Sunday, 29 June 2014

అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు

అతిపురాతనం తెలంగాణా రాష్ట్ర పండుగలు 

తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర పండుగలుగా ప్రకటించిన అమ్మవారి బోనాలు, బతుకమ్మ పండగ రెండూ తెలంగాణా ప్రాంతంలో అనాదిగా ఆచరిస్తున్న పండగలు - ఇవి బహుపురాతనం. ఇంతటి ప్రాచీన పండగలు రాష్ట్ర పండగలుగా కలిగి ఉండటం, తెలంగాణా యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. 

ఇంతవరకూ మనకు లభించిన చరిత్రను బట్టి, ప్రత్యేకంగా ఆంధ్రుల చరిత్ర గ్రంథాల నుండి మనకు తెలిసేది ఏమంటే ఆర్యులైన ఆంధ్రులు ఉత్తర భారతం నుండి ఈ ప్రాంతానికి రాక ముందు ఈ తెలంగాణా ప్రాంతాల్లో నివసించే ప్రజలు నాగరికులుగా ఉండేవారని, వారు చెట్లు, రాళ్ళు, నాగులను, ప్రకృతిని పూజించేవారని తెలుస్తుంది. ఆంధ్రుల రాక తరువాత కూడా అవి కొనసాగాయని చరిత్ర మనకు చెబుతుంది. 

తెలంగాణా ప్రాంతంలో ఆ నాటి నుండి నేటి వరకు చెట్లను ముఖ్యంగా ఎంతో ప్రయోజనం కలిగించే వేప చెట్లను పూజించటం ముఖ్యమై పోయింది, వేప చెట్టును అమ్మవారుగా ఇప్పటికీ తలుస్తారు, పసుపు-కుంకుమలు, శాఖపెట్టి (నీళ్ళు పోసి), నైవేద్యం పెట్టి  ప్రదక్షిణలు చేస్తారు. ఇంటి గడపకు వేప కర్ర వాడతారు, గడపను పసుపు కుంకుమలతో పూజించటమే కాక నైవేద్యాలు కూడా పడతారు - గడపను తొక్కరు, పొరపాటున గడప పైన తుమ్మినా వెంటనే నీళ్ళు చల్లి శుద్ధి చేస్తారు. వెనకటి కాలంలో వేప కర్రనే అమ్మవారిగా పూజించేవారు, మరికొందరు గుండు రాతిని పూజించేవారు. మనిషి ఎదుగుదలతో బాటు కాలక్రమంలో అమ్మవారికీ రూపం ఏర్పడింది. కర్రతోనే అమ్మవారి రూపాలు చేసి పూజించారు - చాలా చోట్ల ఈ ఆనవాళ్ళు మనకు అగుపిస్తాయి. రాతి గుండు కూడా అమ్మవారిగాను, శివలింగం గాను మార్పు చెందబడింది. 

ప్రాచీన తంత్ర గ్రంథాల్లో కర్రతో కూడిన అమ్మవారి పూజ, చెట్ల పూజ ప్రముఖంగా చర్చించబడింది. చాలా గుళ్ళల్లో, ఇళ్ళలో నేటికీ కర్ర ప్రతిమా పూజ జరుగుతుంది (సమ్మక్క-సారక్కలు ఇప్పటికీ కర్ర రూపాల్లోనే పూజించ బడుతున్నారు), ముఖ్యంగా వేప చెట్టు, కర్ర తెలంగాణా ప్రాంతంలో అతి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అలాగే ప్రకృతి సిద్దంగా చెట్ల నుండి తయారు చేయబడే బండారు (పసుపు) విశిష్టత ఎంతో కలిగి ఉంది. అమ్మవారి రూపంలో ఆరాధించబడే పోతరాజులు కానీ, ఆడపడచులు కానీ మేనంతా పసుపుతో దర్శన మిస్తారు. 

వెనకటి కాలంలో మాంసం భుజించేవారు అమ్మవారి బొనాలకు (జాతర) దున్నపోతులను, మేకపోతులను, కోళ్ళను బలిచ్చేవారు (ఈ బలిచ్చే వాటిని అమ్మవారి పోతులుగా, మేకగా సంవత్సరం ముందు నుండే స్వేచ్చగా ఒదిలేసేవారు). నా చిన్నతనంలో చూసిన దున్నపోతుల బలి భయానకంగా అనిపించేది. శాఖాహారులు మాత్రం శాఖాహారము సమర్పించేవారు. కాలం మారింది - కాలంతో బాటు మనుషుల ఆచారాలూ మారాయి నేడు ఆనాటి జంతుబలులు తగ్గిపోయాయి. అమ్మవారి పూజ అనాది పూజ కావటం వల్ల, కొన్ని అనాది ఆచారాలు కూడా ఇప్పటికీ ఇంకా ఆచారించబడుతూనే ఉన్నాయి (ఆచారాలు మారితే అమ్మవారు కోపగించుకుని ఏమి చేస్తారో అనే భయం ప్రజల్లో బలంగా ఉంది). 

