Thursday, 14 August 2014

బంగారు తెలంగాణ సాధనకు అతి ముఖ్యం కుటుంబ సర్వే

బంగారు తెలంగాణ సాధనకు అతి ముఖ్యం కుటుంబ సర్వే 


తెలంగాణ ప్రభుత్వం 19-8-2014 న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సర్వే ఇంతకుముందు జరగలేదు - అసలు ఇలా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలోకి రావటం కూడా జరగలేదు. KCR గారు తీసుకున్నఈ సర్వే ఖచ్చితంగా బంగారు తెలంగాణా వైపు తీసుకెళుతుంది. ఈ సర్వే ఆధారంగానే సరైన లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేసే వీలున్నది. ఇంత కాలం ప్రభుత్వ సొమ్ము సగానికి పైగా దోపిడీ దారులకు చేరిపోయింది. ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రకటిస్తూ వస్తున్నా చేరే వారికి చేరక, కాగితపు రాతలే అయిపోయాయి. ఇకపైన అలా జరగకుండా ఉండే విధంగా సర్వే దోహదపడుతుందనటంలో సందేహం లేదు. 


ఈ పటిష్టమైన సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది వెనుకబడి ఉన్నారు అన్న వివరాలే కాకుండా, ఎంతమంది వివిధ ఉద్యోగాల వారు ఉన్నారు, వివిధ భాషల వారు ఎంతమంది ఉన్నారు, వేరే రాష్ట్రాలకు చెందినవారు ఎంతమంది జీవిస్తున్నారు, వారి స్థితి గతులు తెలిసే వీలుంది.


అంతే గాక బీడీ కార్మికుల వివరాలు, వికలాంగుల వివరాలు, SC, ST, BC, OC ల వివరాలు, ముఖ్యంగా సంచార జాతుల వివరాలు, గిరిజనుల వివరాలు సమగ్రంగా ఈ సర్వే ద్వారా లభించే వీలున్నది. ఈ వివరాలు పూర్తిగా అందుబాటులో ఉన్నపుడే ఎవరు ఎంత వెనకబడి ఉన్నారు, ఎవరికీ ఏ విధమైన సహాయం అందించాలన్నది ప్రభుత్వం ఆలోచించడానికి అవకాశం లభించేది.


తెలంగాణాకు ఎంతో మేలు చేకూర్చే ఈ సర్వేను తెలంగాణా ఎన్నటికీ అభివృద్ది చెందకూడదు అని ఆశించేవారు అభ్యంతరం చెప్పడంలో వింతేమీ లేదు, అలాంటి వారి మాటలను, చేతలను తెలంగాణా వాదులు ఇంక పట్టించుకోవటమే మానాలి - పూర్తిగా తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి సారించాలి. ఈ సర్వే వల్ల తెలంగాణా అభివృద్ధి చెందడమే కాదు - తెలంగాణాలో నివసించే ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు. 


ఈ సర్వే వలన అసలైన అర్హులకు ప్రభుత్వ పథకాలు చేరే వీలు ఉంది. ఏనాడో జారీ చేసిన రేషన్ కార్డులు, వారు లేకున్నా, వారు తీసుకోకున్నా లిస్టులో ఇప్పటికీ ఉంటూ రేషన్ అంతా దుర్వినియోగం అవుతుంది. నాటికీ నేటికీ  చాలా మంది ఆర్ధిక స్థితిగతుల్ల్లో ఎంతో తేడాలు ఏర్పడ్డాయి. అవసరం లేనివి తొలిగిస్తే కాని అవసరం ఉన్న వారికి కొత్తవి జారీ చేసే అవకాశమే లభించదు. 

ఇళ్ళ పథకాలు లాంటివి చెప్పే పనేలేదు. మద్య దళారీలే సగానికి పైగా మింగేశారు. ఇది వాస్తవం - సత్యం. తిరగగా తిరగగా ఎవరికో కొంతమందికి కొంత డబ్బు కాని లేదా సిమెంట్ సంచీలు కానీ పడేశారు. అంతేగాని పూర్తి సొమ్ము పొందినవారు వేలకు ఏ ఒక్కరో ఉంటారు అంటే అతిశయోక్తి కాదు.

ఇక రేషన్ సంగతి చెప్పవలసిన పనే లేదు, తెల్ల కార్డులు ఆదాయ పత్రాలకు అవసరం పడతాయి అని తప్ప ఆ రేషన్ తెచ్చుకొనే తెచ్చుకొని వారి చాలామందే ఉన్నారు, అదంతా దుర్వినియోగం అయిపోతూనే ఉంది. 

ప్రభుత్వం చేసే ఇలాంటి పథకాలకు వేల కోట్లు ఖర్చు చేయబడుతూ ఉంటాయి. ఇవి వెళ్ళే వాళ్లకు వెళ్ళకుండా దోపిడీకి గురవుతూనే ఉన్నాయి.

ఇలా అయితే మనం ఎప్పుడు బాగుపడతాం, మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది. బాగుపడే వాడు బాగు పడుతూనే ఉంటాడు, వెనక బడ్డ వారు ఎలాంటి సహాయం అందక వెనక బడిపోతూనే ఉంటాడు.  వీటిని అరికడితే ఆ మిగిలే సొమ్ముతో అందరి ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పనులు చేయటానికి వీలు కలుగుతుంది.  మార్పు రావటం అందరికీ మంచిది - రాష్ట్రానికీ, దేశానికీ ఎంతో అభివృద్ధి దాయకం కూడా. 

అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఈ సర్వే జరుపుతుందో, అంతే ప్రాముఖ్యతతో కంప్యూటరైజెశన్ చేయాలి. ఇంత కష్టపడీ సమాచారం సేకరించి,   డేటాఎంట్రీ వర్క్ సరిగా జరగకపోతే అసలు ఫలితమే ఉండదు. ఇంతకు ముందు ప్రభుత్వాలు కావచ్చు మరెక్కడా కావచ్చు కంప్యూటరైజెశన్ పైన శ్రద్ధ చూపక పోవటం వలన రావాల్సిన ఫలితాలు అందనే లేవు - అవి తప్పుల తడకలే అయిపోయాయి. ఈ విషయంలో కూడా శ్రద్ధ చూపితే నూటికి నూరు శాతం సరైన వివరాలు పొందే వీలుంది. 









No comments:

Post a Comment