Thursday, 10 October 2013

నింగికెగసిన నిజమైన తార - A Tribute to Real Star Srihari

* * *
"పుట్టిన వాడికి మరణము తప్పదు - మరణించిన వాడికి మరల జన్మము తప్పదు"
అన్న సత్యం చెబుతూనే గీతాకారుడు
"మానవుడు చిరిగిన వస్త్రమును విడిచి నూతన వస్త్రమును ధరించినట్టు ఆత్మ కృశించిన శరీరాన్ని వదలి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది"
అని శరీరాన్ని కాపాడు కోవటం కూడా నీ కర్తవ్యమ్ అని హెచ్చరించాడు 
* * * 


దీక్షాదక్షుడు 
కష్టపడి సొంత ప్రావీణ్యంతో చిత్రసీమలో అనతికాలంలోనే పైకి వచ్చిన హీరో శ్రీహరి
బ్రహ్మనాయుడు చిత్రం ద్వారా శ్రీహరిని ఒక చిన్న పాత్రలో సినీ రంగానికి పరిచయం చేశాడు దర్శకరత్నదాసరి  
ఈ సినిమా 1985-86 లో ప్రారంభమైనా చాలా కాలం సెన్సార్ లో మగ్గినట్టు నాకు జ్ఞాపకం
మొత్తానికి బ్రహ్మనాయుడు 11-7-1987 న విడుదల చేయబడి తెరపై కనిపించాడు శ్రీహరి
తరువాత స్టంట్ మాస్టర్ గాను, చిన్న చిన్న పాత్రలలోనూ కనిపించాడు 

1990 లో వచ్చిన పోలీస్ చిత్రం ఆయన్ని హీరోగా పరిచయం చేసింది
శ్రీహరి విశ్వరూపాన్ని చూపించి ప్రజలకు దెగ్గర చేసిందీ చిత్రం
ఈ చిత్రంలో అశ్వని హీరోయిన్ కాగా ప్రతినాయకుడు రామిరెడ్డి 
చిత్రమేమో గాని రామిరెడ్డి, అశ్వని, శ్రీహరి ముగ్గురూ కొంచం అటూ-ఇటుగా ఏకకాలంలో చిత్రసీమలో అడుగుపెట్టి  శతాధిక చిత్రాలు పూర్తి చేసి బాగా పాపులర్ అయ్యారు
ఈ ముగ్గురూ వ్యాధి బారిన పడి 2-3 ఏళ్ల తేడాతో (రామిరెడ్డి 14-4-2011, అశ్విని 23-9-2012) అకాల మరణం పొందటం బాధాకరమే

రియల్ హీరో
ఏ పాత్రలోనైనా నటించి మెప్పించిన దిట్ట - ఎలాంటి పాత్రనైనా ధరించగల ఆహార్యం గల నటుడు
నవరస పాత్రల్లో మెప్పించాడు - ఎన్నో హిట్స్ సాధించాడు - ఎన్నో అవార్డులూ సొంతం చేసుకున్నాడు - ఉన్నత స్థాయికెదిగాడు  
సాంఘీక పాత్రలకే కాక, జానపద, పౌరాణిక పాత్రలకూ సరిపోయే అవయవ సౌష్టవం శ్రీహరి సొంతం.

చిత్ర జీవితంలోనే కాక నిజ జీవితంలోనూ ఆదర్శంగా జీవించి రియల్ హీరో అనిపించుకున్న ఘనత ఒక్క శ్రీహరిదే. 

తెలంగాణా హీరో 
కళాకారునికి ప్రాంతీయ తత్త్వం అంటగట్టడం మహాపాపం అయినా చెప్పక తప్పని సత్యం
ఒక హీరో తన సినిమాలన్నిట్లో తెలంగాణాయాసలో మాట్లాడటం అన్నది ఒక్క శ్రీహరితోనే జరిగింది.
తెలంగాణా భాషను విలన్లకు, హాస్య నటులకు వాడబడుతున్న తరుణంలో పూర్తిగా హీరోకు వాడటం శ్రీహరికే జరిగింది - ఆ విధంగా ఆయన తెలంగాణా హీరోనే అని చెప్పాలి 
ఆయన ఎక్కడివాడు అన్నది పక్కన పెడితే (వారి స్వస్థలం కృష్ణా జిల్లా) ఆయన హైదరాబాద్ బాలానగర్ లోనే చిన్నతనం నుండీ పెరగటం వలన తెలంగాణా యాసనే అబ్బింది - అదే ఆయనకు ప్లస్ పాయింట్ కూడా అయి ఆయన సినిమాలన్నిట్లో కూడా అదే యాసతో కూడిన మాటలే చెప్పటం జరిగింది - అవి ఆన్ని ప్రాంతాల వారిని ఆకట్టుకుని ఆంధ్ర ప్రదేశ్ అన్ని ప్రాంతాలలోనూ ఆయనకు అభిమానుల్ని సంపాదించి పెట్టింది. 


