పిల్లలకు పునర్జన్మ ప్రసాదించిన తెలంగాణా సర్కార్
మొన్న మెదక్ మాసాయిపేటలో జరిగిన రైలు-స్కూల్ బస్సు దుర్ఘటనలో 20 మంది పిల్లలు ప్రాణాలతో దక్కటం - తెలంగాణా ప్రభుత్వం యొక్క కృషే. తెలంగాణా సర్కార్ తక్షణమే స్పందించిన తీరు ముఖ్యంగా తెలంగాణా మంత్రులు తీసుకున్న చొరవ, ప్రత్యేకంగా హరీష్ రావు గారు దగ్గర ఉండి క్షణాల్లో పిల్లల్ని తరలించటం, దగ్గరుండి అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఆఘమేఘాల మీద వారిని అవసరమైన వైద్యసదుపాయాలు ఉన్నచోటికి తరలించటం, వారు చేరే ముందుగానే అక్కడ వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవడం వంటివి పిల్లలు ప్రాణాపాయం నుండి బయటపడడానికి దోహదం చేశాయి.
అంతేగాక ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్నవారు వెంటనే స్పందించటం, 108 కు, గ్రామంలోని వారికి ఫోన్ చేయటం, సమీప గ్రామం వారు స్వయంగా JCB తీసుకొచ్చి పిల్లలని వెలికి తీయటం, విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు గారు క్షణాల మీద అక్కడికి చేరుకోవటం సమీప దవాఖానాకు తరలించటం ప్రశంసించదగ్గవి, మానవత్వాన్ని ప్రతిబింబింప జేసేవి. క్షణాల్లో ఇవన్నీ జరగకుంటే పిల్లలకు తీవ్ర రక్తస్రావమై దక్కేవారు కాదు అన్నది వాస్తవం.
ప్రమాదంలో నుజ్జైన బస్సు
బస్సు నుజ్జునుజ్జైన తీరే ప్రమాద తీవ్రతను తెలియజేస్తుంది. ఒక కిలోమీటరు దూరం వరకు రైలు బస్సును ఈడ్చుకేల్లటం, రెండు సార్లు బలంగా తాకటం వలన బస్సు తునాతుకలై పోయింది. ఇంక అందులోని పిల్లలు కొందరు కిటికీలోనుండి ఎగిరిపడితే, మరికొందరు బస్సులోనే చిక్కుకు పోయారు. వెంటనే వారికి వైద్య సదుపాయం అందడమే కాకుండా పద్మారావు, నాయిని లాంటి మంత్రులు దగ్గర ఉండి శ్రద్ధ తీసుకుని అన్న పానీయాలు ఆలోచించకుండా ఎక్కడికక్కడ వైద్యం, సహాయక చర్యలు పర్యవేక్షించడం వల్ల ఎక్కడా పిల్లల పట్ల అశ్రద్ద జరగక బ్రతికి బట్టకట్టడం జరిగింది.
ఇంకా విశేషమేమంటే ప్రాణాలతో బయటపడ్డ పిల్లలలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోవటానికి వీళ్ళేదు, ఎంతటి సహాయమైన అందించమని KCR గారు ఆదేశించటం, మంత్రులు కూడా దగ్గర ఉండి ఉన్నత వైద్యం అందేలా చూడటం వల్ల అంత ఘోర ప్రమాదం జరిగినా పిల్లలు మ్రుత్యుంజయులుగా బయట పడ్డారు. బ్రతికి బయటపడ్డ పిల్లల విషయంలోనే కాక చనిపోయిన పిల్లల విషయంలోనూ, వారి తల్లిదండ్రులను ఓదార్చి పిల్లలకు అంత్యక్రియలు జరిపే విషయంలోనూ ప్రభుత్వం కాని హరీష్ రావు గారు కాని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం జరిగింది.
తెలంగాణా ప్రభుత్వం కాని, మంత్రులు కాని పిల్లల పట్ల తీసుకున్న శ్రద్ధ ఎంతో శ్లాఘనీయం. ఈ సంఘటన విషయంలోనే కాక బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు గల్లంతైన విషయంలో కూడా తెలంగాణా ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకించి రాష్ట్ర హొమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి గారు అక్కడే వారం రోజులుపైన మకాం వేసి, తెలంగాణా నుండి ప్రత్యేక టీంను, గజ ఈతగాళ్ళను తీసుకెళ్ళి అన్ని పరిస్థితులు దగ్గర ఉండి సమీక్షించిన తీరు కూడా అభినందనీయం. దురదృష్టవశాత్తు అక్కడ వాతావరణం అనుకూలించక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం శూన్యమే అయింది.
ఇలాంటి సంఘటనల విషయాల్లోనే కాకుండా తెలంగాణాలో శాంతి భద్రతలు, ప్రజా సౌకర్యాల విషయాల్లోనూ తెలంగాణా ప్రభుత్వం కాని తెలంగాణా మంత్రులు కాని ముఖ్యమంత్రి కెసిఆర్ అద్వర్యంలో పూర్తిగా అంకితభావంతో పనిచేయడం, త్వరితగతిన స్పందించటం విశేషం. ఇలాంటి ప్రభుత్వ పనితీరు ఇంతకుముందు తెలంగాణలో ఏనాడు కనిపించలేదు కాదు కదా మరోచోట కనిపించిన దాఖలా కూడా లేదు. అంకితభావంతో అవినీతి లేకుండా పనిచేసే అమెరికా దేశంలాంటి ప్రభుత్వం తెలంగాణాలో కొలువుదీరినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ముందుముందు కూడా వీరు ఇలాంటి తీరునే అవలంబించి తెలంగాణాను బంగారుతెలంగాణా దిశగా తీసుకెళతారు అని భావించటంలో ఎలాంటి సందేహమూ లేదు.
No comments:
Post a Comment