Wednesday 20 August 2014

తెలంగాణ సర్వేకై ప్రజాస్పందన అపూర్వం - అధికారుల ప్రతిస్పందనే అల్పం

 తెలంగాణ సర్వేకై  ప్రజాస్పందన అపూర్వం - అధికారుల ప్రతిస్పందనే అల్పం 


నిన్న 19 ఆగష్టు 2014 న జరిగిన తెలంగాణా సమగ్ర సర్వేకి ఏనాడూ కనీవినీ ఎరుగని స్పందన రావటం విశేషం. తెలంగాణాను బంగారు తెలంగాణాగా మార్చాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయానికి తెలంగాణా ప్రజలు తమ సంపూర్ణ సుముఖతను, మద్దతును నిన్న జరిగిన ఈ సర్వే ద్వారా తెలియజెప్పడం జరిగింది. స్వచ్చందంగా రాష్ట్ర ప్రజలు తమ పనులన్నీ పక్కనబెట్టి సర్వేను విజయవంతం చేశారు. ప్రతి ఒక్క కుటుంబం ఈ సర్వేకై ఎంతో తమ విలువైన కాలాన్నే కాక ధనాన్ని వెచ్చించటం జరిగింది. కోటీశ్వరుని నుండి సామన్యుని వరకు ప్రతి ఒక్కరు సర్వేకై ముందుకు రావటం ఎంతో హర్షించదగ్గ విశేషం. కొందరు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని దూరప్రాంతాల నుండి వచ్చి సర్వేలో పాల్గొన్నారంటే తెలంగాణా బాగుకై ప్రజల్లో ఎంత ధృడ సంకల్పం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళేకాదు తెలంగాణలోని ప్రతి కుటుంబం ఈ సర్వేకై,  ఆ రోజు వచ్చే ఆదాయాన్ని కాదనుకోవటమే కాకుండా ధనాన్ని వెచ్చించటం జరిగింది. సర్వే కొరకు అన్ని పత్రాలు సిద్దం చేసుకోవటమే కాక వచ్చిన సర్వే వారికి అన్న పానీయాలు అందించటం జరిగింది. నిన్నటి సర్వేను విజయవంతం చేయడానికై వంద రూపాయల  నుండి కోట్ల రూపాయల వరకూ ఆ రోజు వచ్చే ఆదాయాన్ని వొదులుకున్న వారు ఉన్నారంటే, తెలంగాణా రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణా సాధనపై ఉన్న శ్రద్దను తెలియపరుస్తుంది.  

నిజానికి సర్వేలో పాల్గొనటం ఐచ్చికం అని అటు న్యాయస్థానంతో బాటు ఇటు తెలంగాణా ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఎవర్నీ బలవంత పెట్టటం జరగలేదు - అయినా నూటికి నూరు శాతం ప్రజలు స్వచ్చందంగా ముందుకు వచ్చి పాల్గొన్నారు. ఈ సర్వే అపురూపమే కాదు - అపూర్వం కూడా.

అయితే అధికారుల నిర్వాహణలోపం వలన ఈ సర్వే అన్ని జిల్లాల్లో నూటికి నూరు శాతం విజయవంతం కాలేకపోయింది. అధికారుల అంచనాలకు మించి సర్వే కుటుంబాలు ఉండటం ఒకటైతే. కొన్ని చోట్ల సకాలంలో సర్వే పత్రాలు అందకపోవటం, ప్రయాణలోపం, సౌకర్యాల లోపం, కావాల్సినంత సిబ్బందిని సమకూర్చుకోలేక పోవటం వంటివి 100% వరకూ సర్వేను తీసుకెళ్లలేకపోయింది. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి చేసినా హైదరాబాదు, వరంగల్ లాంటి పట్టణాల్లో మాత్రం ఒక్కరోజులో సర్వే సాధ్యం కాలేకపోయింది. 

