Wednesday 17 September 2014

తెలంగాణ ప్రజ ప్రజాస్వామ్యంలోకి అడుగిడిన శుభదినం



17 సెప్టెంబర్ 1948 తెలంగాణ చరిత్రలో ఒక చారిత్రాత్ర్మక దినం. వేల సంవత్సరాల రాజరిక పాలన నుండి  తెలంగాణ విముక్తిపొంది భారతదేశంలో విలీనమైపోయిన రోజు.  ఈ రోజు తెలంగాణ ప్రజలకే గాక నాటి నిజాం హైదరాబాదు రాజ్యంలో భాగమైన మహారాష్ట్ర (ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నాందేడ్, భీడ్,  పర్భణీ), కర్ణాటక (గుల్బర్గా, బీదర్, రాయచూరు) ప్రాంతప్రజలకు కూడా ఇది ప్రత్యేక దినం. ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలు ఈ రోజును పండగలా జరుపుకుంటారు. భారత దేశానికి 15 ఆగష్టు 1947 న స్వాతంత్ర్యం లభిస్తే తెలంగాణకు 17 సెప్టెంబర్ 1948 న స్వాతంత్ర్యం లభించింది.


జర యాదకరో ఖుర్బాని 

ఒకరు కారు ఇద్దరు కారు వేలమంది హైదరాబాదు స్వాతంత్ర్యానికై తమ ప్రాణాలర్పించారు. నిజాం రాజాకర్లకు ఎదురొడ్డి పోరాడిన వాళ్ళు ఎందఱో లెక్క చెప్పలేం. నిజానికి ప్రాణాలు కోల్పోయిన వారిలో నూటికి 10 శాతం మందికూడా వెలుగులోకి రాలేకపోయారు. నిజాం దౌర్జన్యాలకు బలైన మా తాత శంభయ్య లాంటి వారు ఎందఱో ఆచూకే తెలియకుండా పోయారు. భారతప్రభుత్వం గుర్తించిన వారిని స్వాతంత్ర్య పోరాట యోదులుగానే గౌరవించింది. భారతదేశంలోని మిగతా స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చిన సౌకర్యాలు, ఫించను ఇచ్చి గుర్తింపు నిచ్చింది. భారతదేశ చరిత్రలోనే కాదు యావత్ ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ స్వాతంత్ర్యపోరాటం తనకంటూ ఒక గుర్తింపును నిలుపుకుంది. ఆ వీరుల త్యాగాన్ని గుర్తుచేసుకుంటేనే వారి ఆత్మలకు శాంతి చేకూరేది.


క్రింది పత్రికా సమాచారం ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోలకొండ పత్రికల నుండి సేకరించబడినవి
ఆ పత్రికల వారికి కృతజ్ఞతలతో 

