సర్వం శివమయం జగత్
అతి ప్రాచీనం, అతి ప్రసిద్ధం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీశైల మల్లిఖార్జున లింగం
అతి ప్రాచీనం, అతి ప్రసిద్ధం ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీశైల మల్లిఖార్జున లింగం
జ్యోతిర్లింగాలు - స్వయంభువులు, అవి ఎవరిచేత ప్రతిష్టింపబడినట్టివి కావు.
కొన్ని లింగాలకు ముష్కరుల దాడుల్లో ప్రమాదం వాటిల్లిందేమో కాని శ్రీశైల లింగం మొదటి నుండి ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది.
ఒకప్పుడు ఇప్పటిలా నిత్యం వేల మందితో విలసిల్లిన ప్రసిద్ద క్షేత్రం ఇది
వందలకొద్ది మఠాలతో, వేలకొద్ది జంగమ మఠాధిపతులతో నిత్యం ఉత్సవాలు జరుపుకున్న పుణ్యక్షేత్రం ఇది
అయితే మద్యలో ముష్కరుల ఆంక్షలకు, భయాలకు లోనై మనుషులు చేరుకోలేని కీకారణ్యమైంది
ఆ సమయంలో కోయలు, చెంచులే ప్రధాన భక్తులుగా పూజలందుకొన్నాడు మల్లన్న
అప్పట్లో ఇక్కడి పూజా, దర్శన పద్దతుల్లో కొన్ని మార్పులేర్పడ్డాయి.
శ్రీశైల లింగాన్ని ఎవరైనా తాకటం అనాది ఆచారం
ధూళి దర్శనం అనే ఈ దర్శనంలో ఎవరైనా క్షేత్రానికి వచ్చినదే తడవుగా గర్భగుడిలో వెళ్లి
స్వామి వారిని (లింగాన్ని) తాకి మొక్కేవారు
ఎవరైనా భక్తులు తెలియక తాకకపోతే అక్కడి పూజారులు లింగాన్ని రెండు చేతులతో పట్టుకుని నొసలు తాకించి మ్రొక్కాలి అని చెప్పి తాకించేవారు
అలా తాకాటం వలన స్వామి వారి లింగం నుండి వెలువడే అయస్కాంత తరంగాలు మనలో ప్రసరిస్తాయి అని చెప్పేవారు అక్కడి జంగమ పూజారులు
ఈ జ్యోతిర్లింగం కింద మరికొన్ని జ్యోతిర్లింగాలు ఉండి
అనునిత్యం వాటి నుండి అయస్కాంత తరంగాల వలే తేజో తరంగాలు వెలువడి
పైన మనము దర్శించి, స్పృశించే జ్యోతిర్లింగంలో ప్రసరిస్తుంటాయని చాలా మంది పండితులు చెపుతుంటారు.
అందుకే లింగాన్ని తాకి మ్రొక్కె ఈ ఆచారం శ్రీశైలంలో ప్రధానమైన ఆచారంగా ఉండింది.
ఆలయానికి ఆదాయం తేవడం నిమిత్తమో లేదా శుబ్రత పాటించడం నిమిత్తమో కాని
కొంత కాలం క్రితం నుండి ధూళి దర్శనం తీసివేయబడింది.
ప్రస్తుతం శుచులై సంప్రదాయ వస్త్రాలు ధరించి అభిషేకం చేసేవారికే స్వామిని స్పృశించే భాగ్యం కలుగుతున్నది.
వందలు (ఇప్పుడు వేయి దాటిందో మరి) వెచ్చించలేని నిర్భాగ్యులకు స్వామి వారి స్పర్శ దూరం కావటం విచారించ దగ్గ విషయం.
ఎన్ని సార్లైనా స్వామి వారిని తాకి ఆత్మతృప్తిని పొందిన నిర్భాగ్యులు నేడు కేవలం దూరం నుండి దర్శనం మాత్రం చేసుకోగలుగుతున్నారు
అయితే ఎవరైనా డబ్బులు వెచ్చించి అయినా స్వామి వారిని తాకి, మ్రొక్కి పునీతులవుదామనుకున్నా
నేడు ఆ వీలు లేకుండా జ్యోతిర్లింగం పైన బంగారు రేకు కవచం పెడతామనటం అన్యాయం
అది భగవంతుని నుండి భక్తుని దూరం చేయటమే అవుతుంది.
ఒక్కో క్షేత్రానికి ఒక్కో ఆచారం ఉంటుంది - ఆ ఆచారాలే అక్కడ ముఖ్యం కాని
శాస్త్రాల్లో చెప్పిన విషయాలన్నీ అంతటా వర్తించవు - అలా ఆలోచించటం ధర్మ విరుద్డమే
అభిషేకప్రియుడు శివుడు అని శాస్త్రాలు చెప్పినట్టు - ఎప్పుడూ స్వామి వారికి అభిషేకాలు జరుగుతూనే ఉండాలి.
స్వామి వారిని తాకితే, నిరంతరాభిషేకాలతో లింగం అరిగిపోతుంది అని లింగంపైన బంగారు తొడుగు పెడతామనటం శాస్త్ర విరుద్దం, అపచారం కూడా
బంగారు తొడుగు పెట్టి బంగారు నీటి అభిషేకం చేసినా ఫలము శూన్యమే కదా?