చెట్లను, చెట్ల పూవులను పూజించటం అనాది కాలం నుండి తెలంగాణా ప్రాంతంలో విశేషంగా కనిపిస్తుంది. అంతే గాకా స్త్రీని ఎక్కువగా ఆరాదించటం తెలంగాణాలో కనిపిస్తుంది. ఆ ఆరాధనా పరంపరలో పుట్టుకొచ్చిందే బతుకమ్మ పండగ, ప్రకృతి ఆరాధన, ప్రకృతి జీవనాన్ని కాపాడటం ఈ పండగ ముఖ్యోద్దేశ్యం, ఎన్నెన్నో కథలు కాలక్రమంలో పుట్టుకొచ్చినా ప్రధానంగా ఆడపడచుల గౌరవించటం ఈ పండగ ప్రాధాన్యత. ఇంటి ఆడపడచులు రావటం-వారని కొత్త బట్టలతో పలురకాల వంటకాలతో ఆనందపరచటం అన్నది ఈ పండగలో ముఖ్యంగా కనిపించేది. ఆడదిక్కు లేని ఇంట్లో ఈ బతుకమ్మ పండగ జరుపుకోరు. వెనకటి కాలంలో ఈ పండగలో ఆడపడచుల వీర గాథలు, కన్నీటి గాథలు, ప్రకృతిని కీర్తించే పాటలు బతుకమ్మ పాటల రూపంలో వినిపించేవి. కాలక్రమంలో ప్రసిద్ది పొందిన వ్యక్తుల గాథలు కలిసిపోయాయి.  అయినా అనాది ఈ బతుకమ్మ పూజలోని ఆచారాలు ఏమాత్రం మారలేదు. బతుకమ్మలో పసుపు గౌరమ్మ మరియు వెంపల్లి చెట్టు పూజ తప్పక ఉంటుంది. గుమ్మడి ఆకులు, గుమ్మడి పూవు, గునుగు పూలు, తంగేడి పూలు, ముత్యాల పూలు, పోక పూలు అనేవి ప్రధానమైనవిగా కనిపిస్తాయి (అతి తేలికగా ఉండేవి, అడవిలో విరివిగా లభించేవి, నీటిలో తేలికగా కలిసిపోయి చెరువులను సుగంధభరితం చేసి శుద్ధి చేసేవి అవటం వలన ఎక్కువగా వాడుకలో వచ్చాయి). 

అమ్మవారి బోనాలు, ఆడపడచుల బతుకమ్మ పండగలు తెలంగాణా విశిష్ట ఆచారాలకు కీర్తి కిరీటాలు. ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో అక్కడ సుఖ, శాంతి అభివృద్ధి విరాజిల్లుతుందని చెప్పిన ప్రాచీన శాస్త్ర వచనాల ఆచరణలో పెడుతూ జరుపబడే ఈ  రెండు పండగలలో స్త్రీ ఆరాధనే ప్రాముఖ్యతను సంచరించుకుంటుంది. అంతేగాక ప్రకృతిని మనం కాపాడితే మనల్ని ప్రకృతి కాపాడుతుంది అనే ఆధునిక ఆలొచనలకూ ఆచరణ రూపమే ఈ అతి ప్రాచీన పండగలు. 


ఎన్నెన్నో విశిష్టతలు కలిగిన ఈ రెండు ప్రాచీన పండగలను రాష్ట్ర  పండగలుగా ప్రకటించటం ఎంతో ఆనందదాయకమే కాక తెలంగాణా గోరవతకూ ఎంతో దోహద దాయకం. ఈ రెండు పండగలని ఆనందంగా జరుపుకుని తెలంగాణా ప్రజలు ఎల్లవేళలా అమ్మ వారు, ప్రకృతిమాత, స్త్రీ మూర్తుల  ఆశీస్సులతో కలకాలం ఆయురారోగ్యాలతో వర్ధిల్లుదురు గాక. 


 

3 comments:

 1. అయ్యా,
  మీ‌ వ్యాసం బాగుంది.
  వేప చెట్టును గూర్చి మీరువ్రాసింది ఆంధ్రప్రాంతంలోనూ‌ నిజమే.

  ఆర్యులైన ఆంధ్రులు ఉత్తర భారతం నుండి ఈ ప్రాంతానికి రాక ముందు అంటూ వ్రాసారు. కాని ఆర్యులు వారు ఉత్తరధృవం నుండి భారతదేశానికి వలసరావటం అనే వాదన ప్రస్తుతం చరిత్రకారులు ఒప్పుకోవటం లేదు. ఆ కుటిల వాదం ఎన్నడో పరాస్తం అయింది.

