Wednesday 20 December 2017

నభూతో నభవిష్యతి - తెలంగాణ తొలి ప్రపంచ తెలుగు మహాసభలు - 2017

ఇంతకుముందు కూడా ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి - కానీ అవి ఏవీ ఇంతగొప్పగా జరగలేవు అందుకే నభూతో అనటం జరిగింది. ఇంతకుముందు జరిగినవి పేరుకు మాత్రమే జరిగాయి - అందులో ప్రజలు భాగస్వామ్యం కాలేరు. ఏవో అధికారిక సభలుగా అధికారులు, పెద్దవాళ్ళు మాత్రమే ఎక్కువగా పాల్గొనటం జరిగింది. కానీ తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 మాత్రం ప్రతి తెలుగువాడిని పాల్గొనేలా చేశాయి. ఈ సభలకు రూపకల్పన చేసిన వారికి నిజంగా జోహార్లు చెప్పాలి. ఎవరో కవులు వస్తారు ఏవో చెప్తారు అంటే పట్టుమని పదిమంది కూడా కనిపించరు - సభలకు. అలాంటిది ఈ సభలకు స్టేడియంలు సరిపోక బయట నిల్చునే పరిస్థితి వచ్చింది అంటే ఈ సభల విజయం - అనన్య సామాన్యం. ప్రతి ఒక్కరిని రప్పించగలగటం గొప్ప విశేషం. బాలలు, మహిళలు, పండితులు, కవులు, అవధానులు, కళాకారులు, అధికారులు, సామాన్యులందరికీ భాగస్వామ్యం కల్పించటమనేదే ఈ సభల యొక్క విజయరహస్యం. అంతేగాక ఆన్లైన్ ద్వారా ప్రపంచం నలుమూలల ఉండే తెలుగువారు నమోదు చేసుకుని సభలకు రాగలిగే వీలు కల్పించటం - వచ్చిన వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పించటం అనేది ఎంతోమంది కొత్త కవులకు, ఔత్సాహికులకు అవకాశం లభింపజేసింది. ఇక ప్రతి తెలంగాణా ప్రాంత కవులకు, కళాకారులకు గౌరవ ప్రాచుర్యాల నివ్వటం ఆయా ప్రాంతాలవారిని దెగ్గర చేరదీసింది. తెలంగాణా నలుచెరుగుల నుండీ మహాసభలకు రప్పింపజేసింది. ఇక అక్కడ ఏర్పాటు జేసిన తెలంగాణా ప్రత్యేక ఆహారపు స్టాళ్లు మళ్ళీ మళ్ళీ రప్పింపజేశాయి. వాటి ఖరీదు కూడా సామాన్యంగా ఉండేలా చేయటం కూడా విశేషమే. అంతేగాక తెలియని నేటి తరాలకు తెలియజెప్పాలి అని అక్కడ ప్రదర్శించిన కళలు, ప్రదర్శనలు,  నేటితరాల వారినీ రప్పింప జేసాయి. ముఖ్యంగా అక్కడ ప్రదర్శించిన ఎల్లమ్మ జాతర, బోనాలు, బతుకమ్మ ఆటలు, పీర్ల పండగ, పోతురాజుల ఆటలు, గిరిజనుల నృత్యాలు, ఏర్పాటు చేసిన తెలంగాణా గ్రామీణ వాతావరణం, సమ్మక్క-సారలమ్మల గద్దెలు, పిట్టలదొర వంటివే గాక ఏర్పాటు చేసిన యక్షగాణాలు, కోలాటాలు, చిత్రకళలు  లాంటి ఎన్నో కళారూపాలు  మళ్ళీ మళ్ళీ సందర్శించేలా చేశాయి. ఈ సభల దిగ్విజయంలో సగభాగం అన్నీ దగ్గరుండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దక్కుతుంది. 

ఇక నభవిష్యతి అనటానికి కూడా కారణం ఉంది - ఈ మహాసభలు 5 రోజులు జరిగితే ఇక ముందు ప్రతి ఏటా జరగబోయే మహాసభలు కేవలం 2 రోజులుగానే నిర్ణయించబడ్డాయి. అదీకాక ఎంతో ఘనంగా స్వయంగా అన్నీ దగ్గర ఉండి పర్యవేక్షించిన ముఖ్యమంత్రి కెసిఆర్ గారిలో కూడా తొలి, మలిరోజులలో ఉన్న ఉత్సాహం చివరిరోజు కంటా కనిపించలేదు. చివరిరోజు ప్రకటితమవుతాయన్న చారిత్రిక నిర్ణయాలేవీ వినిపించక పోవటం అందుకు ఉదాహరణ.  రాబోయే కాలంలో కెసిఆర్ గారిలా ఇంతగొప్పగా శ్రద్ధ తీసుకుని నిర్వహించే వారు ఉంటారు అని కూడా అనిపించడం లేదు అందుకే నభవిష్యతి అనటం జరిగింది. 

ఈ తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రత్యేకంగా మరుగుపడిపోయిన ఎంతోమంది కవులు, కళాకారులు వెలికితీయబడ్డారు. ఎక్కువగా మనకు తెలియని 50 మందికిపై తెలంగాణ తేజోమూర్తుల జీవితాలను ప్రత్యేకంగా తెలంగాణా ప్రభుత్వం - తెలుగు అకాడమీ వారు పుస్తకాల రూపంలో ప్రచురించి తక్కువ ధరలకే అందించటం ఎంతో అభినందించ దగ్గ విషయం. అయితే ఇంకా వెలుగులోకి తేవలసినవారు ఎంతోమంది ఉన్నారు - రాబోయే కాలంలో వారుకూడా వెలుగులోకి వస్తారని ఆశిద్దాం. అలాగే తెలుగు అకాడమీ వారి ప్రత్యేక మహాసభల సంచిక ఎన్నో తెలంగాణా విశేషాలను తెలియజెప్పింది - అది ఒక గొప్ప పుస్తకం.  తెలంగాణ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన తీరు - స్పందన చూసి ఎంతో కాలం తరువాత మళ్ళీ నాకు బ్లాగు రాయాలి అనిపించింది. ఇకముందున కాలగర్భంలో కలిసిపోయిన నాకు తెలిసిన కొంతమంది తెలంగాణ కవులు, కళాకారులను  నా బ్లాగు ద్వారా తెలుపడానికి ప్రయత్నిస్తాను కూడా. ఈ సభలకు సంబందించిన మరిన్ని విషయాలను కూడా మరో టపాలో ప్రస్తావిస్తాను. 



1 comment: