ఎన్నాళ్ళో వేచిన ఉదయం..... స్వరాష్ట్ర సిద్ధి
స్వపరిపాలన కొరకై తెలంగాణా ప్రజల పోరాటం శాతాబ్దాలనే దాటింది. బ్రిటీష్ పరిపాలన పోవాలి స్వపరిపాలన కావాలి అని యావత్ భారత దేశం పోరాటం సాగిస్తే ఇటు తెలంగాణా ప్రజలు నిరంకుశ నిజాం ప్రభుత్వం పోవాలి తెలంగాణా స్వపరిపాలన రావాలి అని ఎన్నో పోరాటాలు చేశారు.
సమయాన్ని బట్టి పోరాటం పేరు మారింది, కాలాన్ని బట్టి నాయకుడు మారాడు కాని పోరాట లక్ష్యం ఒకటే అదే తెలంగాణా స్వపరిపాలన. శతాబ్దపు పైబడిన ఆ పోరాట స్ఫూర్తి ఆరి పోకుండా తెలంగాణాలో ఎంతో మంది పోరాటయోధులు పుట్టుకొచ్చారు, అందులో చెన్నారెడ్డి లాంటి వాళ్ళు పోరాటానికి తూట్లు పొడచినా, వారూ తెలంగాణా పోరాట పటిమను ఆయా కాలాల్లో రగుల్కొల్పిన పోరాట యోదులే అని గుర్తుంచుకోవాలి.
కేవలం స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన పోరాటమే తెలంగాణా పోరాటం అనుకుంటే పొరబాటే. అంతకు ముందు వంద సంవత్సరాల నుండి కూడా తెలంగాణా వీరులు, తెలంగాణా స్వేచ్చా స్వాతంత్ర్యాలకై పోరాటం సాగిస్తూనే వచ్చారు. ఎన్నో శతాబ్దాల పాటు వలసవాదుల పాలనలోనే తెలంగాణా ప్రజల జీవనం గడచిపోయింది. ఈ సుదీర్ఘ పోరాటంలో తెలంగాణా పేరే పోరు తెలంగాణా అని, వీర తెలంగాణా అని ప్రఖ్యాతిబడసి పోయింది.
మా తాత శంభయ్య కూడా నిజాం కాలం నాడే పోరాటం సాగించి కనుమరుగయ్యాడు. మనకు ఇపుడు లెక్కల్లో కనిపించే అమరులైన వారు 1200 అయితే వెలుగులోకి రాకుండా పోయిన వారు ఈ వందల ఏళ్లలో ఎన్ని వేలు ఉన్నారో ఊహించటమే కష్టం. తెలంగాణాలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఈ పోరాట సంకల్పం కనిపించటానికి అదే ప్రధాన కారణం. తెలంగాణా ప్రతి ఊరిలో ఒకరో ఇద్దరో తెలంగాణాకై అమరులైన వారు లేరంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్ర్యం వచ్చాక అమరులైన వారి కంటే నిజాం ప్రభుత్వ ఏలుబడిలోనే అమరులైన తెలంగాణా వీరులే ఎక్కువ.
పోరాటంలో పోయిన వారు నిస్వార్థంగానే పోయారు - వారికి సంబందించిన వారు కూడా ఆశించింది ఒక్కటే - అమరులైన తమవారి ఆశయమైన తెలంగాణా రాష్ట్రసిద్ది. అది నేటికి నెరవేరింది. ప్రతి ఒక్కరు అనుకున్నది ఒక్కటే నా కళ్ళ ముందు తెలంగాణా సాకారమవుతుందో లేదో అని. చాలా మంది చూడకుండానే పోయారు. ఇపుడు ఉన్నవారు ధన్యులే. మీకు తెలంగాణా ఈ జన్మలో రాదు అని ఎద్దేవా చేసినవారు కొందరైతే, రాకుండా చేసింది మరికొందరు. ఇప్పుడు వారు నోళ్ళు వెళ్ళబెట్టి, చేతులు ముడుచుకోవాల్సిన పరిస్థితి.
తెలంగాణా సమాజం కోరుకున్నది అందరికంటే బాగుపడదాం అనే కాదు, దానికంటే ఎక్కువ మా ఆత్మాభిమానం, మా సంస్కృతి సంప్రదాయాలకు ఒక గుర్తింపు రావాలని.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది - ఇపుడు తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలు, వ్యక్తులు, ప్రాంతాలు గుర్తింపు లోకి రావటం, ప్రపంచంలో తెలంగాణా ప్రత్యేక గుర్తింపును పొందటం తథ్యం.
అలాగే పోరాటపటిమగల తెలంగాణా భవిష్యత్తులో బంగారు తెలంగాణా అవుతుంది, అందరికంటే ముందులో వెళుతుంది అనేది కూడా సత్యం - తెలంగాణావారి నరనరాల్లో నిండిన సుధీర్గ పోరాట పటిమ, అంతులేని ఓర్మియే ఇందుకు నిదర్శనం. ఇదే అక్షర సత్యం.
జై తెలంగాణా...
జై జై తెలంగాణా.....
No comments:
Post a Comment