  మీరు శాఖాహారము అన్న పదం వాడారు. దాని నిజరూపం శాకాహారము. శాకములు అంటే‌ కూరగాయలు.

  అలాగే మీ పేరుకూడా తప్పుగా వ్రాస్తున్నారని అంటే‌ కోపగించుకోకండి. మల్లికార్జునుడు కాని మల్లిఖార్జునుడు కాదు. మల్లిక + అర్జున => మల్లికార్జున అని ఈ‌ రెండు సంస్కృతశబ్దాలమధ్యన సవర్ణదీర్ఘసంధి జరిగి మల్లికార్జున అవుతుంది.

  స్వస్తి.

  ReplyDelete
  Replies
  1. "శాకములు అంటే‌ కూరగాయలు"

   మా కుటుంబంలో "కూర" అనే మాట వాడరు, కూరగాయలతో చేసి అన్నంలో కలుపుకునే పదార్థాలను శాకం అనే అంటారు.. "ఈరోజు ఏమి శాకం" లాంటి మాటలు మా చిన్నప్పుడు సర్వసాధారణ.

   మా అమ్మ లాంటి వారికయితే "కూర" అనే పదం అస్సలు ఇష్టం లేదు. భోజనానికి బయటివారు (స్నేహితులు) వచ్చినప్పుడు వారి ముందర "అమ్మా ఇయ్యాల కూరేంది" లేదా "వచ్చే వాయలో కూర వడ్డించు" అంటే "మనం మాంసం తినం వారీ మనింట్లో అన్నీ శాకాలే కూర ఉండదు" అని కసిరేది.

   Thank you sir for reminding about those days!

   Delete
 2. అయ్యా,
  1) వ్యాసం బాగుందని తెలిపినందులకు సంతోషము.

  2) ఇక వేపచెట్టు ప్రాశస్త్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒరిస్సా లాంటి ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ నేడు కనిపిస్తుంది. అయినా వేప కొమ్మలు గుమ్మాలకి మంగళప్రదంగా వాడటమే కాక, వాటితో శివాలు ఊగటం, ప్రతినిత్యం పూజించటం వంటివి తెలంగాణాలో మాత్రమే కనిపించే ప్రత్యేకాంశాలు.

  3) శాకాహారము అన్న పద నిజరూపము శాకాహారము అని మీరన్నది సర్వజన విదితమే, కాని శాఖాహారము అని రాయటంలో దోషమేమీ లేదు, ఇలా ఎన్నో పదాలు వివిధ రూపాలలో రాయబడుతూ ఉండటం అనాది నుండి వాడుకలో ఉన్నదే. పదము యొక్క అర్థం మారకుండా చదువరికి ఆ పదము యొక్క అర్థం స్పష్టంగా తెలియబడినపుడు అక్షరాల మార్పుతో వచ్చే నష్టమేమీ లేదు అదీ కాక ఈ నెట్ ప్రపంచంలో రాయటానికి గ్రామర్ తో పనిలేదనేదే నా భావన. రాశాడు అన్నా వ్రాశాడు అన్నా, సమైక్యాంద్ర అన్నా సమైఖ్యాంద్ర అన్నా అర్థాల్లో ఏవిధమైన మార్పులూ జరగవు. కచటతపలు - గజడదబలు గా మారును అంటూ మొదలుగా గల వివరణలతో నన్నయభట్టే ఆంధ్రశబ్ద చింతామణి ని 11 శతాబ్దిలోనే రాయటం సర్వ విదితమే. కాలాన్ని భట్టి పదాల వాడుకలో మార్పులూ చేసుకోవటం సహజం - ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో పెద్ద పెద్ద పదాలు కూడా సౌలభ్యం కొరకు ఒకటి రెండు అక్షరాల్లోనే ఒదిగి పోతున్నాయి.


  4) రామాయణకాలం నాటికి ఆంధ్రుల ప్రస్తావన లేనేలేదు. ఆ కాలంలో ఈ దండకారణ్యంలో (ఇప్పటి తెలంగాణాలో) శబరులు, భిల్లులు, గోండులు నివసించేవారని సుష్పష్టంగా చెప్పబడి ఉంది, అరణ్యస్తులైన వీరి ప్రకృతి ఆరాధనలే తెలంగాణాలో నేటికీ పండగల రూపంలో కనబడుతున్నాయి. ఆంధ్రులు మగధ సామ్రాజ్యమును పాలించినట్లు పురాణము నందు ప్రస్తావించబడి ఉంది. ఉత్తరదేశంలోని ఈ మగధ రాజ్యాన్ని కాణ్వ వంశస్తుల పిదప, ఆంధ్ర వంశస్తులైన 32 మంది ఆంధ్ర రాజులు పరిపాలించినట్లు మత్స్య, వాయు, బ్రహ్మాండ, విష్ణు పురాణాల్లోనూ భాగవత పురాణంలోను వివరించబడి ఉంది.

