Saturday 28 June 2014

తెలంగాణ తేజం - అపర చాణక్య

తెలంగాణ తేజం - అపర చాణక్య 

భారతదేశంలో అపర చాణక్య అని ఒక బిరుదులా ప్రసిద్ది పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పి.వి. నరసింహారావు గారు. పూర్తిగా తెలంగాణా తత్త్వం మూర్తీభవించిన మహా వ్యక్తి. అటు సాహిత్యంలోను, ఇటు రాజకీయంలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలంగాణాకే ఒక మకుటాయ మానమయ్యారు. 

ఒక బ్రాహ్మణుడిగా, ఒక తెలంగాణా వాదిగా, తనకంటూ ఒక గ్రూప్ తో లేకపోయినా తన మంచితనం, రాజనీతజ్ఞతతో  ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అందరికంటే ఉన్నత స్థానంలో నిలిచారు. రాష్ట్రంలోనే కాక దేశంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. 

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జై ఆంద్ర ఉద్యమం రావటం తెలంగాణా వాదిగా సీమాంద్ర నాయకులతో ఎన్నో అవరోధాలను ఎదుర్కోవటం జరిగింది - చివరకు రాష్ట్రపతి పాలన విధించటం కూడా జరిగింది. 

తరువాత కూడా ఎవరెన్ని అవరోధాలు కల్పించినా కేంద్రంలో తనకంటూ ఒక విశిష్ట స్థానం సంపాదించుకుని రాజీవ్ గాంధీ  తరువాత పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. ప్రధానమంత్రి పదవిని చేపట్టి దేశాన్ని ఆర్థికంగా ప్రగతిపథంలో నడిపించిన మహానాయకుడు. తనదైన రాజనీతితో ఎన్నో అడ్డంకులను అధిగమించి, శత్రువులను సహితం తన వైపు తిప్పుకొని అయిదేళ్ళు పూర్తికాలం ప్రధానమంత్రిగా పరిపాలన చేసి, అపర చాణక్యునిగా ఆ సమయంలోనే పేరు గడించారు. 

ఆయన పరిపాలన ఒక అద్భుతమైతే - ఆయన రాజనీతిజ్ఞత ఆశ్చర్యజనకం. ఆయన ఒక్క తెలంగాణాకే కాక భారతదేశానికే గర్వకారణం.

కాని విచారమేమంటే అంతటి మేధావికి మరణానంతరం తగిన గౌరవం లభించలేదు కదా ఒక మాజీ భారత ప్రధానికి దక్కాల్సిన గౌరవం కూడా లభించలేదు - అంత గొప్ప మనిషికి డిల్లీ లోనే కాదు కుటిల ఆంద్ర పాలకుల స్వరాష్ట్రంలోనూ ఒక స్మారక స్థానం నెలకొల్ప బడలేదు. 

కాగా పార్టీ సిద్దాంతాలను పక్కన బెట్టి ముఖ్యమంత్రి KCR గారు తెలంగాణా స్వరాష్ట్రంలో ఒక తెలంగాణా గొప్ప వ్యక్తిని స్మరిస్తూ పి .వి. నరసింహారావు గారి జయంతిని అధికారికంగా జరపడం, మునుముందు కూడా ఆయన స్మృత్యర్థం ఇంకా ఎన్నో కార్యక్రామాలు చేపడతామనటం KCR గారి గొప్పతనానికి, ఆయన ధృడమైన తెలంగాణా తత్వానికి నిలువెత్తు నిదర్శనం. ప్రతి తెలంగాణా వాది హర్షించి, గర్వపడే గొప్ప విషయం.

ఆలస్యంగానైనా తగిన గౌరవాలు లభించడం వల్ల స్వర్గీయులైన పి.వి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరి, బంగారు  తెలంగాణాకు ఆశీస్సులు అందజేస్తుందనటంలో అతిశయోక్తి లేదు. 








2 comments:

  1. I am from Andhra and I have been looking for this day from a long time to give a befitting tribute to this great soul. Commend KCR for making it a state function. I wish PVN's statues get established all across the country.

    ReplyDelete