తెలంగాణ అతి పురాతన పండగ - నాగుల పంచమి
ప్రతి సంవత్సరం శ్రావణ శుద్ధ పంచమి నాడు తెలంగాణ ప్రాంతం అంతటా జరుపబడే ప్రసిద్ద పండగ - నాగ పంచమి/నాగుల పంచమి. పంచమికి ముందు రోజైన చవితి నాడు కన్యలు, ముత్తైదువలు ఉపవాసం ఉండటం జరుగుతుంది, మరునాడు నాగుల పుట్టను పూజించి పాలుపోసి భుజించి ఉపవాసం విడుస్తారు - అందువల్ల కొందరు నాగులచవితి అని కూడా ఈ పండగని పిలుస్తుంటారు.
ఇది తెలంగాణా అతిప్రాచీన పండగ. పలు పురాణాలు, ఐతరేయ బ్రాహ్మణము, ఆంధ్రుల చరిత్ర ఇత్యాది పెక్కు గ్రంధాలవాలన తెలిసేదేమంటే విశ్వామిత్రుని శాపానికి గురై ఉత్తరభారతం నుండి ఆర్యులైన ఆంధ్రులు దక్షిణాపథానికి రాకమునుపు తెలంగాణా ప్రాంతంలో శబరులు, భిల్లులు, గోండులతో బాటు నాగులూ నివసించేవారు. ఈ నాగులు నేపాల కాశ్మీరం నుండి తెలంగాణా వరకు రాజ్యం చేసినట్లుగా చరిత్రవలన తెలియవస్తుంది. క్రీ.పూ. నుండి ఈ నాగులు పూజించబడినట్లు లభ్యమైన ప్రాచీన శిల్పాలు, భౌద్ధ జాతక కథల వలన తెలుస్తుంది. నాగజాతికి చెందినవారు రాజ్యం ఏలుటవలన ప్రజలు వారిని కొలవటం ప్రారంబించినట్టు చరిత్రకారులు కొందరు అభిప్రాయ పడుతున్నారు. చాలా ప్రదేశాలకు నాగుల పేర్లు పెట్టడం, మనుషులకు కూడా పేర్లు పెట్టడం తెలంగాణా ప్రాంతంలోనే గాక నాగులు పరిపాలించిన అన్ని ప్రాంతాల్లోనూ కనిపిస్తుంది. క్రీ.పూ. కాలంలో బర్మా వెళ్ళిన తెలంగాణ ప్రాంతం వారు కూడా ఈ నాగులను తమ కుల దైవంగా పూజించారు, ఇప్పటికీ అక్కడ వీరు నాగులను తమ పూర్వీకులుగా భావించి పూజించటం జరుగుతుంది.
ఈ నాగులు ఎక్కడెక్కడ పరిపాలన సాగించారో అక్కడక్కడ వీరిని పూజించటం జరిగిందని తెలుస్తుంది. ఇప్పటికీ ఆయా ప్రదేశాల్లో ప్రధానంగా వీరిని పూజించటం, నాగులపంచమిని జరుపుకోవటం జరుగుతుంది. నేపాల్ తో బాటు దాదాపుగా దేశం మొత్తంలో శ్రావణ శుద్ధ పంచమి నాడే నాగులపంచమి జరుపబడుతుంది. అతి ప్రాచీనకాలం నుండీ తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రావణ శుద్ధ పంచమి నాడే నాగులను పూజిస్తారు.
అయితే ఆంద్రప్రాంతంలో మాత్రం ఈ నాగుల పంచమి/నాగుల చవితి కార్తీకమాస శుద్ధ పంచమి నాడు జరుపుకోవటం జరుగుతుంది. ఆంధ్రా-తెలంగాణా వారి భిన్నత్వానికి నాగ పంచమి పండగ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటివి మరికొన్ని పండగలు ఇరు ప్రాంతాల్లో భిన్నమైన కాలాల్లోనే కాక చాలా మటుకు భిన్న సాంప్రదాయాల్లో జరుపుకోవటం జరుగుతుంది. హనుమాన్ జయంతి కూడా తెలంగాణా ప్రాంతంలో చైత్ర పూర్ణిమ నాడు జరుపుకుంటే, ఆంద్ర ప్రాంతంలో మాత్రం వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది.