ప్రేమమూర్తి 
డిస్కో శాంతి, సిల్క్ స్మిత ఇద్దరూ 1985 ప్రాంతంలో నాట్య తారలుగా ఎంతో ఫేమస్ - వారిద్దరూ ప్రేమలో పడ్డారు
సిల్క్ స్మిత గారి ప్రేమ మోసానికి, అనాదరణకు గురై చివరకు విశాదభారితమై ఆత్మహత్యకే దారి తీసింది
కాని డిస్కో శాంతి గారి ప్రేమ ఫలించింది - దానికి ప్రధాన కారణం ఆమెకు ప్రేమకు విలువ ఇవ్వగల శ్రీహరి తోడుగా లభించడమే 
సినీ తారల వైవాహిక జీవితం మూడు నాళ్ళ ముచ్చటే అయినా వీరు అన్యోన్యంగా జీవితం కొనసాగించడం వీరి పరస్పరానురాగాలకు నిదర్శనం.
అంతేగాక భార్యను ఇంటి వరకే పరిమితం చేయక సమాజంలో, సామాజిక సేవలో ముందుంచటం శ్రీహరి గారి ఉన్నత ఆదర్శాలకు నిదర్శనం.  
ప్రేమికులకు ఒక ఆదర్శం- శ్రీహరి 

నిగర్వి
ఇంతింతై వటుడింతై... అన్నట్లు శ్రీహరి చిన్న పాత్రల్లో పరిచయమై హీరోగా, విలన్ గా, హాస్యనటునిగా, గొప్ప కారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు
దిగిన కొద్ది ఒదిగి ఉన్నాడు - తనకంటే చిన్నవారిని కూడా దెగ్గర చేర్చాడు
పెద్దవారి దెగ్గర ఇంకా తొలినాటి వాడిలాగే మసలాడు
అందుకే ఆయన అందరి ఆదరాభిమానాన్ని చూరగొన్నాడు - అందలేని ఎత్తులనూ అధిగమించాడు
పైకేదగాలనుకునే వారికి - ఎదిగి ఒదిగి ఉండాలనే దానికి నిలువెత్తు నిదర్శనం - శ్రీహరి 

కార్యశూరుడు
ఒకచో నేలపై బవ్వలించు ... అన్నట్లు అనుకున్నది సాధించటంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనుదీయక
లక్ష్యసాధనే లక్ష్యమై సాగి లక్ష్యాల సాధించి విజయుడై నిలిచాడు
చిత్రసీమలోనే కాక నిజ జీవితంలోనూ తాను  అనుకున్నవి ఎన్నో సాధించాడు
బాలానగర్ లోని శోభన థియేటర్ ముందు పాలు అమ్ముకున్న వాడు
చిన్నపుడు కలగన్నట్టుగా ఆ శోభనా టాకీస్ నే కొనగలిగాడు. 

మానవతావాది 
 మురిపాల తన కూతురు మూడు నెలలు తీరకుండా దూరమైతే ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కారు మనం చేసే మంచిపనే శాశ్వతం అనే బాటలో సాగి
అక్షర ఫౌండేషన్ స్థాపించి మేడ్చల్ దగ్గర కొన్ని గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రామాల చేపట్టాడు
ఎన్నో ప్రజోపయోగ కార్యక్రామాలు చేశాడు - మరెన్నో తెలియని గుప్త దానాలు, సహాయాలు చేసిన కరుణామూర్తి - శ్రేహరి 

ఎందరికో ఎంతో చేసిన ఆయనను కాలేయ వ్యాధి రూపంలో మృత్యువు కాటేసింది
ఎందరికో ఎన్నో మంచి సలహాలిచ్చే ఆయన అకాల మృత్యువు వాత పడటం విధి బలీయానికి నిదర్శనం

ధ్రువతార
ఉన్నంత కాలం నేలపైన వెలిగి - మరణించాక కూడా
చేసిన మంచి పాత్రలతోనే కాక, చేసిన ఎన్నో మంచి పనులతోనూ
నిత్యం నింగిలో వెలిగి వెలుగులు విరజిమ్మే నిజమైన తార - శ్రీహరి 






2 comments:

  1. చక్కగా రాసారు, కృతఙ్ఞతలు.

    ఈ మద్య కొందరు తారలు పోయారని తెలిసినప్పుడు అనిపించని భాద వీరి మరణ వార్త తెలియగానే అనిపించినది. మనం ఒక మంచి నటుడిని, ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం.

    ReplyDelete