Sunday, 31 August 2014

వినాయక పద్యాలు - పాటలు

పద్యాలు


కందము:
తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్

కందము:
అటుకులు కొబ్బరి పలుకులు
చిటి బెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్
నిటలాక్షునగ్ర సుతునకు
పటుకరముగ విందు చేతు ప్రార్థింతు మదిన్

చందము:
తొలుతన విఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయకా

ఉత్పలమాల:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగమ్రోయు గజ్జెలును మెల్లనిచూపులు మందహాసమున్
కొండక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్


మంగళ హారతి


శ్రీశంభు తనయునకు సిద్ది గణనాథునకు వాసిగల దేవతావంద్యునకును
ఆసరస విద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేను
వేరువేరుగ దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవగణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం, జయా జయమంగళం నిత్య శుభమంగళం
సుస్థిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు
శశి చూడరాదన్న జేకొంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
పానకము వడపప్పు పనస మామిడిపండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు
తేనెతో మాగిన తియ్యమామిడి పండ్లు మాకు బుద్దినిచ్చు గణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండుపంపు
కమ్మనీ నెయ్యియును కడుముద్దపప్పును బొజ్జవిరుగగ తినుచు పొరలుచును
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
పట్టుచీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కురుయు సిరులు
యిష్టసంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
ముక్కంటి తనయుడవని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి
నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజ లాలింపజేతు
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంధ్యునకు దేవునకును
దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడవు దేవగణపతికి నిపుడు
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
చెంగల్వ చేమంతి చెలరేగిగన్నేరు తామరలు తంగేడు తరచుగాను
పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ది గణపతికి బాగుగాను
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు
నేరేడు నెలవంక టెంకాయ తేనెయు బాగుగా నిచ్చెదరు చనుపుతోడ
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం
ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలుమీ కరునతోను
జయమంగళం నిత్య శుభమంగళం, జయాజయమంగళం నిత్య శుభమంగళం


పాట 

గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
సిద్దివినాయక గజాననా - బుద్దివినాయక గజాననా
మూషికవాహన గజాననా - మోదకహస్తా గజాననా
గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
ఆశ్రితవత్సల గజాననా - ఆపద్భాందవ గజాననా
విఘ్నవినాయక గజాననా - గణములకధిపతి గజాననా
గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
పార్వతి పుత్రా గజాననా - పరమపవిత్ర గజాననా
శంభుకుమారా గజాననా - శక్తిసుపుత్ర గజాననా
గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
లోకపూజితా గజాననా - లోకశరణ్య గజాననా
భక్తవత్సలా గజాననా - భక్తుల బ్రోవుము గజాననా
గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
షణ్ముఖసోదర గజాననా - అయ్యప్పసోదర గజాననా
మంగళదాయక గజాననా - మనికంఠ సోదర గజాననా
గజాననా ఓం గజాననా గౌరీపుత్రా గజాననా
No comments:

Post a Comment