గంగోదకమైనా, స్వర్నోదకమైనా స్వామిని తాకని నాడు నిష్పలమే కదా?
ఒకవేళ లింగాన్ని జలం తాకేట్టు పైన ఒక చిన్న రంద్రం పెడతామన్నా
లోనకు జలంతో బాటు గంధాక్షత పుష్పోదకాది మాలిన్యాలూ చేరి నిలిచి ఉంటవి కదా?
అయినా స్వామిని తాకని భక్తునికి సంతృప్తి ఎక్కడ?
సంతృప్తి పరచలేని కొత్త ఆచారాలేల?
స్వామి వారికి బంగారు కవచం తొడిగితే ఏమవుతుంది?
పురాణోక్తి
పురాణాల్లో చెప్పబడి ఉన్న ప్రకారం రావణుని వధించి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకున్న
శ్రీరాముడు ఆ పాపం పోగొట్టుకోవటానికి శ్రీశైల జ్యోతిర్లింగ దర్శనంకై వస్తున్నాడని తెలియడంతో
ఎంతో ఎత్తున ఉన్న స్వామి వారు కనిపించకుండా భూమి లోనికి పోవటం ప్రారంబించారని చెప్పడం జరిగింది.
ఒకవేళ స్వామి వారి తరుగుదల అలా జరుగుతుంటే బంగారు కవచం తొడిగి ఆపటం మన తరం కాదు.
శాస్త్రోక్తి
"అణోరణీయాన్ మహతో మహీయన్" "సుక్ష్మాత్ సూక్ష్మతరం" అని వేద శాస్త్రాలు లింగం గురించి చెబుతున్నట్టు
పరమాణువు కంటే చిన్నగానూ, అధికమైన దానికంటే అధికమైనది అయిన (God Particle)
లింగరూప పరమాత్మను గురించి మనం లెక్కలు కట్టడం మూర్ఖత్వమే
ఆ లింగం పరమాణువు అంత పరిమాణానికి వచ్చిన అది పరమాత్మే అయినపుడు
ఎదుగుదల, తరుగుదలల గురించి ఆలోచించి భక్తుల స్పర్శకు దూరం చేయుట అశాస్త్రీయమే
భౌతికోక్తి
లింగానికి నిత్యాభిశేకాలు అన్ని గుళ్ళలో నిత్యం జరిగేవే, కాని అన్ని కూడా అలా తరగటం లేదు
కాశీలో కూడా శివలింగానికి నిత్యం అభిషేకాలు చేసి తాకి తరిస్తుంటారు భక్తులు
కాశీ విశ్వేశ్వరుడెప్పుడూ నీటి అభిషేకంలోనే నిండి ఉంటాడు మరి
అక్కడ కాని మరెక్కడా కాని ఈ లింగం తరుగుదల అనే వాదం తలెత్తలేదు
అయితే శ్రీశైలంలో లింగం తరిగిపోవటానికి అక్కడి లింగం సున్నితమై ఉండడం కూడా ఒక కారణం అయి ఉండవచ్చు
లింగాన్ని మనం స్ప్రుశించినపుడు మెత్తగా తాకిన అనుభూతి కలుగుతుంది
అయినా శతాబ్దంలో అది ఏ కొంత అంగుళమొ తగ్గి ఉంటుంది
అంతేగాని మొత్తానికి అరిగిపోతుందనటం అసత్యం
అయినా ఇప్పటికే స్పర్శ దర్శనం పూర్తిగా తగ్గించివేశారు
రుద్రాభిషేకం కూడా ఏ 5 నిమిషాలో చేపిస్తున్నారు
మహన్యాస పూర్వక రుద్రాభిషేకమైనా ఏ 5 నిమిషాలో స్వామి వారి వద్ద చేయించి
మిగతా అంతా వృద్ద మల్లిఖార్జున స్వామి వారి వద్ద కానిస్తున్నారాయే
అలాంటప్పుడు ఇంకా అక్కడ అరుగుదలకు అవకాశమెక్కడ
స్వామి వారు ఇప్పుడు తరుగుతున్నారు అనుట అసత్యమే
ఇంతకు ముందు తరిగారేమో కాని ఇప్పుడు ఆ అవకాశం అణుమాత్రమే
ఇప్పటికే శ్రీశైలాది క్షేత్రాల్లో కొత్త ఆలోచనలతో నూతన పంథాలు పోతూ ప్రాచీన పద్ధతులకు
స్వస్తి జెప్పి అపచారం చేస్తున్నారని, వాటి వల్ల జరగరాని విపరీత పరిణామాలు
జరిగిపోతున్నాయని ఇప్పటికే చాలా మంది భక్తులు వాపోతున్నారు.
ఇలాంటి తరుణంలో శ్రీశైల జ్యోతిర్లింగానికి బంగారు కవచం తొడిగి మరెన్నో విపరీత పరిణామాలకు
తావివ్వకుండా, యధావిధిని భక్తులకు స్పర్శ దర్శనాభిషేకాదులకు అవకాశం కల్పించి
మల్లన్న ఖ్యాతిని మరింత విఖ్యాతి నొన్దింతుదురు గాక
శివం భూయాత్
No comments:
Post a Comment