ఈ పండగలో తెలంగాణా ప్రాంతంలో కొన్ని విశిష్ట ఆచారాలు పాటిస్తారు. పూర్వకాలం నుండీ పాములు నివాసం ఉండే పుట్టను పూజించి, పుట్టలో పాలు పోయడమే ఈ పండగ ప్రాధాన్యం. దానితో బాటు పసుపు పూసిన దారపు కంకణాలు పుట్టపైన ఉంచటం జరుగుతుంది - వీటిని పూజ తరువాత ఇంటికి తెచ్చుకుని చేతికి రక్షగా ధరించడం ఆనవాయితి. అలాగే పుట్ట దగ్గర రవికె బట్టలు, చీర కూడా ఉంచి పూజించి, తరువాత ఇంటికి తెచ్చి గడప దెగ్గర ఇంట్లోని కన్యలని కూచోబెట్టి వారికి గడపకు పూజచేసి అమ్మాయికి సమర్పించటం జరుగుతుంది. అలాగే పుట్టనుండి ఇంటి వరకూ వస్తూ వెంట తెచ్చిన జొన్నపేలాలు, శనిగెలు దారివెంట అక్కడక్కడ జారవిడుస్తూ వస్తారు. ఈ పేలాలు, శనిగెల ప్రసాదం కొంత తీసిఉంచి సరిగ్గా నెల తరవాత వచ్చే వినాయక చవితి నాడు తింటారు - ఇలా తినడం వలన చంద్రున్ని చూసిన దోషం ఉండదని చెబుతుంటారు. ఇంకా నాగుల చవితినాడు ప్రసాదంగా మడత కుడుములు, చప్పటి పప్పు (ఉప్పు కారంలేని పప్పు) నివేదిస్తారు.
ఇంట్లో చిన్న పిల్లలు కుడుకకు ఒక కట్టేపుల్లను ఇటు వైపునుండి అటు తేలేలా మద్యలో గుచ్చి, ఆ పుల్లకు దారం కట్టి వడితిప్పి కుడుకలో జొన్న పేలాలు వేసి ఒదిలేస్తారు. అది గిరగిరా చక్రంలా తిరుగుతూ పెలాలన్ని చుట్టూ పడిపోతుంటాయి, కింద పడిపోయిన వాటిని మళ్ళీ ఏరుకుని వేసి తిప్పుకుంటూ పిల్లలు ఆ రోజు ఆడుకోవడం అందరి ఇంట్లో జరిగేది.
కాగా అప్పటికి ఇప్పటికీ ఆచారాలు చాలా మారాయి, వాటితో బాటు ప్రసాదాలూ మారాయి కొందరు అరటిపళ్ళు కూడా నివేదిస్తుంటే, మాంసాహారం తినే మరికొందరు కోడిగుడ్లు కూడా నివేదిస్తున్నారు. అలాగే పుట్టల్ని కాక రాతి నాగులనీ పూజిస్తున్నారు. ఏవిధంగా అయితేనేమీ నాగులపంచమి పండగ తెలంగాణా ప్రాంతంలో తరతరాల నుండీ నేటికీ జరుపుకోబడుతుంది.
>ఆంధ్రా-తెలంగాణా వారి భిన్నత్వానికి నాగ పంచమి పండగ ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
ReplyDeleteచివరకు ఈ అంధ్రతెలంగాణా అనే కృత్రిమవిబేధాలు దేవుళ్ళకూ వాళ్ళ పూజలకూ కూడా ఆపాదిస్తున్నారన్నమాట, నోటెడ్.
కనులముందు కనిపించే సత్యాలను అంగీకరించటం ఉన్నత మనస్కుల గొప్పతనం. సత్యాలను కూడా ఆపాదించడం అంటూ వక్రభాష్యం చెప్పడం మీ లాంటి సంస్కారవంతులకు తగదు. లేనిది చెప్తే వ్యతిరేకించటం ఉత్తమమే, కాని సత్యాలను కూడా తిరస్కరించటం మనల్ని మనం మోసం చేసుకోవడమే అవుతుంది.
Deleteతేడాలు అన్నీ విబేధాలు కానక్కరలేదు. మనకు నచ్చనంత మాత్రాన తేడాలు కొట్టి పారేయలేము.
Delete