు భారతదేశంలో చాలాచోట్ల పలు సంప్రదాయికులుగా కనబడతారు. లింగధారణ, లింగారాదనే వీరికి ప్రాముఖ్యం.  

ప్రముఖంగా:
ఆరాధ్యులు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో బహుళంగా ఉన్నారు)
వీరశైవ జంగములు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో  బహుళంగా ఉన్నారు)
లింగాయతులు (కర్ణాటక, మహారాష్ట్రలలో బహుళంగా కలరు)

సిద్దాంతశిఖామణి  గ్రంథాన్ని తెలుగులిపిలో శ్రీశైల జగద్గురుపీఠం వారు ప్రచురించారు. అలాగే శ్రీ S.P.బాలసుబ్రహ్మణ్యం గారి స్వరంలో ఆడియో కేసెట్ రూపంలో కూడా తెలుగులో తీసుకువచ్చారు శ్రీశైల జగద్గురువులు. 

తెనాలి సాధనా గ్రంథమండలి వారు మంచి తెలుగు వివరణతో 1960లో  ప్రచురించటం జరిగింది. 

శ్రీ కాశీ జగద్గురు పీఠం వారు తెలుగు వివరణతో 2012లో ప్రచురించటం జరిగింది. ఈ గ్రంధమే తెలుగులో ఇప్పుడు లభ్యంగా ఉన్న గ్రంధం. 


సిద్దాంతశిఖామణి గ్రంధానికి సంబందించిన కొన్ని  లింక్స్ :
1. http://www.shrisiddhanthashikhamani.com/
2. http://en.wikipedia.org/wiki/Siddhanta_Shikhamani
3. http://www.shaivam.org/gallery/audio/kan-par-css-siddhanta-shikhamani.htm
4. http://siddhantashikhamani.blogspot.in/2011/02/siddhanta-shikhamani.html
5. http://www.kamakotimandali.com/blog/index.php?p=406&more=1&c=1&tb=1&pb=1

సిద్దాంతశిఖామణి గ్రంధకాలం ఖచ్చితంగా తెలియలేకున్నది. అయితే సిద్దాంతశిఖామణిని తన శ్రీకర భాష్యములో ప్రస్తుతించిన శ్రీపతి పండితుడు క్రీ.శ.960 ల ప్రాంతం వాడని తెలియబడుతున్నందున అంతకు మునుపుననే సిద్దాంతశిఖామణి రాయబడిందని, రేణుకులు కూడా అంతకు పూర్వులే అని తెలియవస్తుంది.

శ్రీకరభాష్య కర్త అయిన శ్రీపతి పండితుడు క్రీ.శ.900 ప్రాంతం వాడని, క్రీ.శ.980 ప్రాంతానికి చెందిన "కుసుమాంజలి" గ్రంధంలో ఉదయనుడు శ్రీపతి పండితుని విమర్శించటం జరిగిందని  డా.సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమ "ఇండియన్ ఫిలాసఫీ" అనే గ్రంథంలో తెలిపారు.

శ్రీ నిడదవోలు వెంకటరావు గారు తమ "తెలుగు కవుల చరిత్ర" లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 930 ప్రాంతం వాడని తెలిపారు. 

శ్రీకరభాష్యం ప్రచురిస్తూ శ్రీ పండిత చిదిరేమఠం వీరభద్రశర్మ గారు శ్రీపతి పండితుడు 1072 ప్రాంతపు వాడని బెజవాడ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలోని శిలాశాసనం ఆధారంగా ప్రకటించారు.

తెనాలి సాధనా గ్రంధ మండలి వారు 1960 ప్రాంతంలో ప్రచురించిన సిద్దాంతశిఖామణిలో (తెలుగు అనువాదం) ప్రచురించిన శ్రీ పండిత కాశీనాథుని మున్నుడిలో క్రీ.శ.1061 ప్రాంతంలోని పలు గ్రంధాలలో (శ్రీకరభాష్యం సహా) సిద్దాంతశిఖామణి ప్రస్తావించబడిందని రాయబడింది.  