ముఖ్యంగా హైదరాబాదులో సమగ్ర సర్వే నిర్వాహణలో GHMC విఫలమైందనే చెప్పవచ్చు. హైదరాబాదులో ఉండే కుటుంబాలను ముందుగా అంచనా వేయలేక పోవటం ఒక కారణమైతే, కావాల్సినంత సిబ్బందిని సమకూర్చుకోలేకపోవటం మరో కారణం. నిజానికి హైదరాబాదులో 3 రోజులు సర్వే కొనసాగింది. మొదటి రోజు ఇంటింటికి తిరిగి ఒక కరపత్రంతో బాటు చెక్ స్లిప్ కూడా ఇచ్చి వివరాలు నింపి ఇవ్వమని చెప్పటంతో బాటు జిరాక్స్ కాపీలు కూడా తీసి ఉంచాలని చెప్పటంతో అంతా జిరాక్స్ కి క్యూ కట్టటం జరిగింది. చివరికి ఆ స్లిప్స్ సేకరణనే జరగలేదు. 

స్టిక్కర్స్ అంటించిన 17వ తేదీ నాడే GHMC పరిధిలో ఉన్న మొత్తం కుటుంబాలను గుర్తించటం జరిగింది. కాగా అందుకు అవసరమయ్యే సిబ్బంది లోపం జరిగింది. ఉన్నవారికే ఎక్కువ ఇళ్ళ సర్వేను పంచటం, ఫుడ్ లాంటి సౌకర్యాలు లభించకపోవటం, డబ్బులు తక్కువ ఇస్తారు అని తెలిసి వచ్చిన వారిలో కొందరు విద్యార్థులు, ప్రైవేట్ టీచర్స్ వెనుదిరిగి వెళ్ళటం జరిగింది. దాంతో స్టికర్స్ అంటించిన ఇళ్ళను కూడా పూర్తిగా సర్వే చేయలేకపోవటం జరిగింది. ఉన్న సర్వే సిబ్బందే ఎంతో ఓపికతో రాత్రి పదింటి వరకు కూడా సర్వే చేయటం జరిగింది (అయినా వేలాది ఇళ్ళు మిగిలిపోయాయి). సర్వేలో పాల్గొన్న విద్యార్థులు, ఇతరులకు కూడా ముందు ఇస్తామని చెప్పిన డబ్బులు (500 నుండి 350 వరకు చెప్పారట) ఇవ్వక, తలా రోజుకు 100 లేదా 150, 200 ఇలా ఒక్కోచోట ఒక్కో విధంగా ఇచ్చి పంపటం జరిగింది. ఆ డబ్బులు కూడా రాత్రి పదకొండు వరకు వేచి ఉన్నవాళ్లకే ఇవ్వటం జరిగింది. తెలంగాణాకై అంకితభావంతో తిండి తిప్పలు మాని అర్థరాత్రి వరకూ వీరు పనిచేయటం కొనియాడదగిన విషయం. ఇలాంటి ఔత్సాహికులను నిరుత్సాహపరిస్తే భవిష్యత్ లో ఇంకేదైనా అవసరాలకు ముందుకు రావటం కష్టమే. ఈ విషయాలన్నీ ఇక్కడ ప్రస్తావించడానికి ప్రధానకారణం - ప్రజల్లో తెలంగాణా పట్ల ఉన్న ఉత్సాహం - ఆ ఉత్సాహాన్నే నీరుగారుస్తున్న అధికారుల వైనం. ఈ సర్వేలో ఆడవాళ్ళు కూడా విశేషంగా ముందుకు వచ్చి పాల్గోవటం జరిగింది. 

ఏ పనైనా నూటికి నూరు శాతం అనుకున్నట్టు జరగటం అసంభవమే. అయినా ఈ సర్వే వలన కావలనుకున్నది తెలంగాణా ప్రభుత్వం నూటికి 95% వరకు పొందినట్లే.  ఇక హైదరాబాదు లాంటి మహానగరాల్లో ఒక్కరోజులో సర్వే  చేయటం అన్నది చిన్న విషయం కాదు. అయినా జరిగిన లోపాలు దృష్టిలో ఉంచుకుంటే రాబోయే రోజుల్లో అయినా అనుకున్నవి సజావుగా జరిగే వీలుంటుంది. అంతేకాక ఇలాంటి సందర్భాల్లో ఎన్నికల సమయంలో మాదిరిగా మంత్రులు, MP, MLAలు పర్యవేక్షణ చేస్తూ పర్యటిస్తే అధికారులు అలసత్వం వీడి  చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది.  

    

No comments:

Post a Comment