పక్క రాష్ట్రాలకు హెచ్చరిక 


రజాకర్ల దురంతాలు - పొరుగు ప్రాంతలపైనా దాడి 


రాయభారాలు విఫలం 

చర్య తీసుకోవాల్సిందే అన్న భారత నాయకులు 



రజాకర్ల దురంతాలను యావత్ భారత దేశంలోని ముస్లీములు కూడా వ్యతిరేకించారు 

జైలులో రజ్వీ నిరాహార దీక్ష 


సైనికచర్యకు దారితీసిన పరిస్థితులు 

ఎన్నో ఏళ్ల ముష్కర తురుష్కుల పాలనలో తెలంగాణ ప్రజ తన అస్తిత్వాన్నే కోల్పోయింది. కాకతీయ రాజుల నుండి ముష్కరుల పాలనలో వెళ్ళిన నాటి నుండి భారతదేశంలో విలీనం అయిన ఈ దినం వరకు దాదాపుగా 6 శతాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడటం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, టర్కీ ప్రాంతాలనుండి వలస వచ్చిన వీరు హిందూ దేవాలయాలు నాశనం చేయడమే గాక, హిందువులపై ఎన్నో ఆంక్షలు పెట్టారు, బలవంతంగా ముస్లీములుగా మార్చారు. హిందువుగా మనుగడ సాగించాలంటే పుట్టిన నుండి చచ్చేవరకు పన్నులు కట్టాల్సిందే.  బ్రిటీష్ వారికి విశ్వాసపాత్రునిగా నిజాంరాజు ప్రకటించుకుని వారికి ధనం చెల్లించే ఒప్పందం చేసుకుని హైదరాబాదు రాజ్యాన్ని భారతదేశంలో విలీనం అయ్యేవరకు నిరంకుశంగా పాలించాడు. ఈ రాజులు మొదట్లో పార్శీ ని రాజ భాషగా ప్రకటించుకున్నారు, తరువాత ఉర్దూ భాషని చేశారు. హైదరాబాదు రాజ్యంలో 85% తెలుగు మాట్లాడేవాళ్ళు ఉన్నా తెలుగుకి ఏమాత్రం ప్రాధాన్యత నీయక అణగదోక్కేశారు. తెలంగాణలో తెలుగుభాషకి అదొక చీకటి కాలంగా చెప్పవచ్చు. ఉర్దూ చదివిన వారికి మాత్రమె ఉద్యోగాలు లభించేవి. 1927 లో ఖాసీం రజ్వీ అనేవాడు మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) అనే సంస్థను స్థాపించి హైదరాబాదు రాజ్యంలోని ప్రజల పరిస్థితి బానిసలకంటే హీనంగా మార్చాడు. హైకోర్టులో లాయర్ వృత్తి చేసేవాడు సన్నిహితుడైన నిజాం ప్రధాని మీర్ లియాఖ్ అలీ ద్వారా 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజకీయ సలహాదారునిగా స్థానం సంపాదించి, నిజాంకు విషపు భొదలు చేసి చివరకు నిజాం రాజ్యపాలన అంతానికి దారి తీశాడు. ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన సంస్థలో వేలమంది సైనికులుగా చేరారు. ఈ MIM సంస్థను రాజకీయ పార్టీగా కూడా మార్చాడు ఖాసీం రజ్వీ. 

భారతదేశానికి స్వాతంత్ర్యం లభించనున్నదని తెలిసి చౌదరి రహ్మత్ అలీ అనేవాడు భారతదేశంలోని ముస్లీం ప్రాబల్యం ఉన్న సంస్థానాలకు ప్రజలకు ఆయా ప్రాంతాలను ముస్లీం రాజ్యాలుగా ప్రకటించవలసిందిగా 1933 లో ప్రకటన విడుదల చేశాడు. ఇప్పుడున్న పాకిస్తాన్ తో సహా భారతదేశంలోని పలు ప్రాంతాలకు "స్తాన్" అనే ఎండ్ తో నామకరణాలు చేశాడు. అందులో భారతదేశంలోనే అతి పెద్దదైన హైదరాబాదు సంస్థానానికి ఒస్మానిస్తాన్ అని పేరుతో ముస్లీం రాజ్యంగా ప్రకటించవలసిందని పిలుపునిచ్చాడు. ఆ చిత్రానికి సంబంధించి ఇక్కడ చూడండి:   
http://www.columbia.edu/itc/mealac/pritchett/00maplinks/modern/maps1947/rahmanalimapmax.jpg