శ్రీశైల సూర్యసింహాసన మఠం వారు (పంచాచార్య జగద్గురు పీఠం)  ప్రచురించిన సిద్దాంతశిఖామని (తెలుగులో మూల శ్లోకాలు ప్రచురించారు) లో శ్రీపతి పండితుడు క్రీ.శ. 1000 ప్రాంతం వాడని తెలిపారు. 

సిద్దాంత శిఖామణి గ్రంధకాలం ఏదైనా ఈ గ్రంధం పండితులందరిచేత పరమోత్తమమైన జ్ఞానగ్రంధంగా కొనియాడబడింది. రచయిత శివయోగి శివాచార్యులు తన తండ్రి సిద్దనాథుడని, తాత ముద్దదేవుడని, తాత తండ్రిగారు శివయోగి అని తెలుపుట జరిగింది, కాని జన్మ ప్రదేశం గూర్చి తెలుపలేదు. చరిత్రకారులు కూడా వెలుగుపరచలేక పోయారు - నిజానికి ఈ విషయంలో కృషి చేసినవారు ఉన్నట్టు కూడా తెలియటం లేదు. కాగా  కొందరు వీరు కొలనుపాకకు చెందినవాడే  అని విశ్వసిస్తారు. 

కొలనుపాకలో అన్ని కులాల వారికీ రేణుకుల వారు మఠాలు కట్టించి దీక్షా సంస్కారాలు ఇవ్వటం జరిగింది. అవి నేడు చాలా వరకు కనుమరుగైపోగా కొన్ని మఠాలు మాత్రం శిథిలావస్థలో ఉన్నవి. వాటి వివరాలు శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య మహాస్వాముల వారి "వీరశైవము" (1966) నుండి - పేజీ-8:
1. పెద్ద మఠము 2. కురుమ మఠము 3. కాపు మఠము 4. కోమటి మఠము 5. గౌండ్ల మఠము 6. చాకలి మఠము 7. మంగలి మఠము 8. పద్మశాలి మఠము 9. మేదరి మఠము 10. పెరుక మఠము 11. మాల మఠము 12. మీమ్మాఱు మఠము (వడ్రంగి, కంచరి, కమ్మరి, శిల్పి) 13. గొల్ల మఠము 14. ఒడ్డెర మఠము  (దీనిని నక్క రామేశుని గుడి అనీ అంటారు) 15. సంగరి మఠము 16. తెనుగు మఠము 17. మేరె మఠము 18. గాండ్ల మఠము. 

సోమేశ్వర క్షేత్ర ఆలయ ఆవరణలో  కాకతీయ రుద్రమదేవి శిలా విగ్రహం ఉందని, ఇక్కడ రేణుకుల సంస్కరణల ప్రభావం నేటికీ ఉందని, అన్ని కులాలవారు పుట్టినపుడే లింగాలు ధరిస్తారని, ఈ ఊరిలో లింగవంతులైన మాలవాండ్లు మిగతా గ్రామాలలో మాదిరి ఊరి వెలుపల కాక ఊరు మధ్యలోనే నివసిస్తున్నారని శ్రీ ఉజ్జయిని జగద్గురువులు శ్రీ తరుళబాళు శివకుమార ఆచార్యులు తమ 1-జనవరి-1962 నాటి కొలనుపాక క్షేత్ర పర్యటన వివవరాలను 19-4-1963 (సంచిక-37) నాటి నవసందేశ కన్నడ పత్రికలో వివరించారు. 