  ఋగ్వేదము నందలి ఐతరేయ బ్రాహ్మణములో సుష్పష్టంగా ఆంధ్రుల ప్రస్తాన కలదు. విశ్వామిత్రుడు తన పుత్రులైన ఆంధ్రులను ఆర్యాశ్రమ సరిహద్దులలో అనార్యులతో కూడి నివసించుమని శపించినట్లు చెప్పబడి ఉంది. శాపానికి గురైన ఆంధ్రులు శాప కారణంగానే గంగానది పరివాహక ప్రాంతాన్నివీడి దక్షిణా ప్రాంతానికి వలస వచ్చారని తెలపబడింది. దాదాపుగా 99% ఆంధ్ర పండితులే గాక చరిత్రకారులూ తమ పరిశోధనల్లో ఈ విషయాలను రాయటం జరిగింది (ఆంధ్రుల చరిత్రకై తన జీవితాన్నే ధారబోసిన ప్రముఖ ఆంధ్ర కవి చిలుకూరి వీరభద్రరావు గారు కూడా తన ఆంధ్రులచరిత్రలో 3వ ప్రకరణమైన ఆంధ్రదేశ ప్రశంసలో ద్రువపరచటం జరిగింది. అంతే గాక ఆంధ్రపత్రికాది పత్రికలలోనూ, పలు ప్రత్యేక సంచికలలోనూ ఈ విషయాలు వివరించటం జరిగింది. ఎంతోమంది మహానుభావులు, ప్రముఖ ఆంధ్రపండితులు గ్రంధస్తం చేసిన విషయాలనే మీరు కుటిలవాదనగా అభివర్ణించటం, ఆ ఆంధ్రుల నందరినీ కుటిలులుగా చిత్రించటం మీ విజ్ఞతకే నిదర్శనం. వలస వాదనను మరుగు పరచాలనే ఉద్దేశ్యంతో అసలు మూలాలనే ప్రశ్నార్థకం చేయటం - వేదము, రామాయణము, పురాణాది గ్రందాల విషయాలనే తప్పు బట్టటం అవివేకమే అవుతుంది. ప్రధానంగా ఈ మూలాలనే తృణీకరించటం ఆంధ్ర-తెలంగాణాల విలీన సందర్భం నుండే (1955) మొదలైందిగా కనిపిస్తుంది. అలాంటివారు మరేదైనా బలమైన చారిత్రిక ఆధారాలను చూపినప్పుడే ఈ నవీన వాదన నిజమని ప్రపంచం విశ్వసిస్తుంది. ఇంతకంటే ఎక్కువగా ఈ విషయం గురించి ప్రస్తావించటం అనవసరం - ఫల శూన్యం.

  5) మల్లికార్జున అనే పదం మీరన్నట్లు ఒక విధంగా నిజమైనదే కాని అదే ప్రామాణికం అనటానికి వీల్లేదు. మల్లికార్జునునికి చెప్పబడిన ఎన్నో కథల్లో అది ఒకటి, దాని ప్రకారమే మీరు చెప్పిన మల్లిక + అర్జునుడు అనే సంధి ఏర్పడింది. కానీ దానికి పూర్వమే మల్లిఖార్జున పదం ప్రఖ్యాతిలో ఉన్నట్లు ప్రాచీన శాసనాల ద్వారా, గ్రంథాల ద్వారా తెలియబడుతుంది. ప్రస్తుత కాలంలోనూ మల్లిఖార్జున పదాన్ని బహుళంగానే ఉపయోగిస్తున్నారు. అదీ కాక నామవాచకాలు ఈ విధింగానే ఉండాలి అన్న నియమనిబంధనలు కూడా లేవు - ఉండవు. వెంకన్న అని పిలిచినా ఎంకన్న అని పిలిచినా, వీరన్న అని పిలిచినా బీరన్న అని పిలిచినా, రమణ అన్నా రమన అన్నా అర్థం ఒకే భావాన్ని స్ఫురిస్తుంది. ప్రాచీనంగా ఉపయోగించిన కొన్ని అక్షరాలు ఈనాటి పేర్లలో కనిపించకపోవడం ఈనాడు సామాన్యమై పోయింది. అదీ కాక పేరు అనేది పెద్దవారు మనకు దీవించి పెట్టేది - అది దోషం ఉన్నా సరిగా ఉన్నా దాన్ని అనుసరించటం, ఆమోదించటం మన విధి అని నేను విశ్వసిస్తాను.

  స్వస్తి.

  ReplyDelete