నిజాం రాజు ప్రదానమంత్రి సన్నిహితుడైన ఖాసీం రజ్వీని పూర్తిగా విశ్వసించడంతో బాటు, లాయర్ అవడం వలన అతను చెప్పేవన్నీ నమ్మటం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తను ఇంకా రాజుగా కొనసాగుతానని భ్రమించి నిజాం రాజ్యంలో అతనికి, అతని సైన్యానికి పూర్తి స్వేచ్చనిచ్చాడు. నానాటికీ రజాకర్ల సైన్యం (ఖాసీం రజ్వీ ఏర్పాటు చేసిన సంస్థ సైన్యం) ఆగడాలు హెచ్చుమీరాయి. భారతదేశంలో హైదరాబాదు రాజ్యాన్ని కలపడానికి ప్రయత్నిస్తారని ముందుగానే హెచ్చరిస్తూ వేలమందిని అమాయక ప్రజలను చంపారు. దోపిడీలు, మానభంగాలకు అంతేలేక పోయింది. రజాకర్ల దోపిడీతో నిజాం ధనాగారం నిండిపోయింది, ఒక లారీలో తెచ్చిన బంగారం ఎక్కడ దింపాలో తోచక లరీతో సహా నిజాం నివాసంలోనే ఉంచారంటే అప్పుడు జరిగిన దోపిడీ ఎంతో అర్థం అవుతుంది (ఇది ఆనాటి ఆంధ్రప్రత్రికలో తెలుపబడిన విషయం - నిజాం గురించి చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిని మరో టపాలో ఉంచగలను). అంతవరకూ నిజాంపైన ఉన్న భయభక్తులు రజాకర్ల మితిమీరిన ఆగడాలతో తొలగిపోయాయి, ప్రజల్లో చైతన్యం వచ్చింది ఎదిరించి పోరాడారు. ఇక్కడ ఒక్క హిందువులనే కాక ముస్లీం ప్రజలు కూడా రజాకర్ల దౌర్జన్యాలను ఖండించారు, ఎదురుతిరిగిన షోయబుల్లాఖాన్ (పత్రికా విలేఖరి) లాంటి ముస్లీం నేతలనే చంపారు. మక్దూం మొహియుద్దీన్, మొహమ్మద్ హైదర్ లాంటివారెందరో రజాకర్ల దౌష్టికాలను వ్యతిరేకించారు. అంతేగాక చాల ఊర్లలో హిందువులకు ముస్లీములు రక్షణ కల్పించారు. 


సైనికచర్య 

భారతదేశానికి 1947 లో స్వాతంత్ర్యం వచ్చాక చౌదరి రహ్మత్ అలీ ప్రకటించినట్టు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పడ్డాయి. నిజాంపై ఒత్తిడి పెరిగింది దీంతో భారతదేశంలో హైదరాబాదు సంస్థానాన్ని కలపటానికి నిరాకరించాడు. బ్రిటీష్ వాళ్ళు నిజాంపైన ఉన్న ప్రేమతోనో లేక భారతంలో కల్లోలం సృష్టించాలనో కాని తమ ఆధీనంలోనే ఉన్నా కాశ్మీర్, హైదరాబాదు లాంటి సంస్థానాల చేరిక విషయాన్నీ వారికే ఆ సంస్థానలకే ఒదిలేశారు. నాటి ఉప ప్రధాని, హోంశాఖ మాత్యులైన సర్దార్ వల్లబాయ్ పటేల్ చొరవతో హైదరాబాదు తప్ప అన్ని సంస్థానాలు భారతప్రభుత్వంలో చేరిపోయాయి. రజాకార్ల నాయకుడు ఖాసీం రజ్వీ ఇంకో అడుగు ముందుకేసి భారత ప్రభుత్వంలో హైదరాబాదు చేరకపోవటమే కాదు ముంపు నిజాం రాజ్యంలో ఉండిన ప్రకనున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సైతం వశం చేసుకుంటామని, భారత ప్రభుత్వం అడ్డువస్తే యుద్దానికి సిద్దమని ప్రకటించాడు. ఎంతోమంది ద్వారా నిజాంకు భారత ప్రభుత్వానికి రాయబారాలు, లేఖలు నడిచాయి. ఇవి కొన్ని రోజులు కాదు సంవత్సరంపైనే జరిగాయి. నానాటికీ హైదరాబాదు ప్రజల జీవనానికి భద్రత లేకుండా పోయింది. హైదరాబాదును సందర్శించిన ప్రముఖులంతా సైనికచర్య తీసుకోవాలనే సూచించారు. అప్పటికే మతకల్లోలలతో అట్టుడుకి పోతున్న భారతప్రభుత్వం ఒకటికి పదిసార్లు ఆలోచించి చివరకు సైనికచర్యకే మొగ్గుచూపింది. హైదరాబాదుపైన సైనికచర్య తీసుకోబోతున్నారని తెలిసిన ఖాసీం రజ్వీ తమకు మద్దతు పలకవలసిందిగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు విజ్ఞప్తి చేశాడు, అంతేకాదు తప్పనిసరి పరిస్థితి వసతీ పాకిస్తాన్ లో విలీనం చేస్తాం అనే సందేశాన్ని ఇచ్చాడు. నిజాం కూడా జోక్యం చేసుకోవలసిందిగా మిత్రరాజ్య సమితికి విన్నవించే ప్రయత్నాలు చేశాడు. అనుకున్నదానికంటే ముందే భారత ప్రభుత్వం మేజర్ జనరల్ జయంతోనాథ్ చౌదరి అద్వర్యంలో హైదరాబాదుపైన సైనికచర్యను తీసుకుంది. సైనికచర్య జరిగినపుడు భారత సైన్యం హైదరాబాదు సంస్థానం లోకి ఎలా ప్రవేశించినవో తెలిపే మ్యాప్ కై కింద ఇచ్చిన లింక్ లో తెలుపబడింది:
http://www.columbia.edu/itc/mealac/pritchett/00maplinks/modern/maps1947/hyderabad1948.jpg


చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి, ఎటునుండీ సహాయం అందకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు, రజాకార్లు, సైనికులు యుదానికి తలపదవద్దని తన సొంత రేడియో ద్వారా ప్రకటించాడు. నిజాం తన హైదరాబాదు సంస్థానాన్ని 7-9-1947 న సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అప్పగించటం జరిగింది. తర్వాత నిజాం హైదరాబాదుకు రాజ్ ప్రాముఖ్ గా నియమించబడ్డాడు. హైదరాబాదు ప్రభుత్వం ఉన్నంతవరకు 1956 వరకు నిజాం రాజ్ ప్రాముఖ్ గా ఉన్నాడు, హైదరాబాద్ ఉభయ సభల్లో ప్రసంగించాడు కూడా.  తన చిట్టచివరి అసెంబ్లీ ప్రసంగంలో తాను ఇక ముందు మిమ్మల్ని కలవకపోవచ్చని ఎన్నో వందల ఏళ్ల నుండీ తన చేతుల మీదుగానే హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి పొంది తన చేతులుగానే 3 ముక్కలై పోవటం విచారకరమని కంటతడిపెట్టుకోవటం జరిగింది. ఇంతకాలం హైదరాబాదు కింది అన్నదమ్ముల్లా జీవించిన మీరంతా విడిపోయి ఇకపైన మూడు రాష్ట్రాల్లో కలిసిపోతుండటం బాధాకరమని ప్రసంగించటం జరిగింది.  ఎన్నో దురంతాలకు కారకుడైన ఖాసీం రజ్వీ, అతని అనుచరులను జైల్లో పెట్టడం జరిగింది. తన అనుచరులందరినీ విడిచిపెట్టాలని జైల్లో ఖాసీం రజ్వీ నిరాహారదీక్షలు కూడా చేశాడు. రజ్వీ జైలు నిండి 1957 లో విడుదలయ్యాక పాకిస్తాన్ వెళ్ళి అక్కడే శేష జీవితం గడిపి 1970 లో చనిపోయాడు.

హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యాక హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడి 1948 నుండి 1956 వరకు కొనసాగింది. తెలంగాణ హైదరాబాదు రాష్ట్రం ఆ సమయంలో మంచి అభివృద్దిలో సాగిపోయింది.  తెలంగాణ ప్రజలు ఆ కాలంలో ఎంతో ఆనందించారు. 1956 లో రాష్ట్రాల పునర్విభజన సమయంలో 3 ముక్కలై ఒక భాగం కర్ణాటక లో మరో భాగం మహారాష్ట్రలో కలవగా మిగిలిన తెలంగాణ భాగం  తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రరాష్ట్రంతో కలుపబడింది. తెలంగాణ ప్రజల కథ మళ్ళీ మొదటికొచ్చింది - మళ్ళీ పోరు బాట పట్టింది. 2014 లో స్వరాష్ట్రం సిద్ధించుకున్న తెలంగాణ ప్రజలు, తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలను పునర్నిర్మించుకోవటంలో ఇప్పుడు శ్రద్ధ చూపాల్సి ఉంది. కాకతీయుల నాటి పునర్వైభవం మళ్ళీ తిరిగి పొందటానికి ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క కెసిఆర్ అనే కాక ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు ఇందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 

జై తెలంగాణ
జై జై తెలంగాణ










No comments:

Post a Comment