చారిత్రకంగానే కాక సంస్కరణల పరంగానూ ఈ కొలనుపాక తన ఔన్నత్యాన్ని చాటుకుంది. కొలనుపాకతో (కొల్యపాక) బాటు తెలంగాణా ప్రాంతంలోని పఠాంచెరువు (పొట్లచెఱువు), జోగిపేటలు ఆనాడు జైనులకు, వీరశైవులకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నట్లు చారిత్రిక ఆధారాలవలన తెలుస్తుంది. ఇప్పటికీ కొన్ని శిథిలాలు, శాసనాలు పఠాంచెరువులో రోడ్లప్రక్కనే పడిపోయి కనిపిస్తాయి. ఆనాటి ఆనవాళ్ళను, విశేషాలను పదిలపరచటం ముందు తరాలకు అందజేయటం మన కర్తవ్యమ్.   

నల్లగొండ జిల్లాలోని కొలనుపాక ఒక్క వీరశైవమతస్థులకే కాక జైనులకూ, వైష్ణవులకూ కూడా ఎంతో ప్రసిద్దమైన స్థలం. ఇది చారిత్రకంగా ఎంతో ప్రసిద్ది నొందిన అతి పురాతన నగరం. ఇక్కడి నారాయాణస్వామి మందిరం కూడా అతి పురాతనమైనది. అలాగే జైన ఆలయం కూడా అతి పురాతనమైనదే. ఈ జైన ఆలయంలోని విగ్రహం అతి విలువైన రాతితో దాదాపు 35 అడుగుల ఎత్తున ఉండటం విశేషం. 

ఇక్కడ కనిపించే ఎన్నో శాసనాలు ఒకానొక కాలంలో కొలనుపాక ఎంతో ప్రసిద్ది చెందిన నగరమని తెలియపరుస్తాయి. పరిరక్షించే నాథుడు లేక ఎన్నో శాసనాలు, అక్కడి విగ్రహాలు చాలా భిన్నమైపోయాయి. సోమేశ్వర గుడి కూడా ఇప్పటికీ దీనావస్థలోనే ఉండడం భాద కలిగించే విషయం. ఇదే కాక ఇక్కడి గుళ్ళు, మఠాలు కూడా జీర్ణావస్థలోకి చేరు కున్నాయి.  ఎంతోమంది పర్యాటకులు రోజూ వస్తున్నా సరైన వసతులు లేక అభివృద్దిలోకి కొలనుపాక రావటం లేదన్నది సత్యం. హైదరాబాదుకు ఇది 80 కి.మీ దూరంలోనే ఉండడం వలన, అదీకాక హైదరాబాదు-వరంగల్ జాతీయ రహదారిపైన ఉండడం వలన ఇది పర్యాటక స్థలంగా మంచి అభివృద్దిలోకి వచ్చే అవకాశం కలదు. 

తెలంగాణ ప్రాంతానికే మణితిలకమైన ఈ కొలనుపాకను కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని ఆశిద్దాం. 

కొలనుపాక క్షేత్ర చిత్రాలు-వీడియోలు:
1. http://www.kaladarshana.com/sites/kolanupaka/index.html
2. http://shamalak.blogspot.in/2009/01/kulipaka-someswara-swamy-temple-place.html
3. https://www.youtube.com/watch?v=pgUXIBs14XE
4. http://tourismintg.com/Nalgonda_Kolanupaka.html

గమనిక:
ఈ వ్యాసము ప్రధానంగా వీరశైవమత స్థాపకులైన రేణుకాచార్యుల వారు తెలంగాణలోని కొలనుపాకలో ఉద్భవించారని, ఇక్కడి నుండే వారు సంఘసంస్కరణను చేపట్టి వీరశైవమత వ్యాప్తిని ప్రారంబించారని, కొలనుపాక క్షేత్రానికి ఉన్న ప్రాశస్త్యాన్ని తెలియపరచుటకు వ్రాయనైనదని మనవి. ఎవరికైనా సందేహాలు, ఆక్షేపణలు ఉన్న తమ కామెంట్స్ ద్వారా తెలియపరచిన, సందేహ నివృత్తిని, దోష నివృత్తిని చేయగలనని-తప్పులుంటే సరిదిద్దగలనని మనవి.    




No comments:

Post a Comment