ప్రజాభద్రత గాలికొదిలేస్తున్న ప్రభుత్వాలు
ఈ మద్యన జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇలాంటివి జరగటం సామాన్యమే అన్న ధొరినిలొ ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ రోజు మెదక్ జిల్లలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో స్కూలు పిల్లలు మరణించటం ఇందుకు మరొక ఉదాహరణ.
గేట్లులేని రైల్వే క్రాసింగ్ లు మన దేశంలో ఎన్నో ఉన్నాయి, తరచూ ఏదో ఒక చోట ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జనావాసాలు పెరుగుతున్నా కొద్ది, రైల్వే గేటుల ఆవశ్యకత కూడా రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. ప్రముఖ ప్రాంతాల్లో తప్ప నేటికీ రైల్వే గేటులేని రైల్వే క్రాసింగ్ లు పల్లె ప్రాంతాల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. వారి గురించి పట్టించుకునే నాధుడే లేడు. ప్రముఖులుండే, లేదా ప్రముఖ ప్రాంతాల్లో శ్రద్ధ చూపించడం తప్ప రైల్వే శాఖ గ్రామీణ ప్రాంతాల్లో శ్రద్ధ చూపించడం లేదు. ఎన్నో ఏళ్ల నుండి రైల్వే గేటు లేకుండానే ప్రయాణాలు సాగిస్తున్న పల్లెలెన్నో మనదేశంలో. కోట్లకు కోట్లు ఆదాయం సమకూరే రైల్వే వారికి - కోట్లకు కోట్లు ధనం ఖర్చు పెట్టే రైల్వే శాఖకు ఈ రైల్వే గేట్లు ఏర్పాటు చేయడం పెద్ద లెక్క ఏమీ కాదు. అయినా ఎందుకో దశాబ్దాలు దాటుతున్నా పట్టించుకోరు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ఈ రైల్వే క్రాసింగ్ లను అన్నిటికీ గేట్లు ఏర్పాటు చేసినపుడే ప్రజలకు భద్రత లభించేది.
స్కూల్ బస్సు డ్రైవర్ తొందర ఉంటే ఉండొచ్చునెమో కాని గేట్లు వేసి ఉంటే ఆ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నది సత్యం. భారతీయ రైల్వేలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు వెలతాయొ ఆ భగవంతుడు కూడా కనిపెట్టలేని విషయం. ఏరోజూ ఆ సమయానికి రాని రైలు మృత్యుముఖంలో ఈరోజు వచ్చేసి 20 మంది పిల్లల్నిపైగా పొట్టన పెట్టుకుంది (ఇంకా కొంతమంది పిల్లలు సీరియస్ గానే ఉన్నారు). ఇక్కడ ఎవర్నీ తప్పు పట్టలేం, దోషుల్ని చేయలేం. ఏమి చేసినా పోయిన పిల్లల్ని వెనక్కి కూడా తీసుకురాలేం. కాని దీనికి ప్రధాన భాద్యత వహించ వలసినది మాత్రం రైల్వే వారే, దశాబ్దాల నుండి ఉన్న ఆ రైల్వే క్రాసింగ్ కు గేటు పెట్టకపోవటం వారి ఉదాసీనతను తెలియ పరుస్తుంది, అంతకు ముందు జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకోక పోవడం కూడా వారి నిర్లక్ష్య దోరినికి నిదర్శనం.
మొన్న ఆ మద్యన జరిగిన బియాస్ నది దుర్ఘటన కూడా ప్రభుత్వ, డ్యాం అధికారుల నిర్లక్ష్యమే అని సాక్షాత్తు న్యాయస్థానలే తీర్పు చెప్పి జరిమానాలు వేసాయి. అక్కడ ప్రమాద హెచ్చరికలు చేయకపోవటం, ఎలాంటి ప్రమాద హెచ్చరిక బోర్డ్స్ పెట్టక పోవటం అక్కడి అధికారుల నిర్లక్ష్యమే. 24 మంది విద్యార్థులు చనిపోవటానికి ముందు కూడా అక్కడ ఇలాంటి సంఘటనలు జరిగాయి అని అక్కడి ప్రజలు తెలపడం పాలకుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనంగా కనిపిస్తుంది.
అంతేగాక ఈ మద్య తరచూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను కూడా ఇవి సామాన్యమే అనే రీతిలో ప్రతిస్పందిస్తున్న నాయకులు కూడా అలాంటి సంఘటనలకు ప్రోత్సాహకులు గానే పరిగణించాలి. నివారణ దిశగా చర్యలు తీసుకోవలసిన నాయకులే ఇవి కామన్ అన్న దిశలో వ్యఖ్యానిస్తుంటే ప్రజలు వెళ్లి తమ గోడును ఇంకెవరికి చెప్పుకుంటారు - ఈ సమాజం ఎప్పుడు బాగు పడుతుంది.
1956 లో మహబూబ్ నగర్ లో జరిగిన రైల్వే ప్రమాదంలో 112 మంది చనిపోతే చలించిన నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ ప్రమాదానికి నాదే భాద్యత అంటూ వెంటనే రాజీనామా ప్రకటించారు. నేడు అలాంటి నాయకులు లేరు మనకు. నువ్వు భాద్యుడివి అంటే నువ్వు అని ఒకరినొకరు దూషించుకునే దౌర్భాగ్యపు కాలం ఇది.
ఈ మద్యన తరచూ రైల్వే ప్రయాణాల్లో జరుగుతున్న దొంగతనాలు కూడా రైల్వే శాఖ వారి భద్రతను ప్రశ్నిస్తున్నాయి, రైలు అనే మాట వింటేనే ఈనాడు జనాలు భయపడే పరిస్థితిని కల్పిస్తున్నాయి. రైల్వే శాఖ వారు ఈ సారి తమ బడ్జెట్ లో ప్రయాణీకుల భద్రతకే పెద్ద పీటవేసి నట్టు ప్రకటించారు. ఈ రానున్న రోజుల్లోనైన ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. వీలైనంత త్వరలో దేశంలోని అన్ని రైల్వే క్రాసింగ్ లకు గేట్లు ఏర్పాటు చేయాలి. ప్రజల భద్రతకై పటిష్టమైన చర్యలు ఇప్పటికైనా రైల్వే శాఖ వారు తీసుకోవాలి - ప్రజలే వారికి ప్రధాన ఆధారం అన్న విషయాన్ని విస్మరించరాదు.
No comments:
Post a Comment